జగదొంగ అంటున్నా.. కిమ్మనలేని దుస్థితిలో వైసీపీ?!
posted on Jul 18, 2023 @ 5:55PM
ఏపీలో వాలంటీర్లు ప్రజల డేటాను సేకరించి దాన్ని అసాంఘిక శక్తులకు చేరవేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు బర్నింగ్ అంశంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే రకరకాల వివాదాలు కూడా నడిచాయి. వైసీపీ నేతలు కొందరు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి రకరకాల తిట్ల పురాణం అందుకున్నారు. ఓ ఎమ్మెల్యే అయితే పవన్ నాలుకను వంద సార్లు కోస్తానని కూడా మాట్లాడారు. ఇక, ఈ అంశంపై వాలంటీర్లతో ధర్నాలు, నిరసనలు చేయించారు. వాలంటీర్లకు మద్దతుగా నిలవాలని ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు వాయిస్ కాల్స్ ద్వారా అభ్యర్ధనలు చేసుకున్నారు. మహిళా కమిషన్ సైతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆధారాలతో వివరణ ఇవ్వాలని కూడా నోటీసులు ఇచ్చింది.
అయితే, ఇంత వరకూ పవన్ చేసిన ఆరోపణలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి నుండి కానీ, ప్రభుత్వ పెద్దల నుండి, ప్రభుత్వ ఉన్నతాధికారుల నుండి కానీ ఎలాంటి స్పందన లేదు. ఇదేమీ ఆషామాషీ ఆరోపణ కాదు. ఆరు కోట్ల ఆంధ్రులకు సంబంధించిన సమాచారాన్ని రక్షణ లేదనే ఆరోపణ. మరి రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారానికి ప్రభుత్వం ఏమైనా భద్రత కల్పించిందా? అనే విషయంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో ఉన్న వాలంటీర్ల వద్ద సమాచారానికి మేము కల్పించిన భద్రత ఇదని ప్రభుత్వం ప్రజలకు వివరించి నమ్మకం కలిగించాలి. కానీ, ప్రభుత్వ వర్గాల నుండి ఆ స్పందన లేదు. ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ బాధ్యత తనది కాదన్నట్లే ఉంది.
వాలంటీర్ల ఎంపికే సరైనది కాదు.. వాళ్లంతా ఫక్తు వైసీపీ కార్యకర్తలు. ఎలాంటి రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు లేకుండానే ప్రభుత్వంలో వారిని భాగస్వామ్యం చేశారు. ఒక మీసేవా కేంద్రానికే సవాలక్ష ఆంక్షలు విధించి కొర్రీలు పెట్టి కొన్ని సర్వీసులు మాత్రమే వారికి ఇస్తాయి ప్రభుత్వాలు. కానీ, ఇక్కడ వాలంటీర్ల వద్ద గడప గడప నుండి రాష్ట్రం మొత్తం ప్రజల సమాచారం ఉంది. మరి అలాంటి వారిపై ఆరోపణ వస్తే ప్రభుత్వానికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉండదా? కానీ, జగన్ సర్కార్ వైఖరి అందుకు విరుద్ధంగా ఆరోపించిన వారిపై వ్యక్తిగత దాడి చేస్తున్నది. అయితే, ఈ అంశంలో వైసీపీ నోరు మెదపలేకపోవడంతో డేటా చౌర్యం వాస్తవమేనన్న నమ్మకం సర్వత్రా ఏర్పడుతోంది.
గతంలో జగన్ సర్కార్ టీడీపీ మీద ఇలాంటి ఆరోపణలే చేసింది. చంద్రబాబు హయంలో ప్రభుత్వం డేటా చోరీకి పాల్పడి భారీగా ఓట్లను తొలగించిందనీ, ఇందుకోసం పెగాసస్ స్పై వేర్‌ను కూడా కొనుగోలు చేసిందనీ వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత హైదరాబాద్ లోని టీడీపీ సోషల్ మీడియా కోసం ఏర్పాటు చేసుకున్న కార్యాలయాలలోని కంప్యూటర్ హార్డ్ డిస్కులను కూడా తీసుకెళ్లారు. అసెంబ్లీ సాక్షిగా నిజమేనని వైసీపీ ఎమ్మెల్యేలు నమ్మించే ప్రయత్నం చేసారు. దీనిపై విచారణ కోసం స్పీకర్ తమ్మినేని సీతారాం శాసనసభ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నేతృత్వం వహించగా.. కమిటీని వేసిన కొత్తలో వరుసగా రెండు భేటీలు నిర్వహించారు. ఆ తర్వాత దాని ఊసేలేదు. టీడీపీ హయంలో చోరీ జరిగిందా లేదా అనేది వైసీపీ ఇప్పటికీ తేల్చనేలేదు. దీంతో వైసీపీ కేవలం బురదజల్లే ప్రయత్నంగానే అది మిగిలిపోయింది.
కాగా, ఇప్పుడు పవన్ వాలంటీర్లే డేటాను సంఘవిద్రోహ శక్తులకు అందిస్తున్నారని తీవ్రమైన ఆరోపణ చేసినా వైసీపీ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేకపోతుంది. అంటే అప్పుడు టీడీపీని దొంగా దొంగా అని అరిచిన వారే ఇప్పుడు దొంగలుగా ఆరోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు చంద్రబాబును దొంగ అన్న వారినే ఇప్పుడు గజ దొంగలని పిలుస్తున్నా ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారు. అప్పుడు హైదరాబాద్ లో ఆఫీసులో చోరీ చేసిన డేటా ఉందని ఆరోపించిన వైసీపీ ప్రభుత్వమే ఇప్పుడు అదే హైదరాబాద్ నానక్ రామ్ గూడ ఆఫీసులో వాలంటీర్ల ద్వారా తెచ్చిన డేటా స్టోర్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఆ ఆరోపణలపై కిక్కురుమనడం లేదు. టీడీపీపై చేసిన ఆరోపణను నిజమని తేల్చడంలో విఫలమైన జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఇలా అవే ఆరోపణలను ఎదుర్కొంటూ ప్రజల దోషిగా ప్రజల ముందు నిలబడింది.