జైలులో జగన్ ఎవరెవరికి ఫోను చేశారు?
posted on Oct 20, 2012 @ 10:59AM
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి చంచల్‌గూడ జైలు నుంచి ఎవరెవరికి ఫోను చేశారు? అన్న విషయం తేల్చాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండు చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో జగన్ జైలు సిబ్బంది సెల్‌ఫోనులను వినియోగించుకుంటున్నారన్న వార్త లీకైంది. దీంతో సిబ్బంది సెల్ నుంచి జగన్ ఎవరెవరికి ఫోనులు చేశారో తేల్చాలని తెలుగుదేశం పార్టీ నేతలు కోరుతున్నారు. ఆ నేతల తరుపున యనమల రామకృష్ణుడు జైళ్ల శాఖ డిజిపికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో జగన్ ఇంత వరకూ ఎవరెవరికి ఫోనులు చేశారో వివరాలు బహిర్గతం చేయాలని ఆయన డిమాండు చేశారు. అధికారుల సెల్‌ఫోన్లతోనే జగన్ తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. అందువల్ల బయట ఉన్నప్పుడు చేసే కార్యకలాపాలు ఏవీ ఆగలేదనటానికి ఈ సెల్ వినియోగమే నిదర్శనమని అభిప్రాయపడ్డారు. అందువల్ల అధికారులు ఆ వివరాలు వీలైనంత త్వరగా బయటపెట్టాలని డిజిపిని కోరారు.