భోగాపురం ఎయిర్ పోర్ట్.. క్రెడిట్ వార్.. వాస్తవమేంటంటే?
posted on Jan 5, 2026 @ 10:11AM
విజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రయల్ రన్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ట్రయల్ రన్‌లో భాగంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది. ఈ విమానంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి తదితరులు ప్రయాణించారు.
భోగాపురం ఎయిర్‌పోర్ట్ అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుపుకుంటోంది. 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో ఈ విమానాశ్రయం రూపుదిద్దుకుంది. పూర్తి స్థాయిలో ప్రారంభమైతే రోజుకు సుమారు 300 విమానాలు ల్యాండింగ్, టేక్‌ఆఫ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. రెండు వైపుల నుంచీ ల్యాండింగ్, టేక్‌ఆఫ్ సదుపాయం ఉండటం ఈ విమానాశ్రయం ప్రత్యేకత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్‌ను తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు దాదాపు 95 శాతం పూర్తయ్యాయి. నిర్మాణ సంస్థ జీఎంఆర్ జూన్ నెలలో పూర్తి స్థాయిలో విమానాశ్రయ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ ఎయిర్‌పోర్ట్ ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపిరి అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండిగ్ ఒక మైలు రాయిగా చెప్పొచ్చు. అయితే ఈ విమానాశ్రయం ఘనత తనదేనంటూ వైసీపీ క్రెడిట్ కొట్టేయడానికి చేస్తున్న ప్రయత్నం ఒక రాజకీయ చర్చకు దారి తీసింది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఈ విమానాశ్రయానికి అవసరమైన కీలక అనుమతులన్నీ తన హయాంలోలో వచ్చాయని చెప్పుకుంటున్నారు. అలాగే ఈ విమానాశ్రయానికి అవసరమైన భూ సేకరణ కోసం తన హయాంలోనే దాదాపు 960 కోట్ల రూపాయలు వ్యయం చేశామని అంటున్నారు. అయితే వైసీపీ అధినేత జగన్ మాటలను టీడీపీ కొట్టి పారేస్తోంది. భోగాపురం విమానాశ్రయం 2015లోనే అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడి హయాంలోనే ప్రణాళికలు రూపొందాయనీ, దీనికి కేంద్ర అనుమతులు, భూ సేకరణ, ప్రాథమిక నిర్మాణాలూ చంద్రబాబు హయాంలోనే పూర్తయ్యాయనీ చెబుతోంది. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పడకేసిందనీ, జగన్ ప్రభుత్వం ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనీ, మళ్లీ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భోగాపురం విమానాశ్రయ నిర్మాణం వేగం పుంజుకుందనీ చెబుతోంది.
ఈ రాజకీయ చర్చలు, విమర్శలు, ప్రతి విమర్శలూ పక్కన పెడితే.. అసలు వాస్తవమేంటంటే.. రికార్డు సమయంలో భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తి కావడం, ట్రయల్ రన్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని, వచ్చే జూన్ నాటికి ఈ విమానాశ్రయం ప్రయాణీకులకు అందుబాటులో రావడానికి ప్రధాన కారణం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నది నిర్వివాదాంశం. శ్రీకాకుళం నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యంవహిస్తున్న ఆయన భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టు విషయంలో వ్యక్తిగత శ్రద్ధ పెట్టి, నిర్దుష్ట వ్యవధిలో పూర్తి చేసి ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకుసాగడం వల్లనే ఇంత వేగంగా ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తి అయ్యిందని పరిశీలకులు చెబుతున్నారు. ఆయన చొవర, వ్యక్తిగత పర్యవేక్షణ కారణంగానే గత ఏడాది కాలంగా భోగాపుర విమానాశ్రయ నిర్మాణ పనులు రోజూ మూడు షిప్టులలో నిరంతరాయంగా జరిగాయని అంటున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజన్, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కూడా భోగాపురం విమానాశ్రయం రికార్డు సమయంలో నిర్మాణం పూర్తి చేసుకుని కార్యకలాపాలను ఆరంభించేందుకు రెడీ కావడం ప్రధాన కారణమనడంలో సందేహం లేదు. సాధారణంగా ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిపాదన దశ నుంచి న నిర్మాణం పూర్తి చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించడానికి దశాబ్దాల కాలం పడుతుంది. ఒక్కో సారి అంతకు మించి కూడా సమయం పడుతుంది. ఇందుకు ఉదాహరణ ముంబైలో ఇటీవలే ప్రారంభమైన రెండో అంతర్జాతీయ విమానాశ్రయమే. ఈ విమానాశ్రయం ప్రతిపాదన దశ దాటి, అన్ని అనుమతులూ పొంది.. నిర్మాణం పూర్తి చేసుకుని, ప్రయాణీకులకు అందుబాటులోకి రావడానికి పాతికేళ్లు పట్టింది. ఇక గత దశాబ్ద కాలంగా బెంగళూరులో రెండవ విమానాశ్రయ నిర్మాణం కోసం స్థల అన్వేషణ గత దశాబ్ద కాలంగా ఎడతెగకుండా కొనసాగుతూనే ఉంది.
అయితే అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం ఆఘమేఘాల మీద పూర్తయ్యింది. ట్రయల్ రన్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలో ఆపరేషన్స్ కూడా ప్రారంభం కానున్నాయి. ముంబై, బెంగళూరు వంటి నగరాలలో దశాబ్దాలు పట్టిన పని ఏపీలో రెండేళ్ల లోపే పూర్తయ్యిందంటే.. అది చంద్రబాబు ఫాస్టెస్ట్ గవర్నెన్స్ ఫలితమే అనడంలో సందేహం లేదు.