హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి బళ్లారి మహిళ.. గాలి బంధమేనా?
posted on Jan 3, 2024 @ 4:02PM
ఏపీలో అధికార వైసీపీ చిత్ర విచిత్ర రాజకీయ విన్యాసాలు చేస్తున్నది. ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓటెద్దు పోకడలతో ఇష్టారాజ్యంగా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను మార్చేస్తూ తాను సీతయ్యనని, ఎవరి మాటా వినననీ రుజువు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఇలా అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ఖరారు చేస్తూ రెండు జాబితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మంత్రులు, సీనియర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అంతేకాదు గెలిచే అవకాశాలున్నాయంటూ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారికి కూడా పిలిచి మరీ అవకాశం ఇస్తున్నారు. ఇలా తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కర్ణాటకకు చెందిన ఓ మాజీ ఎంపీని ఇలా పార్టీలో చేర్చుకుని అలా అవకాశం ఇచ్చేశారు. ఇంకా చెప్పాలంటే ఉదయం కర్ణాటకలో ఫ్లైట్ ఎక్కి బెజవాడ రావడం.. తాడేపల్లి వెళ్లి జగన్ కు కలిసి పార్టీలో చేరడం.. మళ్ళీ తిరిగి ఆమె కర్ణాటకకు వెళ్లే లోపే ఆమెను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. దీంతో అవాక్కవడం ఏపీ వైసీపీ నేతల వంతైంది.
ఇంతకీ ఎంపీ అభ్యర్థిగా ఛాన్స్ కొట్టేసిన ఆ మహిళ ఎవరు అన్న వివరాల్లోకి వెడితే.. ఈ సారి నోరెళ్ల బెట్టడం ప్రజల వంతైంది. ఆ మహిళ పేరు జే శాంత. ఈమె కర్ణాటకలో బీజేపీ నాయకురాలు. అదే పార్టీ నుండి గెలిచిన మాజీ ఎంపీ కూడా. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శాంత ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఏపీలో సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి చూసే పార్టీలో చేరానని తెలిపారు. వైసీపీలో సామాన్య కార్యకర్తలా పనిచేస్తానన్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు. వాల్మీకి వర్గానికి సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారన్న శాంత.. అవకాశం ఇస్తే వచ్చే ఎన్నికల్లో హిందూపురం ఎంపీగా పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. ఇక ఆమె అలా అన్నారో లేదో అదే రోజు సాయంత్రానికి ఇలా ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చేశారు జగన్. గోరంట్ల మాధవ్ ఎంపీగా ఉన్న హిందూపురం లోక్ సభ స్థానానికి ఆమెను ఇంచార్జ్ గా నియమించారు. వచ్చే ఎన్నికల్లో గోరంట్లకు మొండి చేయి చూపించేసి హిందూపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా శాంత పోటీ చేయడం ఖరారైంది.
దీంతో అసలు ఈ శాంత ఎవరు? ఆమెకు జగన్ పిలిచి మరీ ఎంపీ టికెట్ ఇవ్వడం ఏంటి? అసలు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఇలా ఎన్నో రకాల చర్చలు మొదలయ్యాయి. హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్న శాంత బీజేపీ మాజీ ఎంపీ, కర్ణాటక బీజేపీ ముఖ్యనేత జే. శ్రీరాములుకు స్వయానా సోదరి. వాల్మీకి సామాజికవర్గానికి చెందిన శ్రీరాములు గత బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2009లో బీజేపీ నుంచి బళ్లారి ఎంపీగా శాంత చేత పోటీ చేశారు. ఆమె ఎన్‌వై హనుమంతప్ప పై కేవలం 2వేల పై చిలుకు ఓట్లతో ఎంపీగా గెలిచారు. అప్పటి బీజేపీ ప్రభుత్వంలో జే.శ్రీరాములు, గాలి జనార్దన్‌రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి మంత్రులు కాగా గాలి సోమశేఖర్‌రెడ్డి కేఎంఎఫ్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కర్ణాటకలో గాలి బ్యాచ్ అంతా ఓడిపోగా.. ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్రీరాములు చిత్తుగా ఓడిపోయారు. ఇలాంటి సమయంలో శ్రీరాములు సోదరి శాంత ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టారు.
నిజానికి శాంత భర్త స్వస్థలం ఏపీలోని గుంతకల్లు. అయితే వారు బళ్లారిలో స్థిరపడ్డారు. శాంత స్వస్థలం కర్ణాటకనే కావడంతో ఆమె అక్కడే రాజకీయాలలో ఉన్నారు. అయితే, ఇప్పుడు ఇలా వైసీపీలో చేరడం వెనుక హైద్రాబాదుకు చెందిన ఒక రెడ్డి సామాజిక వర్గ వ్యక్తి కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. అలాగే గాలి సోదరులతో జగన్ మోహన్ రెడ్డికి వ్యాపార లావాదేవీలు, అవినీతి భాగస్వామ్యం ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గాలి వర్గానికి చెందిన శాంతను ఇప్పుడు ఏపీకి దిగుమతి చేశారని అంటున్నారు. అయితే శాంత రాకతో స్థానిక వైసీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వాల్మీకి సమాజానికి చెందిన వారు ఏపీలో లేక కర్ణాటక నుండి దిగుమతి చేసుకున్నారా అంటూ మండిపడుతున్నాయి. ఇంతకాలం పార్టీలో ఉన్న వారిని కాదని ఎక్కడో ఉన్న వారిని తీసుకొచ్చి మాపై రుద్దడం ఏంటని నిలదీస్తున్నాయి. అలాగే ఒక బీజేపీ నేతకు వైసీపీ కండువా కప్పేసి ఆమెకు సీటు ఇచ్చేయడంతో వైసీపీ బీజేపీకి బీటీం అనేది నిర్ధారణయిపోయిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.