దుర్గం చెరువు.. 1500 కోట్ల భూమి ఆక్రమణ
posted on Aug 13, 2015 @ 11:14AM
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ లో ఉన్న దుర్గం చెరువు ప్రాతంలోని భూమి ఆక్రమణలకు అడ్డుకట్టవేయలేకపోతున్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ దుర్గం చెరువును ఒక పక్క భూ కబ్జాదారులు మరోపక్క రాజకీయ నాయకులు కలిసి అన్యాయంగా ఆక్రమించేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ఎకరాల భూమిని కొన్ని కోట్లు విలువ చేసే భూమిని భూభకాసురులు నమిలేశారు. అక్కడ రిసార్టులు.. అంటూ పబ్బులు అంటూ భూమిని ఆక్రమించుకొని ఆసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఇంతా జరుగుతున్నా మన పట్టించుకునేవారు ఉన్నారా అంటే లేదనే వార్తలే వినిపిస్తున్నాయి. మరోవైపు దుర్గం చెరువును కాపాడేందుకు పర్యావరణ వేత్తలు, స్వచ్చంద సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నా భూ ఆక్రమణలు మాత్రం ఆగడంలేదు.
అయితే ఈ వ్యవహారంపై పరిశీలన జరపాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం దీనిపై వివరాలు చేపట్టేందుకు ఒక కమిటీని ఏర్పటుచేసింది. ఈ కమిటీ తెలిపిన వివరాలు చూసి ప్రభుత్వం ఒక్కసారిగా ఖంగుతిన్నది. ఒకటి కాదు రెండు కాదు 60 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. దీనిపై శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్ రామలింగారెడ్డి తెలుపుతూ దుర్గం చెరువు ప్రాతంలో 60 ఎకరాల భూమి అన్యాయంగా ఆక్రమించారని.. ఆ భూమి ధర సుమారు రూ. 1,500 కోట్ల రూపాయలు ఉంటుందని అన్నారు. సుమారు 67 హెక్టార్లలో ఉన్న దుర్గం చెరువు ప్రాతంతో సగానికి సగంపైగా ఆక్రమణకు గురైందని తెలుపుతున్నారు. అంతేకాదు ఈ వ్యవహారం పై జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారుల వద్ద కూడా వివరాలు సేకరించి అక్కడ ఉన్నభవన నిర్మణాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే దీనిపై ప్రభుత్వ ఒక నిర్ణయంతో ఉందని అక్కడ అన్యాయంగా నిర్మించిన భవనాలను ఖచ్చితంగా కూల్చివేస్తామని స్పష్టం చేశారు. కాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దుర్గం చెరువు ప్రాంతాన్ని ఇకో టూరిజంగా మార్చాలని అనుకుందని.. కాని అది అప్పటికే భూకబ్జాదారుల లొసుగులో ఉందని ఆప్రాజెక్టు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదని వివరించారు. ఈ ఆక్రమణకు గురైంది ఎంతటి వారైనా సరే ఊరుకునేది లేదని.. దీనిపై ప్రాథమిక సర్వే చేసిన తరువాత ఆక్రమణలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అన్నారు.