జేపీ, లక్ష్మీనారాయణ బాటలో ఏబీవీ!
posted on Jan 13, 2026 @ 10:24AM
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటించారు. అందుకు అవసరమైన గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు తెలిపారు.గతంలో అంటే 2014-2019 మధ్య కాలంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేశారు. ఆ కాలంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2019 ఎన్నికలలో రాష్ట్రంలో వైసీపీ విజయం సాధించి జగన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన క్షణం నుంచీ ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ) వేధింపులను ఎదుర్కొన్నారు. అవినీతి ఆరోపణలతో సస్పెండయ్యారు. 2020 ఫిబ్రవరిలో ఆయనను జగన్ సర్కార్ సస్పెండ్ చేసింది.
అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన అలుపెరుగని న్యాయపోరాటం చేశారు. క్యాట్, హైకోర్టు, సుప్రీంకోర్టులో సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, ఆయన తిరిగి సర్వీసులో చేరారు. అదీ సరిగ్గా పదవీ విరమణ రోజు. ఆ తరువాత ఆయన జగన్ ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శిస్తూ ఆయన అనేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రెస్ మీట్లు నిర్వహించారు. డిజిటల్ ఫ్లాట్ ఫారమ్ లలో కూడా చురుగ్గా ఉంటూ.. జగన్ హయాంలో జరిగిన అన్యాయాలూ, అక్రమాలు, ఆర్థిక అవకతవకలను ఎండగట్టారు.
అది పక్కన పెడితే 2024 ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత.. ప్రభుత్వం ఏబీవీ సస్పెన్షన్ కాలాన్ని విధుల్లో ఉన్నట్లుగానే పరిగణించింది. ఆయనపై జగన్ సర్కార్ తీసుకున్న క్రమశిక్షణ చర్యలను రద్దు చేసింది. అలాగే.. ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించింది. అయితే తన కృషికి తగిన గుర్తింపు రాలేదన్న కినుకతో ఏబీవీ ఉన్నట్లు కనిపిస్తున్నారు.ఏపీ పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవిని చేపట్టలేదు. జగన్ హయాంలో జరిగిన అవకతవకలపై విమర్శలతో పాటుగా, ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నిర్ణయాలనూ ప్రశ్నించడం ఆరంభించారు. ఇప్పుడు ఏకంగా కొత్త పార్టీ ఏర్పాటును ప్రకటించారు. లైక్ మైండెడ్ పీపుల్ తో కలిసి ముందుకు సాగుతాననీ, పార్టీకి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకునే పనిలో ఉన్నాననీ కూడా ఏబీవీ చెప్పారు.
అయితే ఇక్కడే ఆయన రాజకీయ అడుగులు ఏ మేరకు సక్సోస్ అవుతాయన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. నిస్సందేహంగా ఏబీవీ నిజాయితీగల అధికారిగా విధినిర్వహణలో గుర్తింపు పొందారు. ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అయితే ఆ గుర్తింపు, ఆ అభిమానం ఒక రాజకీయ పార్టీని విజయవంతంగా లక్ష్యం దిశగా నడిపించేందుకు సరిపోతాయా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏబీవీలాగే మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ కు కూడా నిజాయతీ పరుడైన అధికారిగా పేరు ఉంది. ఆయన సర్వీసులో ఉండగానే ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో సొంతంగా పార్టీ పెట్టారు. ఎన్నికల రణరంగంలోకి కూడా దిగారు. కానీ ఒకే ఒక ఎన్నికలో 2014లో ఆయన లోక్ సత్తా పార్టీ తరఫున పోటీ చేసిన అందరూ డిపాజిట్ కోల్పోయారు. ఆయన ఒక్కరు మాత్రమే విజయం సాధించారు.
అది పక్కన పెడితే.. ఆ తరువాత ఆయనా, ఆయన పార్టీ కూడా క్రియాశీల రాజకీయాలలో పూర్తిగా కనుమరుగయ్యారు. ఇక ఆయన తరువాత సీబీఐ మాజీ జేడీ కూడా నిజాయతీగల అధికారిగా ప్రజలలో మంచి గుర్తింపు పొందారు. ప్రజాభిమానాన్ని కూడా చూరగొన్నారు. ఒక విధంగా చెప్పాలంటే జయప్రకాశ్ నారాయణ, లక్ష్మీనారాయణలకు ఏబీవీ కంటే ఎక్కువ గుర్తింపే ప్రజలలో ఉంది. అయితే క్రీయాశీల రాజకీయాలలో వారు తేలిపోయారు. ఉనికి మాత్రంగా మిగిలిపోయారు. ఈ నేపథ్యంలోనే ఏబీవీ రాజకీయపార్టీ అనగానే పరిశీలకులు ఆయన ఏ మేరకు రాణిస్తారు అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.