రాహుల్ లిస్టులో చిరంజీవి పేరు?
posted on Oct 18, 2012 @ 9:44AM
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో చర్చలు జరపటం వల్ల కేంద్ర మంత్రివర్గ విస్తరణ రోజుల్లో ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సన్నాహాలు పూర్తి అయ్యాయని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పటి వరకూ కేంద్ర మంత్రి పదవుల రేసులో ఉన్న వారు తిరిగి ఢల్లీలో లాబియింగ్ కోసం ఫోనులు చేస్తున్నారు. అయితే యువనేతలకే ఎక్కువ మంత్రి పదవులు దక్కే అవకాశముందని తెలుస్తోంది. వృద్దులు రేసులో ఉన్నా ఎఐసిసి ప్రధానకార్యదర్శి రాహుల్‌గాంధీ దృష్టిలోనూ ఉండాలి. లేకపోతే వారికి పదవి దక్కే అవకాశముండదు. ప్రత్యేకించి రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఈసారి తనకు పదవి దక్కవచ్చని భావిస్తున్నారు. అయితే సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో ఈయనకు విభేదాలు ఉండటం వల్ల విహెచ్ లాబీయింగ్ ఎంత బలమైనదైనా ఆయన్ని మినహాయించే అవకాశాలు ఎక్కువ అంటున్నారు. అందరిలోకి ఇటీవల మౌనం వహించిన రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి పదవి దక్కే అవకాశముంది. ఆయనపై సిఎం కూడా పెద్దగా దృష్టి కేంద్రీకరించలేదు కాబట్టి ఈయనకు మంత్రి పదవి లభిస్తుందని భావిస్తున్నారు. చిత్రమేమిటంటే రాహుల్‌గాంధీ తయారు చేసిన లిస్టులో కూడా చిరంజీవి పేరుందని సమాచారం. అలానే రాష్ట్రం నుంచి ఎంపి కావూరి సాంబశివరావు, కోట్ల విజయభాస్కరరెడ్డి, సర్వే సత్యన్నారాయణ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరికైనా మంత్రి పదవి దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. ఒక్క కులం పరంగా మంత్రి పదవులు కనుక ఇస్తే విహెచ్ బిసి కాబట్టి ఆయనకు అవకాశం లభించవచ్చు. లేకపోతే మిగిలిన వారికి ఇచ్చే ప్రాధాన్యత ఆయనకు దక్కకపోవచ్చని, సిఎం లాబీయింగ్ ముందు విహెచ్ వెనుకబడే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఏమైనా ఢల్లీ వెళ్లిన సిఎం కిరణ్ కేంద్ర మంత్రిపదవులపై రాహుల్‌తో చర్చించే అవకాశముందని సమాచారం. రాహుల్‌గాంధీ ఇష్టప్రకారమే మంత్రిపదవులు ఇస్తున్నందున పూర్తిస్థాయిలో ఫలానావారికి వస్తుందని చెప్పటం కష్టంగా ఉందని రాజకీయపరిశీలకులు సైతం భావిస్తున్నారు. ప్రత్యేకించి ఈ నెల 20వతేదీలోపు మంత్రిపదవుల పంపకం పూర్తికావొచ్చని భావిస్తున్నారు.