40 ఏళ్ల సమస్యకు హైడ్రా పరిష్కారం
posted on Dec 11, 2025 @ 6:26PM
హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ ప్రాంతంలోని మణెమ్మ గల్లీ నివాసితులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 40 ఏళ్ల సమస్యను పరిష్కరించారంటూ శాలువను కప్పి అభినందించారు.
డ్రైనేజీ పైపులైన్లు తమ స్థలంలోంచి వెళ్లాయని 50 ఏళ్ల క్రితం అక్కడివారు అడ్డుకున్నారు. అప్పటి నుంచి వివాదం కొనసాగడం.. భూగర్భ డ్రైనేజీ పైపులైన్లు దెబ్బతినడంతో మురుగు, వరద నీరు నిలిచిపోయి ఇబ్బందులు పడ్డామని.. పైపులైన్ల పైన వేసి దారి కూడా బంద్ అవ్వడంతో నరకం చూశామని కాలనీ వాసులు వాపోయారు. హైడ్రా రాకతో ఈ ఇబ్బందులన్నీ తొలగాయని ఈ సందర్భంగా పలువురు తెలిపారు.
గత ఏడాది ఆగస్టు 28న హైడ్రా కమీషనర్ నేరుగా పరిశీలించి సమస్యను తెలుసుకుని.. అదే నెల 30వ తేదీన ఆక్రమణలను తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు. కోర్టు వివాదాలతో రహదారి, భూగర్భ డ్రైనేజీ నిర్మాణం ఆలస్యమైందన్నారు. చివరికి కోర్టు తీర్పుతో ఇటీవల పనులు పూర్తయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు.
మరోవైపు మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేట విలేజ్ సర్వే నంబరు 191లో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా గురువారం కాపాడింది. దీని విలువ రూ. 750 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇక్కడ ప్రభుత్వ భూమి కబ్జా జరుగుతుందని స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులతో కలిసి విచారించింది.
ఆక్రమణలను నిర్ధారించుకుంది. హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు శాశ్వత నివాసాల జోలికి వెళ్లకుండా.. మిగతా షెడ్డులను, ప్రహరీలను తొలగించి.. 10 ఎకరాల భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసి బోర్డు లు ఏర్పాటు చేసింది .