తెలంగాణ వేడి ఉస్మానియాలో మళ్లీ రాజుకుంది
posted on Sep 27, 2012 @ 1:38PM
తెలంగాణ మార్చ్ కి అనుమతి ఇవ్వాలని కోరుతూ జలదృశ్యం వరకూ ప్రదర్శన చేపట్టిన విద్యార్ధుల్ని హైదరాబాద్ లోని ఓయూ క్యాంపస్ లో పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా ప్రదర్శన చేస్తామంటే మమ్మల్నిఅడ్డుకుంటారా.. అంటూ రెచ్చిపోయి పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులకు, గలాటాని చిత్రీకరించడానికెళ్లిన ఓ కెమెరామన్ కీ తీవ్రగాయాలయ్యాయి. విద్యార్ధుల్ని అదుపుచేసేందుకు పోలీసులు బాష్పవాయు గోళాల్ని ప్రయోగించాల్సొచ్చింది. దీన్నిబట్టే తెలంగాణ మార్చ్ ఎంత శాంతియుతంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చని పోలీస్ బాస్ లు మండిపడుతున్నారు. శాంతి భద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత తమమీద ఉందిగనుక ఈ పరిస్థితుల్లో తెలంగాణ మార్చ్ కి అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు.