త్యాగమూర్తి శ్రీధర బాబు మంత్రిపదవికి ససేమిరా
posted on Jan 13, 2014 @ 10:17AM
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభ సమావేశాలు మొదలయ్యే ముందురోజు మంత్రి శ్రీధర్ బాబు నుండి శాసనసభా వ్యవహారాల శాఖను వెనక్కి తీసుకోవడంతో ఒక్కసారిగా ఆ ఇరువురూ కూడా వార్తలకెక్కారు. ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా పేరొందిన శ్రీధర్ బాబుకి తెలంగాణాలో తగిన ప్రచారం కల్పించేందుకే ఆయన ఆవిధంగా చేసారనే వార్తలను శ్రీధర్ బాబు గట్టిగా ఖండించారు. ఆయన తనపై వచ్చిన ‘కిరణ్ కుమార్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను’ గట్టిగా ఖండించినప్పటికీ, ఆయన మాటలు, కార్యక్రమాలు అన్నీకూడా ఆ ఆరోపణలను దృవీకరిస్తున్నట్లే ఉన్నాయి.
ముఖ్యమంత్రి రేసులో ఉన్న శ్రీధర్ బాబు, ఒక సీమాంధ్ర ముఖ్యమంత్రి చేతిలో తను ఏవిధంగా అన్యాయంగా బలయిపోయినది ప్రజలకి చెప్పుకొంటూ, తన రాజీనామా అంశాన్నిపదేపదే నొక్కి చెపుతూ తన నియోజక వర్గ ప్రజల సానుభూతిని, మెప్పు పొందే ప్రయత్నిస్తున్నారు. మొన్న ఆయన కరీంనగర్ వెళ్ళినప్పుడు, ఆయన అనుచరులు ఆయనకు చాలా భారీ ఎత్తున స్వాగతం పలికారు. ఆ సందర్భంగా ఆయన అనుచరులు ఏర్పాటు చేసిన ఒక సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తానిక కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేసే ప్రసక్తే లేదని, దమ్ముంటే తన రాజీనామాను ఆమోదించమని కిరణ్ కుమార్ రెడ్డికి ఆయన సవాలు విసిరారు.
ఆయన తను మంత్రి పదవికి రాజీనామా చేయడమనేది తెలంగాణా కోసం చేసిన గొప్ప త్యాగంగా మాట్లాడటం కాంగ్రెస్ మార్క్ రాజకీయమే. అయితే ఇది ఆయనకు వచ్చే ఎన్నికలలో ఓట్లు రాల్చగలదేమో కానీ తెలంగాణాకు ముఖ్యమంత్రిని చేయలేదు. ఎందుకంటే టీ-కాంగ్రెస్ లో ఆయన కంటే చాలా మంది సీనియర్లు ఆ కుర్చీకోసం క్యూలో ఉన్నారు. అలాగని శ్రీధర్ బాబు తన ప్రయత్నాలు మానుకోనవసరం లేదు. ఎవరి ప్రయత్నాలు వారివి.
కాంగ్రెస్ యంపీలు, కేంద్రమంత్రులు రాజీనామాలు చేసి, సోనియాగాంధీని విమర్శిస్తూ ఏవిధంగా తమ పదవులలో కొనసాగుతున్నారో, శ్రీధర్ బాబు కూడా అదేవిధంగా ఎన్నికల వరకు కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తూ మంత్రిగా సకల రాజలాంచనాలు అనుభవిస్తూ ఈ మూడు నెలలూ లాగించేయవచ్చును.