చాణక్యుడు చెప్పిన రహస్యం ఇది.. జీవితంలో శాంతి లేకపోవడానికి కారణాలు ఇవే!
posted on Jan 17, 2026 @ 2:42PM
ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త.. ఆయన 2వేల సంవత్సరాల కిందట చెప్పిన మాటలు నేటికీ అనుసరణీయంగా ఉన్నాయి. ఆయన గొప్ప తత్వవేత్త, జీవితం గురించి ఎన్నో సత్యాలు చెప్పాడు. ముఖ్యంగా మనిషి వ్యక్తిత్వం గురించి, మనిషి ఎలా ఉండాలనే విషయాల గురించి ఆయన చెప్పిన విధానాలు ఎన్ని తరాలు మారినా ప్రతి ఒక్కరూ అనుసరించేలా ఉన్నాయి. ఎవరైనా సరే.. సక్సెస్ ఫుల్ లైఫ్ ను గడపాలని అనుకున్నా, జీవితంలో గొప్పగా ఎదగాలన్నా చాణక్యుడు చెప్పిన సూత్రాలు పాటిస్తే చాలు.. వారు విజేతలు కావడాన్ని ఎవరూ అడ్డుకోలేరు. అలాగే వ్యక్తి జీవితంలో శాంతి లేకపోవడానికి కొన్ని కారణాలను కూడా పంచుకున్నాడు చాణక్యుడు. వ్యక్తి చేసే కొన్ని తప్పులే వారి జీవితంలో శాంతి కోల్పోయేలా చేస్తాయట. వాటి గురించి తెలుసుకుంటే..
ఆచార్య చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం.. ఇంట్లో పూజలు చేయకపోవడం, దేవుని నామాన్ని స్మరించకపోవడం జరిగే ఇళ్లలో ప్రజలు ఎప్పుడూ ఇబ్బందుల్లో ఉంటారట. అలాంటి ఇళ్లలో నివసించే ప్రజలు సంతోషంగా ఉండరట. పైగా ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటారట.ఇలాంటి ఇళ్లలో నివసించే వారి జీవితాలు రోజు రోజుకూ దిగజారి పోతుంటాయట.
మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే లేదా అగౌరవపరిచే వ్యక్తి ఎప్పటికీ సంతోషంగా జీవించలేడట. అలా చేసిన ప్రతిసారీ జీవితంలో ఎదుగుదలకు ఆటంకం కలుగుతుందట. మహిళలను గౌరవించని కుటుంబాలు ఎప్పటికీ అభివృద్ధి చెందవని చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే లక్ష్మీ దేవి అలాంటి ఇళ్లలో ఎప్పుడూ నివసించదని కూడా స్పష్టంగా చెప్పాడు.
పెద్దలు, పిల్లలతో దుర్భాషలాడే ఇళ్లలో ఎల్లప్పుడూ అశాంతి నెలకొనే ఉంటుంది. అలాంటి ఇళ్లలో ధనం నిలవదు, తరచుగా ఆర్థిక సంక్షోభాలు ఎదురవుతూ ఉంటాయట. పైగా ఇలాంటి ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందట.
ఇతరుల సంపదపై దృష్టి పెట్టేవారి జీవితంలో ఎప్పటికీ శాంతి ఉండదట. ఇతరుల సంపదను ముట్టుకోవడం అనేది పాముతో సమానం. అందుకే పరుల సొమ్ము పాము వంటిది అన్నారు అని చాణక్యుడు చెబుతాడు.
పైన చెప్పుకున్నవన్నీ వ్యక్తి జీవితంలో శాంతి లేకపోవడానికి కారణం అవుతుంది. అందుకే శాంతి కోరుకునే వారు వాటికి దూరంగా ఉండటం మంచిది.
*రూపశ్రీ.