అనిల్ కుమార్ కు అన్నమయ్య సెగ.. కేంద్రం యాక్షన్ తప్పదా? 

కడప జిల్లాలో వరద బీభత్సానికి కారణమైన అన్నమ్మయ్య ప్రాజెక్టు జగన్ సర్కార్ కు చెమటలు పట్టిస్తోంది. ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు టెన్షన్ పెట్టిస్టోంది. అన్నమయ్య ప్రాజెక్ట్ ఘోరానికి రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతేనని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ సింగ్ షెకావత్ రాజ్యసభలో ప్రకటించడం సంచలనం రేపుతోంది. ఇప్పటివరకు తమ బాధ్యతేమీ లేదని.. అంతా ప్రకృతి తప్పేనని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే షెకావత్ ప్రకటనతో విపక్షాలు చెబుతున్నదే నిజమైంది. గ్రీజు పెట్టడానికి కూడా జగన్ సర్కార్ దగ్గర నిధులు లేవని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు చేయడంతో రాష్ట్ర సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

ఇదిలా ఉండగానే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి నిర్వహణ లోపమే కారణమని చెప్పిన కేంద్రమంత్రి వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్, అయితే ఎప్పటిమాదిరిగానే ఎదురుదాడికి దిగాడు. ఇదే ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి చిక్కులు తెచ్చి పెడుతోంది. అనిల్ కుమార్ మీడియా ముందుకు వచ్చి అలవాటైన పద్దతిలో టీడీపీకి అంటు కట్టేశారు. కేంద్రమంత్రి పక్కన  అక్కడ సీఎంరమేష్ ఉన్నాడు.. సుజనా చౌదరి ఉన్నాడు.. వాళ్లే ఈ పిట్ట కథ చెప్పించి ఉంటారని సెటైర్లు వేశారు అనిల్ కుమార్ యాదవ్.షెకావత్ ప్రకటన చేస్తున్న సమయంలో సీఎం రమెష్ టీవీ స్క్రీన్లలో రెండు వరుసల వెనుక ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నారు. ఇదే ఇప్పుడు ఆయనకు ఇబ్బందిగా మారుతోంది.  సీఎం రమేష్ రాజ్యసభ సభ్యుడు కావడంతో సభలోనే ఉంటారు. అంతదానికి ఆయనకు అంటకట్టడం విచిత్రంగా కనిపిస్తోంది. 

ఏపీ మంత్రి అనిల్ ఆరోపణలపై బీజేపీ హైకమాండ్ దృష్టికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అందుకే వైసీపీ నేతలు ఎవరు ఎన్ని మాటలన్నా సైలెంట్‌గా ఉండే బీజేపీ నేతలు ఒక్క సారిగా రెచ్చిపోయారు. సమస్య ఏదైనా టీడీపీతో లింక్ పెట్టి విమర్శలు చేసే జీవీఎల్ నరసింహారావు వెంటనే స్పందించారు. అనిల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మిగిలిన నేతలు కూడా కాస్త ఘాటుగానే స్పందించారు. నిజాలు చెబుతూంటే అంత ఉలుకెందుకని మండిపడ్డారు. మూడు రోజుల పాటు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించింది. వాన,వరదలపై కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగానే కేంద్ర జలవనరుల శాఖా మంత్రి షెకావత్ రాజ్యసభలో ప్రకటన చేశారని అంటున్నారు.ఇప్పుడు ఆ నివేదికను బయట పెట్టి కేంద్రం విచారణ జరిపితే ప్రభుత్వం అడ్డంగా ఇరుక్కుపోతుందని, అనిల్‌కుమార్‌కూ ఇక్కట్లు తప్పవని అంటున్నారు. జగన్ సర్కార్ బండారం కూడా బయటపడుతుందని భావిస్తున్నారు.