ఏపీలో పొత్తులపై పునరాలోచన నిజమేనా?
posted on Jul 18, 2023 @ 4:59PM
ఏపీలో ఎన్నికలు నెలల వ్యవధిలోకి వచ్చేశాయి. వచ్చే ఏడాది తొలి భాగంలోనే ఏపీలో సార్వత్రికలు జరగనున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తున్నా రాష్ట్రంలో పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఆ మాటకొస్తే ఇంకా ఇది నాన్పుడు ధోరణిలోనే కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు ప్రతిపక్ష పార్టీల మధ్య పొత్తులపై ఊహాగానాలు ఊపందుకోవడం.. ఆ తర్వాత మళ్ళీ చల్లబడడం అన్నట్లే ఉంది ఇక్కడ పరిస్థితి. ఆ మధ్య ప్రతిపక్ష ఓటు చీలడం తనకు సుతరామూ ఇష్టం లేదని.. కావాలంటే మనమే ఒక మెట్టు కిందకి దిగి అధికార వైసీపీపై ప్రతిపక్షాలతో కలిసి పోరాడదామని పవన్ కళ్యాణ్ పిలుపునివ్వగా.. ఈ మధ్య మాత్రం పవన్ నోటి నుండి ఆ ప్రస్తావన రావడం లేదు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీలో కూడా పొత్తులపై ఊసులు లేవు. మరోవైపు బీజేపీ వైఖరి ఏంటో స్పష్టం చేయడం లేదు.
ఆ మధ్య బీజేపీ దేశవ్యాప్తంగా మిత్రపక్షాలను కలుపుకుపోవాలని, పలు రాష్ట్రాలలో తమతో కలిసి వచ్చే కొత్త వారితో కూడా స్నేహం చేయాలని పిలుపు నిచ్చింది. మిత్ర పక్షాలతో దోస్తీకి సిద్ధమవ్వాలని శ్రేణులకు కూడా బీజేపీ అధిష్టానం సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఏపీలో బీజేపీ పొత్తుపై చాలా ఊహాగానాలు వచ్చాయి. ముందు తన పాత మిత్రుడు టీడీపీతోనే బీజేపీ ఈసారి పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అనంతరం పొత్తు ఖరారైందని కూడా ప్రచారం జరిగింది. అయితే, దీనిపై అటు బీజేపీ ఇటు టీడీపీ ఎక్కడా స్పదించనే లేదు. దీంతో కొద్ది రోజులుగా ఈ పొత్తు వ్యవహారంపై సస్పెన్స్ నడుస్తుంది. జులై 18న ఎన్డీఏ విస్తృత సమావేశానికి టీడీపీకి ఆహ్వానం కూడా అందలేదు.
జులై 18న ఎన్డీఏ విస్తృత సమావేశానికి ఏ జనసేన పార్టీకి మాత్రమే ఆహ్వానం వచ్చింది. జనసేన హాజరైంది. అయినా కూడా ఎటువంటి స్పష్టతా రాలేదు సరికదా..కన్ఫ్యూజన్ మరింత పెరిగింది. పరిస్థితి చూస్తుంటే మాత్రం పొత్తులపై పార్టీలు పునరాలోచన చేస్తున్నాయా అనిపిస్తుంది. ముఖ్యంగా అటు బీజేపీ.. ఇటు టీడీపీ పొత్తులపై పునరాలోచన చేస్తున్నాయా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అమిత్ షా - చంద్రబాబుల భేటీ సమయంలోనే ఈ పొత్తులపై ఏదో ఒక స్టాండ్ కనిపించాల్సింది. కానీ అసలు ఆ భేటీ వివరాలు కూడా బయటకి రాకుండా రెండు పార్టీలు జాగ్రత్తలు తీసుకున్నాయి.
అయితే, పొత్తులపై పునరాలోచన వెనక కారణాలను విశ్లేషించుకుంటే రెండు పార్టీలూ (బీజేపీ, తెలుగుదేశం) ప్రయోజనాలను లెక్కలేసుకొనే వెనక్కు తగ్గినట్లు భావించాల్సి వస్తుంది. ముందుగా టీడీపీ వైపు నుండి చూస్తే బీజేపీతో పొత్తు వల్ల ఆ పార్టీకి రాష్ట్రంలో పెద్దగా ప్రయోజనమేమీ ఉండదు. సరికదా.. ఒకింత చేటు కలిగే అవకాశం కూడా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి మొత్తం దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ అత్యంత బలహీనంగా ఉన్న రాష్ట్రం ఏపీ అనడంలో సందేహం లేదు. కేంద్రంలో ప్రయోజనాల కోసమే ఇన్నాళ్లు టీడీపీ పొత్తు కోసం చూసింది. అయితే పొత్తు పెట్టుకుంటూ రాష్ట్రంలో బీజేపీపై వ్యతిరేకత తెలుగుదేశం పార్టీకి కూడా ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మకం, విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేయకపోవడం.. కేంద్రం అండతోనే జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతుందనే అభిప్రాయం ప్రజలలో బలంగా నాటుకుపోయి ఉంది. ఈ వ్యతిరేకత తమపై కూడా చూపించే అవకాశం ఉందని టీడీపీ నమ్ముతున్నట్లు కనిపిస్తుంది. బీజేపీతో పొత్తు లేకపోయినా తమకు అధికారం దక్కుతుందని టీడీపీ ధీమా తో ఉందనీ, బీజేపీని పక్కన పెట్టి జనసేనను మాత్రం కలుపుకొని పోతే చాలని తెలుగుదేశం భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
దాదాపుగా బీజేపీ కూడా ఇలాంటి ప్రయోజనాల గురించే ఆలోచిస్తోందని అంటున్నారు. టీడీపీతో కలిసి వెళ్లడంతో త్రుణమో ప్రాణమో దక్కుతుంది తప్ప తమ పార్టీ బలపడే ఛాన్స్ ఉండదు. అదే దీర్ఘకాలిక ప్రణాళికతో వెళ్తే పార్టీ పుంజుకునే ఛాన్స్ ఉంటుంది. వచ్చే ఎన్నికల తర్వాత ఓడిన పార్టీలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. టీడీపీ ఓడితే బీజేపీ పురందేశ్వరితో రాజకీయం నడిపించవచ్చు. టీడీపీ గెలిస్తే వరాలు కురిపించి మచ్చిక చేసుకోవచ్చు. వైసీపీ గెలిస్తే ఇప్పుడు అవలంబిస్తున్న రహస్య చెలిమి సిద్ధాంతాన్నే కొనసాగించవచ్చు. ఈ క్రమంలోనే బీజేపీ నుండి కూడా పొత్తు విషయంలో పునరాలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అయితే, రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు ఏం జరుగుతుందన్నది . కొన్నాళ్ళు వేచి చూస్తేనే తెలుస్తుంది.