పోసాని ఇంటిపై దాడి చేసిందెవరు? పోలీసుల విచారణలో ట్విస్టులు..
posted on Oct 1, 2021 @ 2:27PM
జనసేన, వైసీపీ మధ్య రాజుకున్న వివాదం ఇంకా మండుతూనే ఉంది. పవన్ కల్యాణ్ లక్ష్యంగా వైసీపీ నేతలు మాటల దాడి కొనసాగిస్తున్నారు. అటు జనసేన లీడర్లు కూడా అధికార పార్టీపై మండిపడుతున్నారు. ఇక పవన్ కల్యాణ్, పోసాని కృష్ణ మురళీ రచ్చ రగులుతూనే ఉంది. పోసాని ఇంటిపై రాళ్ల దాడి జరగడంతో.. వివాదం కేసుల వరకు వెళ్లింది. పోసాని ఇంటిపై దాడి ఘటనపై పోలీసులు చేస్తున్న విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి
హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడలో ఉన్న పోసాని కృష్ణ మురళీ ఇంటిపై బుధవారం అర్ధరాత్రి కొందరు యువకులు రాళ్ల దాడి చేశారు. బైకులపై వచ్చిన యువకులు ఇంటిపై రాళ్లు విసిరారని పోసాని ఇంటి వాచ్ మన్ పురుషోత్తం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దాడి జరిగిన సమయంలో పోసాని ఇంట్లో లేడు. ఆయన కొన్ని రోజులుగా గచ్చిబౌలిలోని అపార్ట్మెంట్లో ఉంటున్నారు. కేవలం ఆఫీసు అవసరాలకు మాత్రమే దీనిని వాడుతున్నారు. పోసాని వాచ్ మెన్ ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేస్తున్న పోలీసులకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి.
పోలీసులు ఎల్లారెడ్డిగూడలోని పోలీసులు ఇంటిని పరిశీలించారు. రాళ్ల దాడిలో పోసాని ఇంటి తలుపుల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇంట్లో కొన్ని రాళ్లను కూడా పోలీసులు గుర్తించారు. దాడి జరిగిన సమమంలో ఇంట్లోని పనివాళ్లు భయంతో లోపలికెళ్లి దాక్కున్నట్లు తెలిపారు. కొందరు రాళ్లు రువ్వడంతో పాటు అసభ్య పదజాలం ఉపయోగించారని పనివాళ్లు పోలీసులకు తెలిపారు. కొందరు యువకులు నానా హంగామా చేశారని స్థానికులు చెప్పారు. విచారణలో భాగంగా పోలీసులు పోసాని ఇంటి పరిసరాలను పరిశీలించారు. అయితే వారికి ఒక్క సీసీ కెమెరా కూడా కనిపించలేదు. అయితే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోలేదా..? లేక దాడి చేయడానికి వచ్చిన వారే తీసేసారా..? అన్న కోణంలో విచారిస్తున్నారు.
ఇక దాడి జరిగిన తరువాత పోసాని మరోసారి పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే తన ఇంటిపై దాడి చేయించారని ఆరోపించారు. జనసేన నాయకులు మాత్రం ఈ దాడికి జనసేనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు, పోసాని వెనుక ఏపీ ప్రభుత్వం ఉందని ఆయనతో పవన్ పై ఏపీ అక్కడి ప్రభుత్వం విమర్శలు చేయిస్తోందని ఆరోపించారు. పోసాని ఇంటిపై దాడి వెనుక కూడా వైసీపీనే ఉందని జనసేన నేతలు ఆరోపించారు. జనసేనను ఇరికించేలా కుట్రలు చేశారని జనసేన నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విచారణ జరుపుతున్న పోలీసులకు ఎలాంటి క్లూలు లభించలేదు. దీంతో నిందితులను గుర్తించడం కష్టంగా మారింది. పోసాని ఇంటి సమీపంలో సీసీ కెమెరాలు లేకపోవడం ఆసక్తిగా మారింది.
హైదరాబాద్ లో పోలీసులు వేలాదిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోసాని ఇల్లు ఉన్న ఎల్లారెడ్డి గూట పూర్తి రద్దీగా ఉండే ప్రాంతం. అలాంటి చోట సీసీ కెమెరాలు ఎందుకు లేవన్నది ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. పోసాని ఇంటి పరిసరాల్లో ఒక్క సీసీ కెమెరా కూడా లేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరాలను కావాలనే ఎవరైనా తొలగించారా అన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించాలంటే సీసీ కెమెరా పూటేజీ చాలా అవసరం అంటున్నారు పోలీసులు.