ఇప్పుడు ఏం చేసి ఏం లాభం
posted on Aug 13, 2015 @ 12:15PM
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజుతో ముగినయనున్నాయి. అసలు ఈ సమావేశాలు ప్రారంభమైన తరువాత పార్లమెంట్లో కాంగ్రెస్ నేతల ఆందోళనలు తప్ప ఇంకేం జరగలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏ విషయాలు చర్చకు రాలేదు. కనీసం ఏపీ నేతలు ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో చర్చించే అవకాశం కాని.. తమ రాష్ట్ర సమస్యలు గురించి కాని విన్నపించుకునే సమయం కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ నేతలు . సభ అలా మొదలవుతుందో లేదో ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఆందోళనలు మొదలుపెట్టేవారు. అసలు మోదీ పార్లమెంట్ సమావేశాలు ప్రాంభమయ్యేముందు ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీ సమావేశంలోనే కాంగ్రెస్ నేతలు తేల్చిచెప్పారు.. లలిత్ మోదీ విషయంలో సుష్మా స్వరాజ్, వసుంధరా రేజేలు రాజీనామా చేయాలని లేకపోతే సభ సజావుగా సాగనివ్వమని తేల్చి చెప్పారు. అన్నట్టుగానే మాట మీద నిలబడి సభ సజావుగా సాగనివ్వకుండా రభస రభస చేశారు.
అయితే ఒక రకంగా పార్లమెంట్ సమావేశాలు అలా జరగడానికి.. కాంగ్రెస్ నేతలు అలా రెచ్చిపోవడానికి కారణం ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అని చెప్పుకోవచ్చు. సెలవులు అంటూ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిన రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రతిపక్షాలమీద చాలా ధీటుగా విరుచుకుపడుతున్నారు. తనను విమర్శించే వాళ్లకు సమాధానం చెప్పాలని ఈ రకంగా చేస్తున్నారన్న వార్తలూ వినిపిస్తున్నాయి. మోదీ ముందు తనెంత అని విమర్శించే వాళ్లకు తను కూడా ఏం తక్కువ కాదని చూపించాలనుకుంటున్నారేమో కాని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, నిరసనలు చేస్తునే ఉన్నారు. ఇప్పటికే పర్యటనలు పేరిట పాదయాత్రలు కూడా చేస్తున్నారు.
దీనిలో భాగంగానే ఇప్పుడు మళ్లీ తెలంగాణ పర్యటనపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నేత వి. హనుమంతరావు కూడా చర్చించినట్టు సమాచారం. పర్యటన తేదీలను త్వరగా ఖరారు చేస్తే జిల్లాల్లో తిరిగి విద్యార్థుల్ని చైతన్యపరుస్తామని వీహెచ్ చెప్పారట. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రం చెప్పిన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఆంధ్రాలో ధర్నా చేయాలని రాహుల్ గాంధీకి వి. హనుమంతరావు సూచించారట. ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే ఏపీలో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారని.. వారిక మద్ధతిస్తూ ఏపీలో ఏదో ఒక ప్రదేశంలో ఉదయం నుండి సాయంత్రం వరకూ ధర్నా చేయాలని చెప్పారట. విహెచ్ ప్రతిపాదనకు రాహుల్ కూడా ఒప్పుకున్నారట. మొత్తానికి రాహుల్ గాంధీ ఏదో ఒక విధంగా ప్రజలలో పేరు సంపాదించుకోవాలని తాపత్రయపడుతున్నారు. కానీ ఇప్పుడు ఏం చేసినా ఏం లాభం కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఏపీ ప్రజలు సోనియాను ఎప్పుడూ క్షమించలేరు. రాష్ట్రాన్ని విడదీయోద్దు అని ఎంత మొత్తుకున్నా వినకుండా తమ పార్టీ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టారు. విడగొట్టి ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం మొసలి కన్నీరు కారుస్తూ ఎన్ని ధర్నాలు చేసినా పార్టీ అధికారంలోకి రావడం కష్టం.. మరోవైపు తెలంగాణలో అధికారం పార్టీ టీఆర్ఎస్ ఉన్నంతకాలం ఇతర పార్టీలు అధికారంలోకి రావు.. పాపం రాహుల్ గాంధీకి పాదయాత్రలు చేసి చేసి కాళ్లు నొప్పులు రావడం తప్ప ఇంకేం ఉపయోగం ఉండదని తెలుసుకుంటే మంచిది.