వేదిక కుప్పకూలడంతో గాయపడ్డ చంద్రబాబు
posted on Oct 27, 2012 @ 10:13AM
చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర శనివారం కొనసాగడం అనుమానంగానే కనిపిస్తోంది. శుక్రవారం రాత్రి గద్వాలలో బహిరంగసభ వేదిక ఒక్కసారిగా కూలడంతో ఆయన వెన్నుపూసకు గాయం అయింది. సభ దగ్గరనుండి ఓ కిలోమీటరున్నర నడిచిన చంద్రబాబు ఆ తరువాత నడవలేక తన వెంట వచ్చే వాహనం తెప్పించుకుని అందులో విశ్రాంతి తీసుకున్నారు. ఆ తరువాత మరి కొంత దూరం నడిచి మరింత ముందుకు వెళ్లలేక తాను బస చేయాల్సిన చోటుకంటే ముందే ఆయన ఆగిపోయారు. వైద్యుల సలహామేరకు ఆయన యాత్రకు శనివారం విశ్రాంతి ఇవ్వవచ్చని తెలుస్తోంది. శనివారం గద్వాల, శెట్టి ఆత్మకూర్, ఈడిగోనిపల్లి, మదనపల్లి, పెద్దపాడు, పెద్ద చింతలరేవు, జూరాల ప్రాజెక్టు వరకు యాత్ర సాగాల్సి ఉంది. హైదరాబాద్ నుండి వచ్చిన వైద్యులు ఆయన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఎక్స్ రే తీసిన అనంతరం వైద్యులు రెండురోజుల విశ్రాంతి అవసరమని సూచించారు. ఇప్పటికే 500 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేసినందున విశ్రాంతి అవసరమని చెప్పారని పార్టీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. విశ్రాంతి తీసుకోవాలని బాబును కోరతామని ఆయన వెల్లడించారు. వేదిక కూలిన సంఘటనలో చంద్రబాబుతో పాటు గద్వాల మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ లత్తిపురం వెంకటరామిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ అక్కల రమాదేవి, టీడీపీ జిల్లా కార్యదర్శి రాములు, చేనేత కార్మికులు గోపీనాథ్, లలితమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు స్వల్ప గాయాలయ్యాయి.