ఆధార్ అందేదెప్పుడు ?
posted on Oct 17, 2012 @ 10:08AM
ఆధార్ ఉంటే అన్ని ఉన్నట్లే అని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఈ ప్రకటనల పరంపర రాష్ట్రంలో కీలకమైన తూర్పుగోదావరి జిల్లాలో ఆధార్‌కేంద్రాలకు భారీ స్పందన వచ్చింది. దీంతో దేశంలోనే అత్యధిక ఆధార్‌కార్డుల వివరాలు నమోదు చేసుకున్న జిల్లాగా దీనికి పేరు వచ్చింది. ఈ మేరకు ప్రశాంసాపత్రాలు కూడా అందించారు. అయితే ఈ జిల్లాలో ఇంకా కార్డులు రాలేదని అన్ని ప్రాంతాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడ నగరంలో 16 నుంచి 25శాతంలోపు వారికి మాత్రమే కార్డులు అందాయి. అలానే రాజమండ్రి నగరంలో 20శాతం, అమలాపురం పట్టణంలో 18శాతం కార్డులు అందజేశారు. మిగిలిన పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కార్డులు అందని వారి సంఖ్య కోకొల్లలు. ఫొటోలు తీసుకుని నమోదు ప్రక్రియ పూర్తి చేసిన 45రోజుల్లోపు కార్డులు మీ ఇళ్లకు చేరుతాయని ఆధార్‌సిబ్బంది సమాచారం ఇస్తుంటారు. ఈ కార్డులు రాలేదన్న విషయం తెలుసుకుని వారు కూడా ఆశ్చర్యపోతున్నారు. మా కార్డులు ఎప్పుడు ఇస్తారని రెవెన్యూ అధికారులపై గ్రామీణులు విరుచుకుపడుతున్నారు. అసలు ఫొటోలు తీయించుకోవటంలో శ్రద్ధ చూపించి కార్డులు మంజూరు చేయకపోతే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు.