కూటమి పాలనలో పవన్ పేజీలు కొన్ని మిస్సింగ్?
posted on Oct 14, 2025 @ 10:06AM
మాములుగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఇటు సీఎం చంద్రబాబుతో పాటు, అటు పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా పెడుతుంటారు. అంటే ముఖ్యమంత్రే కాక, ఉప ముఖ్యమంత్రి కి కూడా ప్రభుత్వంలో విలువ ఉందని చెప్పడానికిదో నిదర్శనం అన్నమాట. అలాంటిది కొన్ని ప్రభుత్వ కార్యకలాపాల్లో పవన్ కళ్యాణ్ ఎందుకు కనిపించరు? తాజాగా సీఆర్డీఏ భవన ప్రారంభోత్సవమే తీసుకుందాం. ఈ కార్యక్రమానికి పవన్ ఎందుకు దూరంగా ఉన్నారు? అన్నదిపుడు ప్రశ్నగా మారింది.
ఇదేమంత చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇక్కడి నుంచే అమరావతి దశ- దిశ రూపకల్పన జరగనుంది. ఇప్పటి వరకూ అమరావతి అంటే నీట మునిగే నగరం అన్న వైసీపీ ట్రోలింగులు చూసే ఉంటాం. దీన్ని క్వాంటం వాలీ అనడం కన్నా ఆక్వా వాలీ అనొచ్చు, ఆపై పులస కూడా ఇక్కడ దొరికే చాన్సుందన్న వ్యంగ్యాస్త్రాల సంగతి సరే సరి. ఈ క్రమంలో ఇక్కడొక పాలనా భవనం ప్రారంభం కావడం అన్నది అమరావతి అభివృద్ధికే ఒక దిక్సూచిలాంటిది. అలాంటి భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవన్ మాత్రమే కాదు.. కూటమిలో మరో పార్టీ అయిన బీజేపీ సైతం అస్సలు రాలేదు.
వీరికి ఆహ్వానం లేదా? లేక వారే లైట్ తీస్కున్నారా? అన్నది తెలీడం లేదు. అదేమంటే సరిగ్గా ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ పాత ఫోటో ఒకటి పట్టుకుని యువత ఉచితాలు అడగటం లేదని.. వారి ప్రతిభా పాటవాలు వెలికి తీయాల్సిన అవసరముందన్న కోణంలో ఒక ట్వీట్ చేయడంతో ఇప్పుడది వైరల్ అయ్యింది.
మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇన్నేసి ఉచిత హామీలు ఎందుకిచ్చినట్టు? తానే స్వయంగా నియోజకవర్గానికి 500 మంది చొప్పున ఎంపిక చేసి 10 లక్షల రూపాయలు ఇస్తామన్నారు? దాని సంగతేంటి? అన్న చర్చకు తెరలేపారు పవన్. వైరల్ ఫీవర్ ఇంకా ఉందని హైదరాబాద్ లో పడి ఉండక, ఈ వైరల్ కంటెంట్ రైజ్ చేయడం దేనికీ? అన్నది కూటమిలోని ప్రధాన పార్టీకి చెందిన టీడీపీ నాయకులు అంటోన్న మాట.
దానికి తోడు కూటమికే బీటలు వారేలాంటి వినుత కోట- సుధీర్ రెడ్డి వ్యవహారం ఒకటి పవన్ కళ్యాణ్ ని పట్టి పీడిస్తున్నట్టు సమాచారం. ఈ కోణంలోగానీ ఆయన సీఆర్డీఏ భవన ప్రారంభోత్సవానికి రాలేదనుకోవాలా? ఒక వేళ పవన్ గానీ ఈ సెర్మనీకి వచ్చి ఉంటే, జన సైనికులు పలు రకాల కామెంట్లకు తెరలేపుతారన్న భయం కొద్దీ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారనుకోవాలా!?
అది సరే.. పవన్ కంటే ఇటు పర్సనల్ ప్రాబ్లమ్స్ అటు పార్టీ ప్రాబ్లమ్స్ చాలానే. మరి బీజేపీ ఎందుకు మిస్ అయినట్టు? అసలు కూటమిలో ఈ మూడు పార్టీల సంబంధాలూ సవ్యంగానే ఉంటున్నాయా? వీరి మధ్య పొరపచ్చాలేం లేవు కదా? అన్నది మరో ప్రశ్న. మిథున్ రెడ్డి విషయంలో బీజేపీ చూపిస్తున్న సానుకూల వైఖరి కారణంగా ఈ ఎడబాటు ఏర్పడిందా? కూటమి పార్టీల్లో అసలేం జరుగుతోంది? అన్న వాడి వేడి చర్చకు తెరలేచింది.