బల ప్రదర్శనకు సిద్దమవుతున్న మాజీమంత్రి సంగీత
posted on Oct 18, 2012 @ 9:40AM
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మాజీ మంత్రి సంగీతం వెంకటరెడ్డి(చిన్నకాపు) సిద్దంగా ఉన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున షర్మిల చేసే పాదయాత్ర సమయంలో ఈయన చేరిక ఉండవచ్చని అంచనాలు ఎక్కువయ్యాయి. ఇప్పటి దాకా రాజకీయంగా స్తబ్దుగా ఉన్న సంగీతం తన నిర్ణయాన్ని ఖాయపర్చుకున్నారు. ఇప్పటికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ విషయమై వెంకటరెడ్డి కబురుపెట్టారు. తాను పార్టీలో చేరాక ఆలమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సంగీతం ఆశిస్తున్నారు. తన అంతరంగాన్ని ఆయన ఎప్పుడో బయటపెట్టారని తెలుస్తోంది. అయితే తన బలాన్ని, బలగాన్ని ప్రదర్శించేందుకు సైతం సంగీతం సిద్ధంగా ఉన్నారట. అందువల్ల ఆయన చేరిక తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో కీలకమని భావిస్తున్నారు. సంగీతం కనుక చేరితే కాంగ్రెస్ పార్టీ నుంచి వైకాపాకు వలసలు భారీగా పెరుగుతాయని వైకాపా ఓ అంచనాకు వచ్చింది. అయితే అధినేత జగన్మోహనరెడ్డి మరింత కాలం జైలులో ఉంటే వైకాపా కార్యకర్తలు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల వైపు చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందువల్ల మరికొంత కాలం వేచి చూస్తే మంచిదని వెంకటరెడ్డి సన్నిహితులు ఆయనపై వత్తిడి తెస్తున్నారు