హత్యతో ఉనికి చాటుకుంటున్న ‘వార్’?
posted on Oct 18, 2012 @ 9:43AM
రాజకీయనాయకుల హత్యల ద్వారా తమ ఉనికిని చాటుకోవటం పీపుల్స్‌వార్ గ్రూపు నక్సలైట్లకు అలవాటైపోయింది. తమ ప్రభావిత ప్రాంతాల్లోనూ వార్ ఇటువంటి తెగింపు హత్యలకు సిద్ధమవుతుంది. రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా, ఖమ్మం, విశాఖ, వరంగల్, కృష్ణా, ప్రకాశం, మహబూబ్‌నగర్ జిల్లాలు వార్ ప్రభావిత ఏజెన్సీలుగా గుర్తింపునందుకున్నాయి. ఒకవైపు ఛత్తీస్‌ఘడ్, మరోవైపు ఒరిస్సా సరిహద్దులు కూడా వార్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వార్ తన బలాన్ని పెంచుకోవాల్సి వచ్చినప్పుడు గిరిజనులను ఆకర్షిస్తోంది. అభివృద్థి, ఉద్యోగం ద్వారా గిరిజనులను వార్‌కు దూరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎస్‌టి సబ్‌ప్లాన్ ఏరియా డిక్లరేషను ప్రకటించటం వెనుక గిరిజనయువతను మావోయిజం వైపు మళ్లకుండా చూడాలనే ఉద్దేశ్యం కనిపిస్తోంది. అయితే గిరిజనులు మాత్రం ఒకవైపు వార్‌ను, మరోవైపు పోలీసులను భరిస్తున్నారు. వీరిద్దరి మధ్యలో అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా నలిగిపోతున్నారు. ఈ అమాయక గిరిజనుల్లో 14 నుంచి 18ఏళ్లలోపు గిరిజనులను వార్ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. వారికి ఆయుధాలు ఉపయోగించటంలో శిక్షణ ఇస్తోంది. ఈ శిక్షణ తరువాత కొంతకాలం అన్నలుగా చెలామణి అయి యువకులు పోలీసుల ముందు లంగిపోయినా వారి జీవనోపాధికి లక్షల్లో పారితోషికం లభిస్తోంది. ఇలా వార్ నుంచి బయటకు వచ్చిన వారు స్థిరపడిపోతున్నారు. దీనికి గిరిజనకుటుంబాలు ఆకర్షితులవుతున్నారు. అందుకే కొంచెం సాహసించి వార్‌బాట పడుతున్నారు. అయితే వార్ తన ఉనికి చాటుకోవాల్సి వచ్చినప్పుడు గిరిజన ప్రతినిధులను కూడా హత్య చేయటానికి వెనుకాడటం లేదు. దీంతో గిరిజన సంఘాలు ఒక్కోసారి వార్‌ను తప్పుపడుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలను వార్ విరోధులుగా భావిస్తున్నది. దీనికి కారణం ఒకటి ఆ పార్టీ అధికారంలో ఉండటం. రెండోది కాంగ్రెస్ నేతలు భూఆక్రమణలకు పాల్పడటం. ఈ రెండు అంశాల ఆధారంగానే వార్ కాంగ్రెస్‌నేతలను హత్య చేస్తోంది. ప్రత్యేకించి రెండో అంశం ఆధారంగా ఖమ్మం జిల్లాలో వార్ తన ఉనికిని చాటుకుంది. పాల్వంచ మండల పరిధిలోని రెడ్డిగూడెం గ్రామ కాంగ్రెస్ నేత కల్లెం వెంకటరెడ్డి(45)ని ఆరుగురు సాయుధ మావోయిస్టులు తుపాకీలతో కాల్చి హత్య చేశారు. ఆనవాయితీ ప్రకారం మావోయిస్టు కొత్తగూడెం ఏరియా కార్యదర్శి భద్రు పేరిట మావోయిస్టులు లేఖ వదిలివెళ్లారు. అర్ధరాత్రి జరిగిన ఈ హత్యతో రెడ్డిగూడెం గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. అలానే ఖమ్మం జిల్లాలో ఈ హత్య గురించి తీవ్రస్థాయి చర్చలకు తావిచ్చింది.