మూడు సిలండర్ల మతలబు
posted on Oct 26, 2012 @ 1:43PM
సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల విషయంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రం కుప్పిగంతులు వేస్తున్నాయి. సబ్సిడీ సిలండర్ల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం ఆరుకు తెగ్గోసేసింది. ఆ ఆరింటికి కూడా పూర్తి డబ్బు ముందుగా కట్టేస్తే, సబ్సిడీ మొత్తాన్ని తీరిగ్గా వినియోగదారుల బ్యాంకు ఎకౌంట్లలో వేసే ఆలోచన చేస్తున్నారు. గ్యాస్ బండను మధ్యతరగతికి గుదిబండగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహం చూపుతుంటే, వాతలెట్టి జోలపాట పాడినట్టుగా కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మరో మూడు సిలిండర్ల సబ్సిడీ భారాన్ని అప్పగించారు. అయితే ఈ భారాన్ని మోయడానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలేవీ సుముఖంగా లేవు. కేవలం గుజరాత్‌లో ఎన్నికల ప్రచార నిమిత్తమే సోనియా ఈ మాట అన్నారు కానీ, పట్టుబట్టి అమలు చేయించే ఉద్దేశం ఏమీ లేదని అంటున్నారు. మన రాష్ట్రంలో పరిస్థితే దీనికి ఉదాహరణ. సోనియాగాంధీ ప్రకటన చేసి వారాలు గడుస్తున్నా దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. కేవలం దీపం పథకం లబ్ధిదారులకు మాత్రమే మూడు సిలండర్లు ఇస్తామని ప్రభుత్వం మెలికపెట్టింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరికి పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా కిరణ్ సర్కారు తీరుపై రుసరుసలాడారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మాత్రం... ప్రధాని మన్మోహన్ టైపులో ‘డబ్బులేమన్నా చెట్లకు కాస్తున్నాయా’ అంటున్నారు. వెక్కిరిస్తున్న ఖాళీ ఖజానాను చూపిస్తున్నారు.