‘ప్రతిజ్ఞ’ చేయాలి... తప్పదు!
posted on Sep 15, 2012 @ 12:17PM
‘భారతదేశము నా మాతృభూమి.. భారతీయులందరూ నా సహోదరులు.. నేను నా దేశమును ప్రేమించుచున్నాను...’ అంటూ విద్యాలయాల్లో పిల్లలచేత ప్రతిజ్ఞచేయించడం అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు కొన్ని పాఠశాలల్లో చేయిస్తున్నారంటే... అనుమానించాల్సిందే! వందేమాతరం వ్రాసింది ఎవరంటే బకించంద్ర అంటారు, జనగణమన ఎవరంటే రవీంథ్రనాథ్ ఠాగూర్ అంటారు. మరి ప్రతిజ్ఞ ఎవరు వ్రాశారంటే... దానికి ప్రతివారి ముఖం ప్రశ్నగుర్తుగా మారుతుంది! అది ఎవరూ వ్రాశారో తెలియదు కనుక. తెలుసుకునే ప్రయత్నం చేయలేదు కనుక. అయితే ఆ ప్రతిజ్ఞను వ్రాసింది మన తెలుగువాడు అన్న విషయం తెలిస్తే ప్రతి తెలుగు గుండె ఆనందంతో ఉప్పొంగుతుందేమో. ప్రతిజ్ఞ రచయిత నల్గొండ జిల్లాకు చెందిన పైడిమర్రి వెంకటసుబ్బారావని 1962లో విశాఖపట్నంలో వృత్తిరీత్యా డిటివొగా బదిలిఅయినప్పుడు అక్కడే ఈ రచన చేశారని తెలుస్తోంది. 1962లో ఈ గీతాన్ని వ్రాసి నాటి పార్లమెంట్ సభ్యులు తెన్నేటి విశ్వనాథంకు వినిపిస్తే మెచ్చుకుని నాటి విద్యాశాఖామంత్రి పి.వి.జి.రాజుగారికి చూపిస్తే ఆయన దాని భావాన్ని, రచనను మెచ్చుకుని ప్రతి పాఠశాలలోను ఈ గీతాన్ని ఆలపించాలని ఆదేశాలు జారీచేశారుట. మొదట విశాఖలోని పాఠశాలలో ఈ గీతం ఆలపించడం జరిగింది. తర్వాత 1965 జనవరి 26వ తేదీ ప్రతి పాఠశాలలో ఉదయాన్నే విద్యార్ధుల అసెంబ్లీ సమయంలో ఆలపించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని, దీనిపై అధ్యయనం చేసిన ఉత్తరాంధ్ర కన్వీనర్ ఎస్.ఎస్. శివశంకర్ తెలిపారు. క్రమంగా ఇది అన్ని భాషల్లోను అనువదించబడిరది. పైడిమర్రి వెంకట సుబ్బారావు 1988 ఆగస్టు 13న చనిపోయారు. ఈయన కుమారుడు తన తండ్రి పేరు పాఠశాల పుస్తకాల్లో రచయితగా ప్రచురించే వరకు పోరాడతానని అంటున్నారు. నిజంగా ఇది ఆనందించదగ్గ విషయం. అయితే దేశ చరిత్రలోకాని, రాష్ట్ర చరిత్రలోకాని తెలుగువాడికి గుర్తింపు లేదు, రాదన్నది ఎవరూ కాదనలేని నిజం.! కనీసం ఈ విషయంలోనైనా వాస్తవాలను గుర్తించి మన తెలుగువాడికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా కృషిచేసేందుకు, ప్రతిజ్ఞ చేయాలని ఆశించడం కన్నా మనం ఏం చేయలేం!