బాబు కు ఒక రోజు విరామం, వెన్నుకు స్వల్ప గాయం
posted on Oct 27, 2012 @ 11:32AM
వైద్యుల సూచనలు, నేతల ఒత్తిడి మేరకు పాదయాత్రలో ఈ రోజు విశ్రాంతి తీసుకొనేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అంగీకరించారు. ఈ రోజు ఉదయం వైద్యులు పరీక్షలు నిర్వహించి విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. చంద్రబాబుకు ఫ్యాక్చర్ ఏమీ లేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు రావుల చంద్రశేఖర రెడ్డి చెప్పారు. వైద్యుల సూచన మేరకు శనివారం పాదయాత్రకు విరామం ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించరని చెప్పారు. శుక్రవారం రాత్రి గద్వాలలో బహిరంగసభ వేదిక ఒక్కసారిగా కూలడంతో ఆయన వెన్నుపూసకు గాయం అయింది. సభ దగ్గరనుండి ఓ కిలోమీటరున్నర నడిచిన చంద్రబాబు ఆ తరువాత నడవలేక తన వెంట వచ్చే వాహనం తెప్పించుకుని అందులో విశ్రాంతి తీసుకున్నారు. ఆ తరువాత మరి కొంత దూరం నడిచి మరింత ముందుకు వెళ్లలేక తాను బస చేయాల్సిన చోటుకంటే ముందే ఆయన ఆగిపోయారు. హైదరాబాద్ నుండి వచ్చిన వైద్యులు ఆయన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఎక్స్ రే తీసిన అనంతరం వైద్యులు రెండురోజుల విశ్రాంతి అవసరమని సూచించారు. సమాచారం అందిన వెంటనే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్ గద్వాలకు బయలుదేరి వచ్చారు.