టిడిపిలో చంద్రబాబు లేఖపై రేగిన కలకలం
posted on Sep 27, 2012 @ 3:13PM
తెలంగాణపై చంద్రబాబు ప్రథానికి సమర్పించిన లేఖపై పార్టీలో కొందరు నేతలు అగ్గిమీద గుగ్గిలమౌతున్నారు. తెలంగాణకు మేం అనుకూలమంటూ బాబు ఎక్కడా లేఖలో స్పష్టంగా చెప్పకపోయినా, అసలు లేఖ ఇవ్వడం సీమాంధ్రుల భావాల్ని రెచ్చగొట్టడమేనని ఎమ్మెల్యే ప్రవీణ్ మండిపడుతున్నారు. వెంటనే బాబు తన లేఖని ఉపసంహరించుకోకపోతే పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తెలంగాణ మార్చ పేరుతో హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్రుల్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రవీణ్ ఆరోపించారు. తెలుగువాళ్లకోసమే పుట్టిన పార్టీ, ఇప్పుడు తెలుగువాళ్లు విడిపోవడానికి సహకరించడం ఏమాత్రం క్షమించరాని నేరమంటూ ప్రవీణ్ తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓసారి రాజధానిని కోల్పోయి ఆంధ్రులు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధానిని ఇంకొకరి చేతుల్లో పెట్టేందుకు సిద్ధంగా లేరని గట్టిగా చెబుతున్నారు. టిడిపిలోని మరికొందరు నేతలు మాత్రం ప్రవీణ్ ఉద్దేశపూర్వకంగా చంద్రబాబుపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.