విశాఖ పర్యాటకానికి కొత్త శోభ.. దేశంలోనే పొడవైన గ్లాస్ బ్రిడ్జి!

విశాఖపట్నం కైలాసగిరిలో దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ సోమవారం (డిసెంబర్ 1) ప్రారంభమైంది. ఏడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ గ్లాస్ బ్రిడ్జిని ఎంపీ భరత్, మేయర్   పీలా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు , వీఎంఆర్డీఏ ఛైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, తుఫాన్‌లు, గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను తట్టుకునేలా 40 ఎంఎం మందం గల జర్మన్ గ్లాస్‌తో నిర్మించిన  ఈ గాజు వంతెన దాదాపు 500 టన్నుల బరువును ఈజీగా మోయగలదు.

ఈ గ్లాస్ బ్రిడ్జ్‌ పైనుంచి గాల్లో తేలియాడుతున్న అనుభూతితో ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. అదలా ఉంచితే.. దేశంలో ఇప్పటి వరకూ కేరళలో నిర్మించిన 40 మీటర్ల పొడవైన గ్లాస్ బ్రిడ్జే దేశంలో అత్యంత పొడవైన గాజు వంతెనగా రికార్డుల్లో ఉంది. ఇప్పుడు విశాఖలో నిర్మించి, ప్రారంభించిన ఈ గాజు వంతెన ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఈ బ్రిడ్జి పొడవు 50 మీటర్లు.  వీఎంఆర్‌డీఏ, ఆర్‌జే అడ్వెంచర్స్‌ సంస్థ సంయుక్తంగా  నిర్మించిన ఈ గ్లాస్ బ్రిడ్జి విశాఖ పర్యాటకానికి కొత్త శోభను తీసుకువస్తుందనడంలో సందేహం లేదు.  

మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

  మంత్రి కొండా సురేఖపై నాంపల్లి స్పెషల్ కోర్టు షాక్ ఇచ్చింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మంత్రిపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. ఈ పిటిషన్ విచారిస్తూ, కొండా సురేఖ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కాకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  ఈ నేపధ్యంలో ఫిబ్రవరి 5వ తేదీ, 2026 సంవత్సరం లోపు కొండా సురేఖ నేరుగా కోర్టులో హాజరు అవ్వాలని కోర్టు పేర్కొన్నాది. గతంలో  అక్కినేని  నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా   తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేటీఆర్ డ్రగ్స్ వాడతారని  అని, రేవ్ పార్టీలు నడుపారని విమర్శించారు.  టాలీవుడ్ నటులు నాగ చైతన్య-సమంతా రూత్ ప్రభు విడాకులకు కేటీఆర్ కారణమని ఆరోపించారు.   

ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

  ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు లో ఎదురు దెబ్బ తగిలింది. ఒక ముఖ్యమైన పరిణామంగా, ప్రభాకర్ రావు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సడలించింది. కేసులో కీలక విషయాలను వెలికితీయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, వారం రోజులపాటు పోలీసు కస్టడీ విచారణకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం, రేపు ఉదయం 11 గంటలకు ప్రభాకర్ రావు సిట్ అధికారుల ఎదుట హాజరు కావాలి. రేపటి నుంచి ప్రారంభమై వచ్చే ఏడు రోజులపాటు ఆయనను కస్టడీలో ఉంచుకుని విచారణ చేయనున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.అయితే, విచారణ సమయంలో ఎటువంటి శారీరక లేదా మానసిక ఒత్తిడి, టార్చర్ చేయరాదని కోర్టు పోలీసులు మరియు సిట్ అధికారులను గట్టిగా హెచ్చరించింది. కస్టడీ సమయంలో  ప్రభాకర్ రావుకు ఇంటి భోజనాన్ని కోర్టు  అనుమతించింది. కస్టడీ సమయంలో ప్రభాకర్ రావుకు ఇంటి భోజనం, అవసరమైన మందులు అందేలా చూడాలని కూడా ఆదేశించింది. వారం రోజుల కస్టడీ పూర్తయ్యాక, విచారణలో వచ్చిన వివరాలను సుప్రీంకోర్టుకు సమగ్రంగా నివేదించాలని ఆదేశిస్తూ, అందిన సమాచారం ఆధారంగా తదుపరి విచారణ చేపడతామని బెంచ్ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ప్రభాకర్ రావు పక్షానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని న్యాయ వర్గలు వెల్లడించారు...వారం రోజుల విచారణ అనంతరం మొత్తం వివరాలను కోర్టుకు సమర్పించాలని సిట్‌కు సుప్రీంకోర్టు సూచించింది. కస్టడీ విచారణలో బయటపడే వివరాల ఆధారంగా తదుపరి విచారణను కొనసాగిస్తామని కోర్టు స్పష్టం చేసింది.తెలంగాణ ప్రభుత్వం తరఫున  వాదనలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వినిపించారు. 

రూ.43.5 కోట్లు చెల్లిస్తే అమెరికా పౌరసత్వం

  ట్రంప్ 2.0 పాలన పెను సంచలనాలతో సాగుతోంది. మొదటి రోజు నుంచే చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ .. అమెరికా పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్.. అమెరికా పౌరసత్వం , వీసా నిబంధనలను మరింత కఠినతరం చేశారు.  ఇక అమెరికాలో పుట్టే పిల్లలకు పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నాలు చేసి.. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన ట్రంప్.. కొత్తగా కొన్ని రోజుల క్రితం గోల్డ్ కార్డును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. డబ్బులు చెల్లించి నేరుగా అమెరికా పౌరసత్వం పొందడమే ఈ గోల్డ్ కార్డు పౌరసత్వం. 5 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో ఏకంగా రూ.43.5 కోట్లు చెల్లించి ఈ గోల్డ్ కార్డు కొనుగోలు చేసిన వారికి నేరుగా అమెరికా పౌరసత్వం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డ్‌ ఫస్ట్‌ లుక్‌ను తాజాగా డొనాల్డ్‌ ట్రంప్‌ విడుదల చేసి, బుధవారం నుంచి గోల్డ్ కార్డ్ ధరఖాస్తులను విక్రయానికి పెట్టారు. తాజాగా వైట్ హౌస్‌లో జరిగిన మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు అమెరికా అధ్యక్షుడి విమానం అయిన ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో మీడియాతో మాట్లాడే సమయంలో ట్రంప్.. ఆ గోల్డ్ కార్డును చూపించారు.  ట్రంప్‌ ఫోటోతో ఉన్న ఆ గోల్డ్ కార్డును 5 మిలియన్‌ డాలర్లు చెల్లించి ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ గోల్డ్ కార్డును ట్రంపే స్వయంగా మొదట కొనుగోలు చేశారు. అయితే రెండో గోల్డ్ కార్డును ఎవరు కొంటారు అనేది తనకు తెలియదని సమాధానం ఇచ్చారు. ఈ గోల్డ్‌ కార్డ్‌ 2 వారాల్లో అమ్ముడు అయిపోతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈబీ-5 ప్రోగ్రామ్‌ను ఉపయోగించి చేస్తున్న మోసాలు, అక్రమాలను అరికట్టేందుకు ఈ గోల్డ్ కార్డును తీసుకొస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.  చట్టబద్ధంగా అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారికి పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని వివరించారు. ఈ నేపథ్యంలోనే ఈబీ-5 వీసా విధానాన్ని రద్దు చేసి రూ.43.5 కోట్లు వెచ్చించేవారికి ఈ గోల్డ్‌ కార్డు అందిస్తామని ట్రంప్‌ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులను అమెరికాలోకి ఆకర్షించేందుకే ఈ గోల్డ్ కార్డును ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అలాంటి సంపన్నులు అమెరికాకు వచ్చి భారీగా ఖర్చు పెడితే స్థానికంగా ఉద్యోగాలు పెరుగుతాయని ట్రంప్‌ వెల్లడించారు. ఈ గోల్డ్ కార్డుకు భారీగా డిమాండ్ ఉందని ఒకేరోజు వెయ్యి కార్డులను విక్రయించినట్లు అమెరికా వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్‌ లుట్నిక్‌ ఇటీవల స్పష్టం చేశారు. ఈ గోల్డ్ కార్డుల విక్రయం ద్వారా 5 బిలియన్‌ డాలర్లు సేకరించినట్లు తెలిపారు.  ప్రపంచవ్యాప్తంగా 3.7 కోట్ల మందికి ఈ గోల్డ్ కార్డు కొనే సామర్థ్యం ఉందంటున్నారు. 1990లో అమెరికా ఈ ఈబీ-5 వీసా విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ విధానం కింద వేలాదిమంది ఇన్వెస్టర్‌ వీసాలను పొందారు. అయితే ఈ ఈబీ-5 వీసా విధానంతో మోసాలు జరుగుతున్నాయని.. కొందరు అక్రమంగా దోచుకుంటున్నారని తేలింది. దీంతో 2022లో కొన్ని సవరణలు చేయగా.. తాజాగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈబీ-5 వీసా విధానాన్ని రద్దు చేసి ఆ స్థానంలో గోల్డ్‌ కార్డును ప్రవేశపెట్టారు.  

రో-కోలకు షాక్ ఇవ్వనున్న బీసీసీఐ?

  టీమిండియా వెటరన్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం. వీరిద్దరికి సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. 2024 - 25 సీజన్‌లో కోహ్లీ, రోహిత్ A+ కేటగిరీలో ఉన్నారు. గత ఏడాది వీరిద్దరూ టెస్టులు, టీ20ల నుంచి రిటైర్ అయ్యి, ఇప్పుడు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే 2025-26 సీజన్ లో వీరిని A+ కేటగిరీ నుంచి గ్రేడ్ Aకి డిమోట్ చేసేస్తారనే టాక్ వినిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే వారి జీతంలో సుమారు రూ.2 కోట్లు తగ్గుతాయి.  డిసెంబర్ 22న జరిగే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ వార్షిక సమావేశంలో ఈ ఇద్దరి కాంట్రాక్టులు ప్రధాన ఎజెండాగా ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం వార్షిక కేటగిరీల వారిగా ఫీజుల వివరాలు ఇప్పుడు చూద్దాం.. A+ కేటగిరిలో ఉన్న ప్లేయర్లకు రూ.7 కోట్లు, A కేటగిరి రూ.5 కోట్లు, B కేటగిరి రూ.3 కోట్లు, C కేటగిరిలోని ప్లేయర్లకు రూ. కోటి జీతం అందుతుంది. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో నాలుగు కేటగిరిల్లో ఆటగాళ్లను విభజించి వారికి బీసీసీఐ జీతాలు అందజేస్తుంది.  టీమిండియా టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ శుభమన్ గిల్‌కు ఈ సారి A+ గ్రేడ్ దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం గిల్ A కేటగిరిలో ఉండగా.. జడేజా, బుమ్రా A+ కేటగిరీలో ఉన్నారు. డిసెంబర్ 22న జరిగే అపెక్స్ కౌన్సెల్ వార్షిక సమావేశంలో బీసీసీఐ ఇతర అంశాలపై కూడా దృష్టి పెట్టనుంది. అంపైర్లు, మ్యాచ్ రిఫరీల రెమ్యూనరేషన్ పెంపు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించిన అప్డేట్లు వంటి వాటిపై కూడా చర్చించనున్నారని తెలుస్తోంది. సెప్టెంబర్‌లో జరిగిన బీసీసీఐ సంస్థాగత మార్పుల తర్వాత ఇదే తొలి సమావేశం కావడం విశేషం. బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగే తొలి అపెక్స్ మీటింగ్ ఇదే. ఈ సమావేశంలో మిథున్‌తో పాటు ట్రెజరర్ రఘురాం భట్, కార్యదర్శి దేవజిత్ సైకియా, జాయింట్ సెక్రటరీ ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా, అపెక్స్ కౌన్సెల్ సభ్యుడు జయదేవ్ షా పాల్గొననున్నారు. మొత్తంగా వచ్చే సమావేశంలో ఒకవేళ కోహ్లీ, రోహిత్‌లను గనుక 'A' కేటగిరీ(రూ. 5 కోట్లు)కి తగ్గిస్తే, 'A+'కేటగిరి (రూ. 7 కోట్లు)తో వారిద్దరూ ఒక్కొక్కరు రూ. 2 కోట్లు తక్కువగా సంపాదిస్తారు.  

పరిశోధనలకు కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ : సీఎం చంద్రబాబు

  అమరావతిలో ఏర్పాటు అవుతున్న క్వాంటం వ్యాలీ ఆధునిక పరిశోధనలకు కేంద్రంగా మారాలని సీఎం చంద్రబాబు  ఆకాంక్షించారు. విద్య, వైద్యం, ఔషధాల రూపకల్పన సహా వివిధ రంగాల్లో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సచివాలయంలో గురువారం వివిధ దేశాల నుంచి బృందంగా వచ్చిన పరిశోధకులు, విద్యావేత్తలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల బృందంతో సీఎం సమావేశం అయ్యారు.  వైద్యరంగంలో నూతన ఔషధాల రూపకల్పనతో పాటు మెటీరియల్ సైన్స్ పై పరిశోధనలకు గానూ గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమని పరిశోధకులు, విద్యావేత్తల బృందం ముఖ్యమంత్రికి తెలిపింది. దేశంలోనే తొలి క్వాంటం బయోమెడికల్ రీసెర్చ్ ఎకో సిస్టంగా ఏర్పాటు అవుతున్నట్టు వివరించింది. గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీ బృందం సభ్యులకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి.. వైద్యారోగ్యం, ఔషధాల రూపకల్పన సహా వివిధ అంశాల్లో విస్తృతంగా పరిశోధనలు జరగాల్సి ఉందని అన్నారు.  క్వాంటం పరిశోధనలతో బయోసెన్సార్ల లాంటి అప్లికేషన్లను కూడా ప్రజా ప్రయోజనాల కోసం అందుబాటులోకి తేవాల్సి ఉందని అన్నారు. అమరావతిలో త్వరలోనే క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని సీఎం వెల్లడించారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలు ఈ క్వాంటం కంప్యూటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాయని వారికి వివరించారు. నేషనల్ క్వాంటం మిషన్ కార్యక్రమాన్ని అందిపుచ్చుకుని క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తుంటే  మొత్తంగా క్వాంటం ఎకో సిస్టం అమరావతికి వస్తోందని సీఎం అన్నారు. గతంలో అందిపుచ్చుకున్న ఐటీ, జీనోమ్ వ్యాలీ లాంటి వ్యవస్థలు ఇప్పుడు విజయగాథలుగా మారాయని సీఎం వ్యాఖ్యానించారు.  ఇప్పుడు క్వాంటం గురించి అంతా ఆలోచిస్తున్న సమయంలో ఆ రంగంలో పనిచేయడానికి ఔత్సాహిక కంపెనీలు ఏపీని సంప్రదిస్తున్నాయని అన్నారు. అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటం కంప్యూటర్ కేంద్రం ద్వారా పరిశోథనలు చేసి ఔషధాలు, మెటీరియల్ సైన్స్ సహా వివిధ అంశాల్లో వినూత్న ఆవిష్కరణలు తీసుకురావాలని స్పష్టం చేశారు. క్వాంటం బయోఫౌండ్రీ అనేది వినూత్న ఆలోచన అని ముఖ్యమంత్రి అన్నారు.  బయోమెడికల్ రీసెర్చితో పాటు వ్యవసాయం, విద్య, వైద్యం, రక్షణ, రవాణా సహా వేర్వేరు రంగాల్లోని భాగస్వాములు క్వాంటం వ్యాలీ సేవలను వినియోగించుకునేలా ఎకోసిస్టం అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారు. ఐఐటీలు, విశ్వవిద్యాలయాలు, రీసెర్చి సంస్థలకు ఏక్యూసీసీ కేంద్రంగా అవుతుందని తెలిపారు.  రూ.200 కోట్ల పెట్టుబడితో గ్లోబల్ క్వాంటం బయోఫౌండ్రీ ద్వారా మాలిక్యులర్ మోడలింగ్, డ్రగ్ డిస్కవరీ సిమ్యులేషన్స్, మెటిరియల్ సైన్స్ పై పరిశోధనలు చేయనున్నట్టు విద్యావేత్తలు, పరిశోధకుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించింది. క్వాంటం వ్యాలీతో పాటు, ఏపీలో అమలవుతున్న విధానాలను తమను ఆకర్షించాయని గ్లోబల్ క్వాంటం బయోఫౌండ్రీ ప్రతినిధులు సీఎంకు తెలిపారు.  

ఇండిగో నుంచి ప్ర‌తిదీ దేశం కోసం కాదు..అదానీ కోస‌మేనా!?

  ఇండిగో వ్య‌వ‌హారం  వెన‌క అదాని  ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయా? అస‌లు అదానీకి  మోదీకి ఉన్న సంబంధ బాంధ‌వ్యాలేంటి?  సీ పోర్ట్, ఎయిర్ పోర్ట్,  రోడ్లు, విద్యుత్ ఇలా రంగ‌మేదైనా  స‌రే, అదాని  ప‌రం చేయ‌డానికే మోడీ ఇదంతా  చేస్తున్నారా? అంటే మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌రిగిన  ప‌రిణామ క్ర‌మం ఏంటో ఒక‌సారి ప‌రిశీలించాల్సి వ‌స్తుంది. తాజాగా త‌లెత్తిన ఇండిగో వ్య‌వ‌హారంలో అదానీ సంస్థ‌ల‌ పాత్ర బ‌హిర్గ‌త‌మైంది. అదెలాగంటే అదానీ ఏవియేష‌న్, పైల‌ట్ ట్రైనింగ్ లోకి అడుగు పెట్టారు. అదానీ ట్రైనింగ్ సెంట‌ర్లో ఇబ్బ‌డి  ముబ్బ‌డిగా పైల‌ట్ ట్రైనింగ్ కి  జ‌నం చేరాలంటే అందుకు త‌గిన విధంగా రూల్స్ అండ్  రెగ్యులేష‌న్స్ మార్పించాలి. అందులో భాగంగానే డీజీసీఏ ద్వారా  పైల‌ట్ల  ప‌ని గంట‌లపై ఒక రూల్ పాస్ చేశారు. దీంతో ఇండిగోకి వేలాది  మంది  పైల‌ట్ల అవ‌స‌రం ఏర్ప‌డింది. అలా ఇండిగో  సంక్షోభం త‌లెత్తింద‌ని ఒక‌ అంచ‌నా. కేవ‌లం ఈ ఒక్క అంశం మాత్ర‌మే కాదు.. డిమానిటైజేష‌న్, రైతుల గిట్టుబాటు ధ‌ర‌ల విష‌యంలోనూ ఇదే జ‌రిగింద‌ని చెప్పాలంటారు ప‌లువురు ప‌రిశీల‌కులు. అదానికి లాభం చేకూర్చ‌డ‌మే ధ్యేయంగా ఈ మొత్తం  నెట్ వ‌ర్క్ ప‌ని చేస్తుందంటే అతిశ‌యోక్తి కాదేమో. ఒక‌ప్పుడు బీజేపీ గురుత్వాక‌ర్ష‌ణ శ‌క్తి మొత్తం  నాగ్ పూర్ లో కేంద్రీకృత‌మ‌య్యి ఉండేది. అదే, 2014 నుంచి ఈ గ్రావిటీ మొత్తం గుజ‌రాత్ త‌ర‌లి వెళ్లింది. మ‌రీ ముఖ్యంగా మోడీ, షా ఎక్క‌డుంటే అక్క‌డ కేంద్రీకృతం కావ‌డం ప్రారంభ‌మ‌య్యింది. ఇంకా జూమ్ వేసుకుని చూస్తే.. ప్ర‌స్తుత బీజేపీ పాల‌న మొత్తం అదానీ కేంద్రంగా న‌డుస్తున్న‌ట్టుగా బ‌య‌ట ప‌డుతుందంటారు కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు. అందుకు వీరు ఎవ‌ర్నైనా బ‌లి పెట్టేస్తార‌న‌డంలో ఎంత మాత్రం అనుమానం లేద‌ని చెప్పొచ్చు. ప్ర‌స్తుతం ఇండిగో వ్య‌వ‌హారంలో దేశం ప‌రువు ప్ర‌తిష్ట‌లు ఎంత‌గా మంట గ‌ల‌సి పోతున్నా స‌రే, లెక్క చేయ‌కుండా అది మిస్ ఫైర్ కావ‌డంతో వెంట‌నే కోలుకుని ఆ నింద మొత్తం ఒక‌రిపై నెట్టేయ‌డం అంటే అది మాములు విష‌యం కాదు. అందుకే ఆ వ్య‌క్తికి అంత‌టి మంత్రి ప‌ద‌వి ఇచ్చారా? అన్న డౌట్ కూడా వ‌స్తుంది.  మోడీని గుడ్డిగా న‌మ్మే వారికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. ఏపీలో ఉన్న అన్ని పోర్టులు అదానీకి రాసిచ్చేశారు. విశాఖ గంగ‌వ‌రం పోర్ట్, వైజాగ్ పోర్టు ప్ర‌స్తుతం అదానీ గుప్పెట్లోకి వెళ్లిపోయాయి. గాజువాక స్టీల్ ప్లాంట్ భూముల విష‌యానికి వ‌స్తే.. ఒక సిమెంటు కంపెనీకి ప్లాంట్ కోసం భూమికావాలి. అందుకోసం ఏకంగా విశాఖ ఉక్కునే అమ్మేయాల‌న్న  ప్ర‌తిపాద‌న‌లు వెలుగు చూశాయి.  క‌రోనా టైంలో కూడా లాభాల్లో ఉంటే.. దాని ఫ‌ర్నీసులు కొంత  కాలం  నిలిపేశారు. అట్లుంట‌ది మోడీతో అనంటారు. విశాఖ‌లో అదానీ సెంట‌ర్ కోసం వంద‌ల ఎక‌రాల భూములిచ్చేస్తున్నారు. ఇలా నేరుగా చేస్తే వ్య‌తిరేఖ‌త వ‌స్తుంద‌ని భావించి గూగుల్ ముసుగు వేశార‌ని చెప్పుకొస్తున్నారు. వ‌చ్చే రోజుల్లో విశాఖ‌ప‌ట్నం కాస్తా అదానీ ప‌ట్నంగా మారినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు. దేశంలో ఆహార గోదాముల‌న్నిటినీ అదానీకి రాసిచ్చేయ‌డం వెన‌క‌.. రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర‌ల్లేకుండా కేవ‌లం  కార్పొరేట్ కంపెనీలు మాత్ర‌మే బాగు ప‌డాల‌న్న ఉద్దేశం దాగి ఉంద‌ని అంటారు. రైతులు ఢిల్లీలో ఘోర‌మైన చ‌లిలో ఉద్య‌మం చేశారు. ఆ రైతుల్లో కొంద‌రు చ‌లికి త‌ట్టుకోలేక మ‌ర‌ణించాక‌.. అప్పుడు రైతు గిట్టుబాటు ధ‌ర‌ల చ‌ట్టం చేశారు.   ఇక ల‌డ‌ఖ్ లో 45 వేల ఎక‌రాల భూమి వ్య‌వ‌హారం. అక్క‌డంతా కొండ‌ల మ‌యం. ఆ భూమిని కూడా అదానీ ప‌రం చేసేశారు. సోలార్ ప‌వ‌ర్ కోసం క‌ట్ట‌బెట్టేశారు. అందుకే ఆర్టిక‌ల్ 370 ర‌ద్ద‌య్యింద‌న్న విష‌యం ఎంత మందికి తెలుసు?  ఇదంతా గుర్తించ‌ని గుజ‌రాతీ మార్క్ భ‌క్త జ‌నం.. హిందూ- ముస్లిం, భార‌త్- పాక్ మాయ‌లో ప‌డిపోతుంటారు. దీంతో ల‌ఢాఖ్ భూముల విష‌యంలో పోరాడుతున్న సోనం వాంగ్ చుక్ అనే సైంటిస్టును విల‌న్ గా చిత్రీక‌రిస్తారు. అత‌డ్ని జైల్లో పెట్టినా.. అంతా దేశం కోస‌మే అనుకుంటారు. కానీ, ఇదంతా అదానీ కోస‌మ‌ని తెలుసుకోలేని పిచ్చిత‌నం ఈ జ‌నానిద‌ని చెప్పుకొస్తారు కొంద‌రు ప‌రిశీల‌కులు. ఇక మ‌ణిపూర్ అల్ల‌ర్ల సంగ‌తి  స‌రే స‌రి. ఈ ప్ర‌పంచానికి తెలియ‌దు.. అక్క‌డ ఎంత‌టి ర‌క్త‌పాతం జ‌రిగిందో. ఇదంతా ఎందుకంటే అక్క‌డ అద్భుత‌మైన  లిథియం ఉంది. దీన్ని కూడా అదానీకి  రాసివ్వ‌డంలో భాగం. అందుకే ఆర్టిక‌ల్స్ ర‌ద్ద‌వుతుంటాయి. కొత్త కొత్త చ‌ట్టాలు పుట్టుకొస్తుంటాయి. ఎవ‌రైనా ఎదురొడ్డి పోరాడితే వారి  ప్రాణాలు సైతం పోతుంటాయ‌ని అంటారు కొంద‌రు విశ్లేష‌కులు. ఛ‌త్తీస్ గ‌ఢ్ విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల ఎన్ కౌంట‌ర్లో చ‌నిపోయిన హిడ్మా ఉదంతం తీస్కుంటే.. న‌క్స‌లైట్ల  ఉనికి లేని స‌మ‌యంలో కూడా అతి పెద్ద ఉద్య‌మం తీసుకొచ్చారు. అదే  2026 మార్చి నాటికి న‌క్స‌లైట్ ఫ్రీ స్టేట్ గా చేయ‌డం. దీని వెన‌క అస‌లు ఉద్దేశం ఏంటో చూస్తే.. హిడ్మా ఇక్క‌డ అడ్డుగా  ఉన్నాడ‌ని చెప్పి అత‌డ్ని ఎన్ కౌంట‌ర్ చేయించారు. ఎప్పుడైతే హిడ్మా అడ్డు తొలిగిందో.. ఆనాటి  నుంచి అదానీ సంస్థ‌ అక్క‌డ అడ‌వుల‌ను న‌రికి బొగ్గు త‌వ్వ‌కం ప్రారంభిస్తుంది. అందుకే తీవ్రంగా ఉద్య‌మిస్తున్నారు స్థానిక ఆదివాసీలు. అంతెందుకూ ఏపీలో అదానీ స్మార్ట్ మీట‌ర్స్ సంగ‌తే తీస్కుంటే  ఎంత దోపీడీ జ‌ర‌గ‌నుందో ముందు ముందు తెలుస్తుంద‌ని అంటారు. ఇక కేజీ బేసిన్ వ్య‌వ‌హారం విష‌యానికి వ‌స్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి గుజ‌రాత్ కి పైపులైన్లు వేసి మ‌రీ తోడేస్తున్న సంగ‌తి తెలిసిందే. నాటి సీఎం ఏమ‌య్యారో విధిత‌మే.  ఇక్క‌డ జ‌నం ఎక్క‌డ మోస‌పోతుంటారంటే.. నాణానికి ఒక వైపు మాత్ర‌మే చూడ్డం వ‌ల్ల‌. మోడీ అండ్ కో ఆడించే  హిందూ- ముస్లిం, భార‌త్- పాక్ వంటి రాజ‌కీయ నాట‌కాలు మ‌రుగున  ప‌డిపోతుంటాయ్. ఒక వైపు బొమ్మ మాత్ర‌మే చూపించి మ‌రో వైపు అంబానీ, అదానీల‌కు ఈ దేశ ఆదివాసీల సంప‌ద దోచి పెట్టేస్తుంటార‌ని అంటారు ఈ వ్య‌వ‌హారాలు తెలిసిన‌ వారు. పాక్ అంటే మ‌న‌కు మాత్ర‌మే శ‌తృత్వం. అదే మోడీకి కాదు. అందుకే  ఆయ‌న ఎవ‌రికీ తెలీకుండా ఆ దేశం వెళ్లి విర్యానీలు భోం చేసి వ‌చ్చేస్తుంటారు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో పాక్ ని ఒక శ‌తృదేశంగా చిత్రీక‌రించి జ‌నాన్ని ఆ మాయ‌లో ప‌డేలా  చేస్తుంటార‌న్న‌ది ఇక్క‌డ స్ప‌ష్టాతి స్ప‌ష్టం. కానీ దాన్నెవ‌రూ ప‌ట్టించుకోకుండా టోట‌ల్ బ్ల‌ర్.. చేసి బొమ్మ చూపిస్తారన్న  ఆరోప‌ణ‌లున్నాయ్.  బీహార్లోనూ అంతే ల‌క్ష  ఎక‌రాల భూమిని కేవ‌లం రూపాయ ధ‌ర‌కు అంబానీ ప‌రం చేసేశారు. అదేమంటే జ‌నం ఇళ్లు, గుడులు కూల‌దోస్తున్నారు దీంతో స్థానిక ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. ఇటీవ‌ల ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ టైంలో మోడీ భూటాన్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు.. అయితే ఇక్క‌డికి మోడీ ఎందుకెళ్లారో చూస్తే.. ఆ వెంట‌నే ఆ దేశంలో అదానీ ప్ర‌త్య‌క్ష‌మై.. అగ్రిమెంట్ చేసుకున్నారు.  ఇదే కాదు దేశ‌మేదైనా.. స‌రే, మోడీ ఏదైనా విదేశీ ప‌ర్య‌ట‌న చేస్తే.. ఆ వెన‌క‌ అదానీ వ్యాపార అగ్రిమెంట్లు దాగి ఉంటాయ‌ని తెలుస్తోంది. ఇది నిన్న‌మొన్నటి ఇండిగో అయినా, మ‌రొక‌టైనా అంతా దేశం కోస‌మ‌ని అంటారు కానీ, అదానీ కోస‌మేన‌ని తెలుస్తోంది. కానీ ఈ వ్య‌వ‌హార‌మేదీ జ‌నానికి  ఎందుకు తెలీదంటే, దేశ వ్యాప్తంగా ఉన్న 13 మీడియా సంస్థ‌లు అదానీ చేతిలో ఉండ‌గా.. అంబానీ చేతిలో 21 ఉండ‌టంతో ఇదంతా క‌నిపించ‌ని మ‌హామాయ‌గా జ‌రుగుతూనే వస్తోంది. ఇలాంటివి ఇంకెన్ని.. సంక్షోభాలు చూడాలో ఆ పైవాడికే  ఎరుక‌!!!

గంజాయి మత్తులో కార్లకు నిప్పంటించిన యువకులు

  హైదరాబాద్‌ నగరంలో కొంతమంది యువకులు నడిరోడ్డు మీద హంగామా సృష్టించారు. యూసుఫ్‌ గూడా రహమత్ నగర్ కార్మికనగర్‌లోని ఎస్వీఎస్‌ గ్రౌండ్‌లో గురువారం మధ్యాహ్నం సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడ నిలిపి ఉంచిన పలువురు వ్యక్తులకు చెందిన కార్లు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకోవడంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా అలజడి చెలరేగింది. క్షణాల్లో మంటలు ఎగసిపడుతూ వరుసగా వాహనాలను చుట్టుముట్టాయి.  ఈ మంటలో మూడు కార్లు, ఒక ఆటో పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బందిఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సుమారు కొన్ని గంటల ప్రయత్నాల తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చినా అప్పటికే పలువురు కార్లు ఆటో మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. ప్రాథమిక విచారణలో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి.  గంజాయి మరియు మద్యం మత్తులో ఉన్న కొంతమంది యువకులు  నడి రోడ్డుపై హల్ చల్ చేస్తు...అక్కడ నిలిచిన కార్లకు ఉద్దేశపూర్వకంగానే నిప్పంటించినట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక సీసీ కెమెరాలను పరిశీలించిన అనంతరం నిందితులను గుర్తించే దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్ని ప్రమాదం జరిగిన గ్రౌండ్‌లో సెక్యూరిటీ లేకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి కారకులైన యువకులను పట్టుకునేందుకు పోలీసులు వేట కొనసాగించారు.

ప‌ట్టులోనూ అవినీతి ప‌ట్టా వెంక‌న్నా...నీ చుట్టూ ఏం జ‌రుగుతోంది స్వామీ

  క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం శ్రీవెంక‌టేశ్వ‌ర‌స్వామి వారి చుట్టూ మ‌రీ ఇన్ని అవినీతి బాగోతాలా?  మొన్న ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వ్య‌వ‌హారం, నిన్న ప‌ర‌కామ‌ణి ఇష్యూ.. తాజాగా ప‌ట్టు వ‌స్త్రాల అవినీతి బండారం.  పాపం ఆ వెంక‌న్న ఇంత పెద్ద నామాల‌తో క‌ళ్లు మూసుకుని ఉంటారు కాబ‌ట్టి  వీరిష్టానికి వీరు య‌ధేచ్చ‌గా దోపిడీ చేసేస్తున్నారు. ఆయ‌న నిజ నేత్ర ద‌ర్శ‌న  స‌మ‌యంలో ఈ అవినీతి బండారం ఎవ‌రో ఒక‌రి రూపంలో బ‌య‌ట ప‌డేస్తున్నారు. ఇంత‌కీ తాజా వ్య‌వ‌హారంలో ఎవ‌రూ,  ఏంట‌ని చూస్తే.. ప‌దేళ్ల కాలంలో అంటే, 2015- 25 మ‌ధ్య‌కాలంలో కేవ‌లం ప‌ట్టు కండువాల కుంభ‌కోణంలో 54 కోట్ల పై చిలుకు కొల్లగొట్టేశారంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు. శ్రీవారు రాత్రింబ‌వ‌ళ్లు కాళ్లు నొప్పులు పుట్టేట‌ట్టు నిలుచుంటారు. ఇక‌ జ‌నం బాధ‌లు విని విని, చెవులు చిల్లులు ప‌డేలాంటి  ప‌రిస్థితి. వారి క‌ష్ట‌న‌ష్టాల‌న్నీ విని వారి ఆర్త‌నాదాల‌న్నీ తీర్చినందుకుగానూ కానుక‌ల రూపంలో రోజూ కోటి రూపాయ‌ల‌కు పైగా సంపాదిస్తుంటారు.  ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నిక దేవుడిగా అల‌రారుతుంటారు. అలాంటి దేవుడి సొమ్ము ఎలాగైనా స‌రే కాజేయాల‌న్న ఆలోచ‌న కొద్దీ.. కొంద‌రు అవినీతి ప‌రులు ప్రతి చిన్న విష‌యానికీ.. పెద్ద పెద్ద టెండ‌ర్లు వేసి శ్రీవారి  సొమ్ము  ఇదిగో ఇలా స్వాహా చేస్తున్నారు. తాజాగా శ్రీవారి సొమ్ము ఎలా కాజేశారో చూస్తే.. స్వామి వారి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే ప్ర‌ముఖుల‌కు ఒక శేష వ‌స్త్రం క‌ప్ప‌డం ఆచారం.  అయితే స్వామివారి స్థాయికి త‌గ్గట్టు, ఈ వ‌స్త్రం ప‌ట్టుగా ఉండాల‌ని భావించి న‌గ‌రిలోని  ఒక సంస్థ‌కు ఈ కాంట్రాక్టు అప్ప‌గించ‌గా.. ఈ సంస్థ గ‌త కొంత‌కాలంగా మూడు వంద‌లు కూడా  చేయ‌ని ప‌ట్టు వ‌స్త్రానికి  ప‌ద‌మూడు వంద‌ల‌కు పైగా  వ‌సూలు చేస్తోంది. స‌రే ఇదేమైనా ప్యూర్ మ‌ల్బ‌రీ ప‌ట్టా? అని చూస్తే.. అది  కూడా కాద‌ని తేలింది. టీటీడీ విజిలెన్స్ విభాగం ల్యాబ్ లో టెస్ట్ చేయించ‌గా.. పాలిస్ట‌ర్- పాలిస్ట‌ర్ గా రిపోర్టులొచ్చాయి. ఈ ఏడాది కూడా  ఈ వ‌స్త్రం 15 వేల ఆర్డ‌ర్లు ఇచ్చింది  టీటీడీ. ఇదెలా బ‌య‌ట ప‌డిందో చూస్తే టీటీడీ  చైర్మ‌న్ బీఆర్ నాయుడు ఇలాంటిదే ఒక ప‌ట్టు వ‌స్త్రం కొన‌గా దాని ధ‌ర 400 వంద‌ల రూపాయ‌లు కూడా లేదు.  ఈ విష‌యం గుర్తించిన నాయుడు టీటీడీ  కొంటోన్న ప‌ట్టు పై  కండువా ఎంతుందో ప‌రిశీలిస్తే 1300 కి పైగా ఉన్న‌ట్టు తెలిసింది. దీంతో ఆశ్చ‌ర్య‌పోయిన ఆయ‌న ఈ ప‌ట్టుబండారం మొత్తం బ‌య‌ట‌కు కూలీ లాగ‌గా ఇక్క‌డ‌ కూడా యాభై కోట్లకు పైగా దోపిడీ జ‌రిగిన‌ట్టు తెలిసింది. ఇలా శ్రీవారి విష‌యంలో ప్ర‌తి చిన్న విష‌యంలోనూ ఏదో ఒక అవినీతి మ‌యంగా మార‌డం చూస్తుంటే.. ఇందుకంటూ ఒక అంతు లేద‌ని  తెలుస్తోంది. భ‌క్తులు తామేసిన డ‌బ్బు ఎలాంటి  అవినీతిప‌రుల పాల‌వుతుందో అన్న ఆందోళ‌న చెందుతున్నారు. అలాగ‌ని ఇదేం ఎక్క‌డో ఉండే బోలే బాబా వంటి న‌కిలీ నెయ్యి స‌ర‌ఫ‌రా చేసే సంస్థ కాదు.. ద‌గ్గ‌ర్లోనే  ఉండే న‌గ‌రిలోని వీఆర్ఎస్ అనే సంస్థ‌. ఈ ప్రాంతంలో స్వామి వారి ప‌ట్ల ఎన్నో భ‌య‌భ‌క్తులుంటాయి. అలాంటి వీరికి కూడా వెంక‌న్న అంటే భ‌యం భ‌క్తీ లేక పోవ‌డ‌మూ ఒక చ‌ర్చ‌నీయంశంగా త‌యారైంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు బిగ్ షాక్

  తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు చుక్కెదురైంది. రేపు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అధికారి ఏసీపీ వెంకటగిరి ఎదుట ఉదయం 11 గంటల లోపు లొంగిపోవాలని పేర్కొంది. విచారణ సమయంలో ఆయనను ఎటువంటి టార్చర్ చేయవద్దంటూ సిట్ అధికారులకు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. 14 రోజులు ఆయన్ను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం పిటిషన్ వేయగా, ఇంటరాగేషన్ అంశంపై శుక్రవారం విచారణ జరగనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో  ప్రభాకర్ రావు బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌పై మంగళవారం అత్యున్నత న్యాయస్థాన విచారణ జరిపింది. ఈ కేసును గురువారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై గతనెల.. నవంబర్ 18వ తేదీనే వాదనలు జరగాల్సి ఉంది. కానీ ప్రభాకర్ రావు తరఫు న్యాయవాది అందుబాటులో లేరు. దాంతో ఈ పిటిషన్‌పై విచారణ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరగా ఈ రోజు.. అంటే గురువారం ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది  

కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు

పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో  పిన్నెల్లి సోదరులు గురువారం (డిసెంబర్ 11) మాచర్ల కోర్టులో లొంగిపోయారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి లకు లొంగిపోవడానికి సర్వోన్నత న్యాయస్థానం   ఇచ్చిన గడువు ముగుస్తున్న తరుణంలో మాచర్చ కోర్టుకు హాజరై సరెండర్ పిటిషన్ దాఖలు చేసి లొంగిపోయారు.  ఈ ఏడాది మే 24న పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు జె. వెంకటేశ్వర్లు, జె. కోటేశ్వరరావు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో పిన్నెల్లి సోదరులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వారు ముందస్తు బెయిల్ కోసం తొలుత ఏపీ హైకోర్టును, ఆ తరువాత సుప్రీం కోర్టునూ ఆశ్రయించారు. రెండు చోట్లా వారికి చుక్కెదురైంది.   సుప్రీం కోర్టు వారి ముందస్తు బెయిలు పిటిషన్ ను కొట్టివేస్తూ రెండు వారాల్లోగా సంబంధిత కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు విధించిన గడువు ముగుస్తుండటంతో వారు కోర్టులో లొంగిపోయారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  అలాగే గురజాల సబ్‌ డివిజన్‌ పరిధిలో 144 సెక్షన్‌ విధించడంతో  పాటు పోలీస్‌ యాక్ట్‌ 30ను అమలు చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పలువురు వైసీపీ నాయకులకు   హౌజ్‌ అరెస్టు చేశారు.