కేసీఆర్ కూతురిగా పుట్టడం జన్మజన్మల పుణ్యం.. కవిత
posted on Sep 3, 2025 @ 3:01PM
బీఆర్ఎస్ నుంచి సస్పెండైన కల్వకుంట్ల కవిత దీటుగా స్పందించారు. పార్టీకీ, పార్టీద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేశారు. తన సస్పెన్షన్ తరువాత తొలి సారిగా బుధవారం (సెప్టెబర్ 3) మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత తన రాజీనామా ప్రకటన చేశారు. అంతే కాకుండా బీఆర్ఎస్ పైనా, ఆ పార్టీకి చెందిన కొందరు నేతలపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేసుకుని ఓ రేంజ్ లో విమర్శలు కురిపించారు.
పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ, ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ తాను ఒకేలా ఉన్నానని చెప్పిన కవిత.. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా తనను ప్రతిపక్ష ఎంపీగానే చూశారనీ, పార్టీలో ఆరడుగులు బుల్లెట్ గా హరీష్ చెప్పుకుంటారనీ, ఆ ఆరడుగుల బుల్లెట్టే తనను గాయపరిచిందన్నారు. హరీష్ రావు వంటి వారి వల్లనే విజయశాంతి, ఈటల, మైనంపల్లి వంటి పలువురు నాయకులు బీఆర్ఎస్ ను వీడారని కవిత అన్నారు. తనకు పదవులపై ఆశ లేదన్న కవిత పార్టీలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపినందుకే తనపై సస్పెన్షన్ వేటు వేశారన్నారు.
జన్మజన్మల పుణ్యం కారణంగానే తాను కేసీఆర్ కుమార్తెగా పుట్టానని కవిత అన్నారు. అటువంటి కేసీఆర్ ను, ఆయన పెట్టిన పార్టీనీ ఇబ్బంది పెట్టాలని తాను కలలో కూడా అనుకోనన్నారు. బీఆర్ఎస్ ఉంటే ఎంత.. పోతే ఎంత అని తాను అనలేదని వివరణ ఇచ్చారు. కేసీఆర్ ను ఇబ్బందుల పాలు చేస్తున్న పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అని మాత్రమే తాను అన్నానని చెప్పారు. హరీష్ వంటి వారి వల్ల కేసీఆర్ నాయకత్వానికే కాదు.. తన అన్న కేటీఆర్ కు కూడా ముప్పు ఉందని కవిత పేర్కొన్నారు. పార్టీలో జరుగుతున్న తప్పులన్నిటినీ కేసీఆర్ పై మోపుతున్నారని కవిత ఆరోపించారు. ఈ విషయంలో కేటీఆర్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పార్టీలో తనపై కుట్రలు జరుగుతుంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీరేం చేశారని కవిత కేటీఆర్ ను నలిదీశారు. తాను స్వయంగా తనపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పినా కూడా కేటీఆర్ స్పందించలేదని ఆరోపించారు. కొందరు కల్వకుంట్ల కుబుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన కవిత.. అందుకే తనను పార్టీ నుంచి బయటకు పంపేశారని కవిత పేర్కొన్నారు. పార్టీని హస్తగతం చేసుకోవాలన్న కొందరు పకడ్బందీగా తనను పార్టీ నుంచి బయటకు పంపారనీ, రేపు ఇదే కేసీఆర్ కు, కేటీఆర్ కు జరుగుతుందన్నదే తన ఆవేదన, బాధ అని కవిత చ చెప్పారు.