తలలు పట్టుకున్న తెలంగాణ నాయకులు
posted on Oct 19, 2012 @ 4:09PM
అమ్మ ఊరించి ఊరించి ఇప్పుడు కాదు పొమ్మంటూ తేల్చేసింది. అన్న అన్ని రోజులు ఢిల్లీలో ఉండి ఏమి చేసాడో చెప్పమంటే ఉలకడు ...పలకడు. అన్ని దారులూ మూసుకు పోతున్నాయి తెలంగాణ నాయకులుకు. అన్ని అస్త్రాలు ఉపయోగించారు. తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలో తెలియక నేతలు తికమక పడుతున్నారు. రానురాను తెలంగాణ నాయకుల మీద, ఆఖరుకు ఛానల్స్ మీద కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం మింగుడు పడని విషయం. ఒకవైపు కేంద్రం కనుసన్నలకు అనుగుణంగా చర్యలు చేపడుతున్న రాష్ట్రప్రభుత్వం నిన్న మొన్నటి వరకు అదిగో తెలంగాణ ఇదిగో తెలంగాణ అని చెప్పిన అధినాయకత్వం హఠాత్తుగా మార్చిన రాజకీయాలతో ప్రజలకు ఏం చెప్పాలో తెలియని పరిస్దితుల్లో తెలంగాణ నాయకులు ఉన్నారు. పొనీ తెలంగాణ వాదులందరినీ ఆయా పార్టీలకు రాజీనామా చేయమన్నా ప్రయోజనం ఏముంటుందని నాయకులు వాపోతున్నారు. అదే విధంగా ప్రజల వద్దకు వెళ్లి ఏం చెప్పి ఓట్లను అడగగలమని వారు మధన పడుతున్నారు. ఎంత మంది మంత్రులు, ఎమ్మేల్యేలు పార్టీలు వీడి బయటకు వచ్చి తెలంగాణకోసం పోరాటతారనేది కూడా సందేహం గానే వుంది. తెలంగాణ వాదానికి బలం చేకూర్చే కాంగ్రెస్ ఎంపీలయిన వివేక్, వినోద్ లు తండ్రి వెంకటస్వామి దగ్గరనుండి కాంగ్రెస్ వాదులుగా ప్రసిద్ది. తెలంగాణ కోసం పార్టీని విడనాడుతారనుకోవడం అసంమజసం. అలాగే రాహుల్ గాంధీకి మిత్రుడిగా విలాసిల్లుతున్న మధుయాష్కీ. ఎమ్మేల్యే రాజయ్య సిఎం కిరణ్ కుమార్ కు విధేయత కలిగిన వాడు, కోమటి రెడ్డి బ్రదర్స్ గోడ మీద పిల్లులుగా పేరుంది. ఇక మిగిలింది పొన్నం ప్రభాకర్, కె కేశవరావు వీరిరువురి వల్ల ఒరిగేదేముంటుందని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు.అటు అధిష్టాన్ని ఒప్పించలేక ఇటు ప్రజలకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు.