చంద్రబాబు ‘సిద్ధం’సవాల్.. సజ్జల పసలేని కౌంటర్?
posted on Sep 3, 2025 @ 5:06PM
ఆకుకు అందకుండా పోకకు పొందకుండా మాట్లాడడంలో వైసీపీ సీనియర్ నాయకుడు, జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి సిద్ధహస్తుడు. ఆయన చాలా గ్యాప్ తరువాత తాజాగా మీడియా ముందుకు వచ్చారు. తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవల రాజంపేట పర్యటనలో భాగంగా వైసీపీ అధినేతను ఉద్దేశించి సిద్ధం సవాల్ విసిరారు. దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలకు రావాలనీ.. ఏ విషయంపైనైనా చర్చించేందుకు తాము ‘సిద్ధం’ అన్నారు. చంద్రబాబు ఈ సవాల్ ద్వారా.. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జగన్, ఆయన పార్టీ నాయకులు సిద్ధం అంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. అప్పట్లో సిద్ధం అన్నారుగా, ఇప్పుడు సిద్ధమేనా? రండి అసెంబ్లీలో తేల్చుకుందామంటూ ఎద్దేవా చేశారు. కోడికత్తి, గులకరాయి డ్రామాలు, వివేకానందరెడ్డి దారుణ హత్య ఇలా దేనిపైనేనా చర్చకు సవాల్ అన్నారు చంద్రబాబు.
ఈ సవాల్ కు జగన్ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.. కానీ ఆయన తరఫున ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ చార్జ్ సజ్జల మీడియా ముందుకు వచ్చారు. చాలా చలా విషయాలు మాట్లాడారు కానీ అసెంబ్లీకి వైసీపీ సభ్యులు వస్తారన్న విషయం మాత్రం చెప్పలేదు. ఆ విషయాన్ని పార్టీ అధినేత జగన్ నిర్ణయిస్తారన్నారు. ఇంతోటి దానికి ఆయన మీడియా సమావేశం పెట్టడం ఎందుకన్నది ఆయనకే తెలియాలి. అయితే ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రిగా చంద్రబాబు సవాల్ చేయడమేంటి? అని ప్రశ్నించారు. సవాళ్లు చేస్తే మేం చేయాలి.. కానీ సీఎం చేయడమేంటని ఆశ్చర్యపోయారు. ఇది సరికాదన్నారు.
ప్రస్తుతం ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారన్న సజ్జల తల్లికి వందనం అందరికీ అందలేదని ఆరోపించారు. వర్షాలు, వరదలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. యూరియా కొరత తీవ్రంగా ఉంద న్నారు. ఇన్ని సమస్యలుంటే చంద్రబాబు వాటిని విస్మరించి సవాళ్లు విసరడమేంటని విమర్శించారు. ఈ అంశాలపై తాము చర్చకు సిద్ధమన్న సజ్జల.. వాటిపై చర్చించడానికైనా వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తారా? అంటే మాత్రం ఆ విషయం మా పార్టీ అధినేత జగన్ నిర్ణయిస్తారంటూ మాట దాటేశారు. దీంతో సజ్జల మీడియా సమావేశం తరువాత విలేకరులు అసలీ మీడియా సమావేశం ఎందుకు పెట్టారు? పెట్టారు సరే ఆయన చెప్పిందేమిటి? అంటూ జుట్టు పీక్కునే పరిస్థితికి వచ్చారు.