శ్రీరాముడికీ బీజేపీ సభ్యత్వం.. ఆ విషయం ఆయనకు తెలుసా అరవిందా?

Publish Date:Jan 17, 2026

(శ్రీరాముడికీ బీజేపీ సభ్యత్వం ఉంది.. ధర్మపురి అరవింద్) మొన్నామధ్య  వూరి పెద్ద బస్టాండ్‌లో మిట్టమధ్యాన్నం కాషాయ దుస్తుల్లో ఒకాయన బస్సుదిగాడు. మెల్లగా చెట్టు నీడలోకి వచ్చి సోడా తాగి బెంచీ మీద కూచున్నాడు. అప్పటిదాకా కాగితంతో ఆడుతున్న కుక్కపిల్లతో సహా అక్కడ బెంచీల మీద కూచున్నాళ్లంతా ఆయన్నే చూస్తుండిపోయారు. ఓ అరగంట తర్వాత బస్సు క్లీనర్‌ దగ్గరగా వెళ్లి పలకరించాడు..‘సామీ ఎవరు మీరు? ఇక్కడ ఎవరు కావాల?’ అని. చిన్న గడ్డం సవరించుకుంటూ ‘నర్సిమ్మ కొట్టుకెల్లి   బీడీకట్టట్టుకురారా అంటూ ఆ స్వామి ఆదేశించాడు. అంతే ఆయన మాటతీరు  బాగా దగ్గరగా చూసిన ఆ కుర్రాడు.. ఒరేయ్‌  ఈడు సాములోరు గాదురా.. మన  సత్తిగాడు అని గావుకేక వేశాడు. ఏదో వజ్రాన్ని కనుగొన్నట్టు బస్టాండ్‌ అంతా పరిగెడుతూ అందరికీ స్వామి అసలు పేరుతో సహా ప్రకటించాడు. అంతే వీలయినంతమంది సత్తి చుట్టూ చేరి  అయినా ఇదేం యాశంరా ’ అంటూ ప్రేమగానే తిట్టారు.  సదరు స్వామి నవ్వి,  వేషం మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. వీధిపేరు, ఊళ్లో బావిపేరు, మున్సిపల్‌ స్కూలు పేరు.. ఇలా అన్నీ  మార్చేస్తున్నారు. నన్నూ మారుస్తారని  ముందుగా నేనే మారిపోయాను. ఎవరో మనల్ని మార్చడం కన్నా మనకు మనము మారడం ఉత్తమం కదా  అన్నాడు స్వామి సత్తి.అందరూ తలగోక్కున్నారు. వీడిలానే వీడి మాటా అర్దమై చావదు, ఏం చెబుతున్నావో సరింగజెప్పరా పిచ్చి సన్నాసీ  అని అరిచింది అరటిపళ్లు అమ్మే ముసలామె. గొంతు సవరించుకుని సత్తి సామి..  అంతా రామమయం  అంటే కేవలం సినిమాలో ఎస్పీ గొంతు చించుకున్న పాటే అనుకున్నామా, కానీ  అది అంతటితో ఆగలేదు, అంతా రామమయం అంటే అంతటా, అన్నింటా రామమయం చేయాలని కొందరు కాషాయాలు బిగించారు. మీకింకా ఆ సంగతి తెలియలేదు. తెలిసేప్పటికీ మీ ఇళ్ల పేర్లన్నీ రాముడితో, కృష్ణుడితో నిండిపోతాయి నాయనలారా  అంటూ జ్ణానబోధ చేశాడు స్వామి సత్తి.  అదెట్టా? అడిగారు కొందరు. దేవర తలచుకుంటే ఊరేం ఖర్మ దేశమే పేరు మార్చుకుంటుంది. భరతావని మనది. జండా పట్టుకుని చాలా చక్కగా నవ్వుతూ నిలబడి ఉంటుంది. ఆ మాతను మనసులో నిలుపుకుని అంతే పద్దతిలో మనం నడచుకోవాలి అని  ఏలికలు నువ్వూ నేనూ చూడని పాతతరం సీనియర్‌ నాయకుల స్ఫూర్తితో, భక్తి రసం తలకెక్కించుకుని రైల్లో, విమానాల్లో బయలుదేరి వీలయినన్ని ప్రాంతాలు, భవనాలు, కూడళ్లు, గ్రామాల పేర్లు అమాంతం మార్చేస్తున్నారు. అదో దండు. లోకంలో వారిని మించిన రామభక్తులు ఉండటం అసాధ్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మీ యింట్లో పెద్దతరం వారూ వీళ్ల ముందు బలాదూర్‌. బతికిబట్టకట్టమంటూ ఇచ్చే కార్డు ముక్క కూడా స్వయంగా రాములవారి భిక్షట. ఏలిక స్వయంగా రామభక్తుడు. అందువల్ల ప్రజలంతా చచ్చినట్టు రామసంకీర్తనతోనే కార్యాలయాల్లో, బడిలో కాలం గడపాలేగాని వేరే లోకం ఉండకూడదు.  అలాగాకుంటే ఆంజనేయులవారికి చెడ్డ కోపం వస్తుందని, కండల మీద బొమ్మలు వేసుకున్న వస్తాదులు ఊరూరా తిరుగుతున్నారు.ఈ భక్తి పారవశ్యంలో వీలయినన్ని ఊళ్లు, బజార్లు, బస్టాండ్ల పేర్లు మారుస్తూ పోతున్నారు. అలవాటులో పొరపాటుగా నా పేరూ మార్చేస్తారేమోనని ముందు జాగ్రత్తకోసం కాషాయం ధరించా.  ఇంతలో ఎవరో సైకిల్‌ మీద పోతూ ‘జై శ్రీరామ్‌!’ అని అరుస్తూ వెళ్లాడు.   కొంత దూరం వెళ్లి ఆగి మళ్లీ  వెనక్కి వచ్చి అటుగా సిగెరెట్టు తాగుతూ వెళుతోన్న కుర్రాడిని అడ్డగించాడు. నీకు దేశభక్తి లేకపోతే ఎలాగయ్యా.. ఏలిక దేశ ప్రగతి కోసం  సంస్కృతిని కాపాడేందుకు ఎంత చమటోడుస్తున్నాడు.. జైశ్రీరామ్‌ అను ఆయనకు ఉపశమనం కలుగుతుంది అన్నాడు.  ఛస్తే అన్ను.. ఆయనకు దురదేస్తే.. నేను గోక్కోడం ఏమిటయ్యా బుద్ధుందా?’ అని ఎదురు తిరిగాడు.. అంతే ఓ అరగంట అలా గొంతు చించుకున్నారు. ఆనక అలసిపోయి విడిపోయారు.  రాములవారికీ పార్టీ సభ్యత్వం అంటగట్టినవారు దేశాన్ని ఒకే రంగు పులిమి ఓట్లు గుద్దించుకోవడమనే వారి భవిష్యత్‌ ప్రణాళిక. డబ్బు చేసినవాడికి జబ్బో లెక్కా.. రాముడిని ఎలాగయినా వాడుకోవచ్చని నిర్ధారించుకున్నాక కౌసల్య రూపంలో ఎవరు గుండెలు బాదుకున్నా ఏమీ కాదు..!

విజయసాయికి ఈడీ నోటీసులు.. జగన్ కు ప్రమద ఘంటికలేనా?

Publish Date:Jan 17, 2026

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ముఖ్యంగా మద్యం కుంభకోణం దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ పునాదులను కదిపే దిశగా సాగుతోందనడానికి తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి నోటీసులు పంపడమే తార్కాణమంటున్నారు పరిశీలకులు. ఔను మాజీ ఎంపీ, మాజీ వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డిని ఈ నెల 22న విచారణకు రావాల్సిందిగా ఈడీ నోటీసులు పంపింది. అది మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ విజయసాయిని ప్రశ్నించనుంది. ఇప్పటికే ఇదే కేసులో విజయసాయి రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారించింది. ఆ సిట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినది. అయితే ఈడీ మాత్రం కేంద్ర పరిధిలోది. ఇక్కడే అంటే ఈడీ విజయసాయిని మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడమే జగన్ కు ప్రమాదఘంటికలు మోగినట్లేనా అన్న అనుమానాలకు తావిస్తున్నాయి.  ఎందుకంటే సిట్ విచారణ సందర్భంగానే విజయసాయి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం ఎలా జరిగిందో, వైసీపీలో ఎవరెవరు ఈ కుంభకోణంలో ఎలాంటి పాత్ర పోషించారో పేర్లతో సహా పూస గుచ్చినట్లు చెప్పేశారు.  అప్పట్లో విజయసాయి రెడ్డి చెప్పిన విషయాలను వైసీపీయులెవరే కూడా గట్టిగా ఖండించడానికి ముందుకు రాలేదు.  విజయసాయి రెడ్డి రాజ్యసభ పదవికి, పార్టీకి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకున్నప్పుడు ఇలాంటి కేసుల నుంచి రక్షణ కోసమే ఆ పని చేశారని అప్పట్లో గట్టిగా వినిపించింది. అయితే ఇప్పుడు ఆయనకు   ఈడీ నోటీస్ అందడం చూస్తుంటే.. కేంద్రం నుంచే ఈ కేసు విషయంలో అంతిమ లబ్ధిదారు ఎవరన్నది తేల్చాలన్న ఒత్తిడి వస్తున్నదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   జగన్‌ తాడేపల్లి ప్యాలస్‌లో నుంచి కాలు బయటకు పెట్టకపోయినా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని రప్పారప్పా ఆడిస్తానంటూ విమర్శలు గుప్పించడమే కాదు.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని గట్టిగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల చంద్రబాబు హస్తిన పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. వారి మధ్య చర్చ ప్రభుత్వ ప్రగతి, సంక్షేమ పథకాలకు జగన్ అడుగడుగునా అడ్డుపడటంపైనే సాగిందని కూడా అప్పట్లో గట్టిగా ప్రచారం జరిగింది.  ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో  విజయసాయి రెడ్డికి కేంద్ర ప్రభుత్వం అధీనంలో పనిచేసే ఈడీ నోటీస్ పంపడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  విజయసాయికి ఈడీ  నోటీస్ పంపడాన్ని ఈ కేసులో ఆయన ప్రమేయం ఉందా లేదా? అని కనుగొనేందుకు మాత్రమే కాక.. మరేదో కారణం ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం.  ఆయన నోట మద్యం కుంభకోణం కేసులో అంతిమ లబ్ధిదారు దిశగా కీలక ముందడుగు పడటానికి విజయసాయిరెడ్డి విచారణ కీలకంగా మారనుందన్న అభిప్రాయమూ గట్టిగా వినిపిస్తోంది.  ఏది ఏమైనా విజయసాయికి ఈడీ నోటీసులు జగన్ రెడ్డికి ప్రమాదఘంటికలు మోగడమే అంటున్నారు. 

మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Publish Date:Aug 28, 2025

  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు. కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవని  ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు.  . రాష్ట్రీయ స్వయం సేవక్‌  సంఘ్‌ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్‌ భగవత్‌..  బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్‌ఎస్‌ఎస్‌ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం  .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.  నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్‌ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయాలు తీసుకుంటుందని  ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.  

చాణక్యుడు చెప్పిన రహస్యం ఇది.. జీవితంలో శాంతి లేకపోవడానికి కారణాలు ఇవే!

Publish Date:Jan 17, 2026

ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త.. ఆయన 2వేల సంవత్సరాల కిందట చెప్పిన మాటలు నేటికీ అనుసరణీయంగా ఉన్నాయి. ఆయన గొప్ప తత్వవేత్త, జీవితం గురించి ఎన్నో సత్యాలు చెప్పాడు. ముఖ్యంగా మనిషి వ్యక్తిత్వం గురించి, మనిషి ఎలా  ఉండాలనే విషయాల గురించి ఆయన చెప్పిన విధానాలు ఎన్ని తరాలు మారినా ప్రతి ఒక్కరూ అనుసరించేలా ఉన్నాయి. ఎవరైనా సరే.. సక్సెస్ ఫుల్ లైఫ్ ను గడపాలని అనుకున్నా,  జీవితంలో గొప్పగా ఎదగాలన్నా చాణక్యుడు చెప్పిన సూత్రాలు పాటిస్తే చాలు.. వారు విజేతలు కావడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. అలాగే వ్యక్తి జీవితంలో శాంతి లేకపోవడానికి కొన్ని కారణాలను కూడా పంచుకున్నాడు చాణక్యుడు. వ్యక్తి చేసే కొన్ని తప్పులే వారి జీవితంలో శాంతి కోల్పోయేలా చేస్తాయట.  వాటి గురించి తెలుసుకుంటే.. ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం.. ఇంట్లో పూజలు చేయకపోవడం, దేవుని నామాన్ని స్మరించకపోవడం జరిగే ఇళ్లలో ప్రజలు ఎప్పుడూ ఇబ్బందుల్లో ఉంటారట. అలాంటి ఇళ్లలో నివసించే ప్రజలు  సంతోషంగా ఉండరట.  పైగా  ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటారట.ఇలాంటి ఇళ్లలో నివసించే వారి జీవితాలు రోజు రోజుకూ దిగజారి పోతుంటాయట. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే లేదా అగౌరవపరిచే వ్యక్తి ఎప్పటికీ సంతోషంగా జీవించలేడట. అలా చేసిన ప్రతిసారీ జీవితంలో ఎదుగుదలకు ఆటంకం కలుగుతుందట. మహిళలను గౌరవించని కుటుంబాలు ఎప్పటికీ అభివృద్ధి చెందవని చాణక్యుడు స్పష్టంగా  చెప్పాడు. ఎందుకంటే లక్ష్మీ దేవి అలాంటి ఇళ్లలో ఎప్పుడూ నివసించదని కూడా స్పష్టంగా చెప్పాడు. పెద్దలు,  పిల్లలతో దుర్భాషలాడే ఇళ్లలో ఎల్లప్పుడూ అశాంతి నెలకొనే ఉంటుంది. అలాంటి ఇళ్లలో ధనం నిలవదు,  తరచుగా ఆర్థిక సంక్షోభాలు ఎదురవుతూ ఉంటాయట. పైగా ఇలాంటి ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందట. ఇతరుల సంపదపై  దృష్టి పెట్టేవారి జీవితంలో ఎప్పటికీ శాంతి ఉండదట.  ఇతరుల సంపదను ముట్టుకోవడం అనేది పాముతో సమానం. అందుకే పరుల సొమ్ము పాము వంటిది అన్నారు అని చాణక్యుడు చెబుతాడు. పైన చెప్పుకున్నవన్నీ వ్యక్తి జీవితంలో శాంతి లేకపోవడానికి కారణం అవుతుంది.  అందుకే శాంతి కోరుకునే వారు వాటికి దూరంగా ఉండటం మంచిది.                                *రూపశ్రీ.  
[

Health

]

నువ్వులు,  బెల్లం, వేరుశనగలను సూపర్ ఫుడ్స్ అంటారు ఇందుకే..!

Publish Date:Jan 17, 2026

భారతీయుల ఆహారంలో నువ్వులు,  పల్లీలు, బెల్లం చాలా ప్రముఖమైనవి.  ఇవి లేని బారతీయ ఆహారాన్ని అస్సలు ఊహించలేరు కూడా.  అయితే నువ్వులు, పల్లీలు,బెల్లాన్ని సూపర్ ఫుడ్స్ అని కూడా అంటారు.  పోషకాహార నిపుణులు ఈ ఆహారాలను తప్పనిసరిగా తీసుకోమని తమ పేషెంట్లకు సిఫారసు చేస్తారు కూడా. ప్రాంతాలను బట్టి వీటిని విభిన్న రకాలుగా ఆహారం తయారీలో వాడుతుంటారు. సాంప్రదాయ వంటకాలు ఇవి లేకుండా అసంపూర్ణంగా ఉంటాయి.  అయితే వీటిని సూపర్ ఫుడ్స్ అని ఎందుకు పిలుస్తారు? ఇలా పిలవడం వెనుక ఉన్న కారణం ఏంటి? తెలుసుకుంటే.. నువ్వులు,  వేరుశెనగల్లో ప్రోటీన్, విటమిన్లు,  ఒమేగా 6 వంటి పోషకాలు ఉంటాయి.ఇక బెల్లం ఐరన్, మెగ్నీషియం,  కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలను కలిగి ఉంటుంది. ఈ మూడు సూపర్‌ఫుడ్‌లు వేడెక్కించే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే వీటిని శీతాకాలపు సూపర్‌ఫుడ్‌లు అని కూడా పిలుస్తారు. వాటి పోషక విలువలు వాటిని మరింత ప్రత్యేకంగా చేస్తాయి. బెల్లంలో పోషక విలువలు.. బెల్లంలో సుక్రోజ్,  ఫ్రక్టోజ్ రూపంలో చక్కెరలు ఉంటాయి. అందువల్ల ఇది తీపి రుచిని కలిగి ఉంటుంది, తక్షణ శక్తిని అందిస్తుంది. బెల్లంలో ముఖ్యమైన విటమిన్లు A, C,  E ఉంటాయి. ఇందులో ఐరన్ తో  సహా అనేక ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉన్నాయి. బెల్లం తింటే కలిగే ప్రయోజనాలు.. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది, కాలేయం,  రక్తం శుద్ది జరుగుతుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి. మలబద్ధకం సమస్య తగ్గుతుంది.  మానసిక, శారీరక ఒత్తిడి తగ్గుతుంది. ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. రక్తహీనత ప్రమాదం తగ్గుతుంది.  చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.  శరీరానికి మంచి ఎనర్జీ లభిస్తుంది. నువ్వుల పోషక విలువలు.. నువ్వులలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్,  పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. వాటిలో విటమిన్ B6 కూడా ఉంటుంది. నువ్వులు తింటే కలిగే ప్రయోజనాలు.. ఎముకలు దృఢంగా మారుతాయి, వాపు తగ్గుతుంది.  ఆర్థరైటిస్ నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణ ఆరోగ్యం బాగుంటుంది.  మెనోపాజ్ సమయంలో హార్మోన్లను బాలెన్స్డ్ గా ఉంచడంలో సహాయపడుతుంది. థైరాయిడ్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్తహీనత ప్రమాదం తగ్గుతుంది,  రక్తపోటు అదుపులో ఉంటుంది.  రక్తంలో చక్కెర స్థాయిలు  నియంత్రణలో ఉంటాయి.  కొలెస్ట్రాల్,  ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి. వేరుశనగ పోషక విలువలు.. వేరుశెనగల్లో ప్రోటీన్,  కొవ్వుతో సహా అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. వాటిలో అనేక ముఖ్యమైన విటమిన్లు,  ఖనిజాలు కూడా ఉంటాయి. వేరుశనగ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వాపు తగ్గుతుంది. డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.  క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది,  కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది,  పిత్తాశయంలో రాళ్ల ప్రమాదం తగ్గుతుంది. వేరుశనగ రెగ్యులర్ గా తింటే  జీవితకాలం పెరుగుతుంది.  మెదడు పనితీరు మెరుగుపడుతుంది.  కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ కారణాల వల్లనే ఈ మూడు ఆహారాలను సూపర్ ఫుడ్స్ అని అంటారు. మరీ ముఖ్యంగా శీతాకాలం సూపర్ ఫుడ్స్ అని అంటారు.      *రూపశ్రీ.     గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...