కాంగ్రెస్‌లో మరో వికెట్ డౌన్
posted on Oct 26, 2012 @ 1:41PM
మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. నవంబర్ 19న జగన్ పార్టీలో చేరడానికి ఆయన ముహూర్తం పెట్టుకున్నారు. ఇందిరాగాంధీ హయాంలో జలగం కుటుంబానికి కాంగ్రెస్‌లో చాలా ప్రాధాన్యం ఇచ్చారు. జలగం అంటే ఇందిరాగాంధీకి ప్రత్యేక అభిమానం వుండేది. ఆ అభిమానంతోనే ముఖ్యమంత్రి పదవికూడా ఇచ్చారు. అయితే పూర్వపు గుర్తింపు లభించడం లేదని కుమారుడు ఆగ్రహంతో వున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ ఇవ్వనందుకు గుర్రుగా వున్నారు. తనకు టిక్కెట్ ఇచ్చి వుంటే ఖమ్మం జిల్లాలో కనీసం పది అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్ గెలుచుకునేదని, టిక్కెట్ ఇవ్వని కారణంగా ఐదు చోట్ల పార్టీ ఓడిపోయిందని జలగం వెంకటరావు అన్నారు. అంటే తనకు టిక్కెట్ దక్కలేదనే దుగ్ధతో ఐదు స్థానాల్లో కాంగ్రెస్ పరాజయం పాలవడానికి ఆయన పరోక్షంగా కృషి చేశారని అనుకోవాలా? ఐదు సీట్లలో గెలుపు ఓటములను నిర్ణయించగల సామర్ధ్యం వున్న వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిర్లక్ష్యం చేసినట్టు? ఇవి సమాధానం లేని ప్రశ్నలు.