వాద్రాకి హుడా సర్కారు క్లీన్ చిట్
posted on Oct 27, 2012 @ 12:58PM
సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకి భూకుంభకోణంలో హర్యానా సర్కారు క్లీన్ చిట్ ఇచ్చింది. వాద్రాపై వెల్లువెత్తిన ఆరోపణలపై విచారణ జరిపిన హర్యానా ప్రభుత్వం గుర్గావ్, ఫరీదాబాద్, పల్వాల్, మెవాట్ డెప్యూటీ కమిషనర్లచేత క్లీన్ చిట్ ఇప్పించింది. రాబర్ట్ వాద్రా ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని ఆ నివేదికల్లో స్పష్టంగా పేర్కొనడాన్ని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో నిరసిస్తున్నాయ్. వాద్రా అవినీతి బాగోతాన్ని ఎండగట్టిన కేజ్రీవాల్.. హర్యానా ప్రభుత్వ నిర్వాకాన్ని చూసి ఖంగుతిన్నారు. వాద్రాని బైటపడేస్తారన్న విషయం తెలిసినప్పటికీ యూపీఏ సర్కారు ఇంత నిర్లజ్జగా వ్యవహరిస్తుందని ఊహించలేకపోయామంటూ కేజ్రీవాల్ బృందం మండిపడుతోంది. వాద్రాకి హర్యానా ప్రభుత్వం ఇచ్చిన క్లీన్‌చిట్ నమ్మశక్యకంగా లేదని, ఇది 'స్వీయధృవీకరణ' వంటిదేనని బిజెపి అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. కార్పొరేషన్ బ్యాంకు నుండి వాద్రా కంపెనీ తీసుకున్న ఓవర్ డ్రాప్టు రుణం వ్యవహారంపై నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. బ్యాంకు నుండి 7.94 కోట్ల మేర ఓడి తీసుకున్నట్లు వాద్రా కంపెనీ తన బ్యాలెన్స్‌షీట్‌లో ప్రకటించగా బ్యాంకు దానిని తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిష్పాక్షిక దర్యాప్తు జరిపితేనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని బిజెపి మాజీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. వాద్రాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరపాలంటూ ఆదేశాలు జారీ చేసిన ఐఎఎస్ అధికారి అశోక్ ఖేమ్కాని ఉన్నపళంగా బదిలీ చేసినప్పుడే కేసుని నీరుగార్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న విషయం స్పష్టమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయ్.