టాప్ న్యూస్ @ 1PM
posted on Oct 1, 2021 @ 12:36PM
హైదరాబాద్ రామాంతపూర్ సెంట్రల్ మాదాక ద్రవ్యాల ఫోరెన్సిక్ ల్యాబ్ వద్దకు ఏపీ టీడీపీ నేతలు చేరుకున్నారు. డ్రగ్ టెస్ట్‌కు రాకుండా వైసీపీ నేతలు తోక ముడిచారని ఈ సందర్భంగా పట్టాబీ ఆరోపించారు. దేశంలో డ్రగ్ మాఫియా వెనుక వైసీపీ నేతలు ఉన్నారని తేటతెల్లమయ్యిందన్నారు. రామాంతపూర్ సెంటర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు రాకుండా వైసీపీ నేతల పుత్రరత్నాలు ముఖం చాటేశారని విమర్శించారు. వైసీపీ నేతలు ఎప్పుడూ పిలిచినా డ్రగ్ టెస్ట్‌కు తాము సిద్ధమని పట్టాభి స్పష్టం చేశారు.
--------
ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడును కేబినెట్ మంత్రి హోదాలో నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రేడియేషన్ ఆంకాలజిస్టుల్లో అత్యంత అనుభవజ్ఞుడు, ప్రఖ్యాత వైద్యుడిగా పేరుపొందారు. ఆయన్ని కేబినెట్ హోదాలో రెండు సంవత్సరాల పదవీకాలంతో సలహాదారుగా నియమిస్తూ సాధారణ పరిపాలనశాఖ (రాజకీయ) కార్యదర్శి ముత్యాలరాజు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
-----
స్వచ్ఛ్ భారత్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పేరుతో క్లాప్ కార్యక్రమం నిర్వహించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. క్లీన్ ఏపీలో భాగంగా కొనుగోలు చేసిన చెత్త సేకరణ వాహనాలను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్టాడుతూ వాహనాలపై సీఎం జగన్ పేరుతో స్టిక్కరింగ్, వైసీపీ రంగులు వేయడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో సింగిల్ స్టిక్కర్ వెళ్లి డబుల్ స్టిక్కర్ వచ్చిందని ఎద్దేవా చేశారు
---------
సీఎం జగన్‌కి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. గులాబ్ తుఫాన్‌తో పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని లేఖలో ఆయన డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర, పశ్చిమ గోదావరి జిల్లాల్లో దాదాపు 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఆహార పంటలకు ఎకరాకు రూ.25 వేలు.. ఉద్యాన, వ్యాపార పంటలకు రూ.50 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి రప్పించి కేంద్రం నుంచి సహాయం కోరాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
-------
తెలంగాణ అసెంబ్లీలో విపక్షాలపై విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్. గ్రామ పంచాయతీ నిధులపై ప్రతిపక్షాలు మాట్లాడిన తీరుపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యుల మాటలు వింటే జాలేస్తోందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులే గౌరవంగా బతుకుతున్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హయాంలో వ్యక్తిపై సగటున రూ.4 మాత్రమే ఖర్చు చేశారని, తమ హయాంలో రూ.650 విడుదల చేస్తున్నమన్నారు.
---------
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై పరిశీలనకు ఏర్పాటైన సంయుక్త కమిటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు నివేదిక సమర్పించింది. ఈ ప్రాజెక్టు సాగునీటి ప్రాజెక్టుగా పనులు చేపట్టారని సంయుక్త కమిటీ ధృవీకరించింది. తప్పుడు నివేదిక అందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా విధించాలని కమిటీ సిఫార్సు చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ. 3 కోట్ల 70 లక్షల జరిమానా చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంది.
----
అరసవల్లి సూర్యనారాయణ స్వామి మూలవిరాట్‌ను శుక్రవారం సూర్యకిరణాలు తాకాయి. స్వామి పాదాల నుండి శిరస్సు వరకు కిరణ స్పర్శ అరుదైన దృశ్యాన్ని చూడడానికి భక్తులు పెద్ద ఎత్తున్న తరలివచ్చారు. ఏడాదిలో రెండుసార్లు ఆదిత్యునికి కిరణ స్పర్శ ఉత్తరాయణం, దక్షిణాయణంలో భక్తులకు కనువిందు చేసింది. ఏటా అక్టోబరు 1, 2, మార్చి 9, 10 తేదీల్లో స్వామివారిని సూర్యకిరణాలు తాకుతాయి. 8 నిమిషాలు పాటు కిరణాలు పడటంతో భక్తులకు అద్భుత దర్శన భాగ్యం కలిగింది.
------
గచ్చిబౌలి స్టేడియంలో క్రీడాకారులు, అథ్లెట్లు ఆందోళనకు దిగారు. స్టేడియంను కాపాడాలని ధర్నాకు దిగారు. టిమ్స్ హాస్పిటల్ కోసం ఇప్పటికే 9ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. స్టేడియంలోని మరో 5 ఎకరాలు టీమ్స్‌కు కేటాయించాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయంపై అథ్లెట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఒకే ఒక్క స్టేడియంను హాస్పిటల్‌కు ఇవ్వడం అన్యాయని అథ్లెట్స్ అన్నారు.
----
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త రాజకీయ పార్టీ స్థాపించే అవకాశాలున్నాయని సమాచారం. అమరీందర్ ఇటీవల ఢిల్లీలో అమిత్ షాతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌లతో భేటీ అయ్యారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అమరీందర్ కొత్త పార్టీ ఏర్పాటు కోసం తన మద్ధతుదారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
---------
దేశీయ విమాన దిగ్గజమైన ఎయిర్ ఇండియాను టాటా సన్స్ కొనుగోలు చేయనుంది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయడానికి టాటా సన్స్ తుది బిడ్ ను గెలుచుకుందని ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. స్పైస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ కూడా బిడ్ వేసినప్పటికి, టాటాసన్స్ ఎయిర్ ఇండియా కొనుగోలు కోసం అధిక ఆఫరును సమర్పించారని అధికారులు చెప్పారు.
----------