తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికి వైసీపీ ఏం చేసిందంటే?..
తిరుమల పవిత్రతను దెబ్బతీయడం, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించడమే లక్ష్యంగా జరిగిన కుట్రను పోలీసులు ఛేదించారు. తిరుమలలొ ఓ గెస్ట్ హౌస్ వద్ద ఖాళీ మద్యం సీసాల కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు వారిని బుధవారం (జనవరి 7) మీడియా ముందు ప్రవేశ పెట్టారు.
ఈ నెల 4న సామాజిక మాధ్యమంలో తిరుమలలో పోలీసు గెస్ట్ హౌస్ సమీపంలో ఖాళీ మద్యం సీసాలు అంటూ, ఫొటోలతో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే లక్ష్యంగా ఖాళీ మద్యం సీసాలను వైసీపీ నేతలు, ఆ పార్టీకి చెందిన మీడియా వ్యక్తులు కుట్రపూరితంగా తిరుపతి నుంచి తీసుకువచ్చి కౌస్తుభం గెస్ట్ హౌస్ పక్కన పొదల్లో పడేశారని తేల్చారు. వైసీపీ మీడియా ప్రతినిధులతో పాటు తిరుపతిలోని వైసీపీ నేతలే ఈ కుట్రను అమలు చేసినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు కమాండ్ కంట్రోల్ తో పాటు, వివిధ ప్రదేశాలలో సిసి కెమెరాలు పరిశీలించారు. అలాగే ఎక్సైజ్ డిపార్టుమెంటు సహకారంతో ఖాళీ సీసాల పైన వున్న ఆధారాల ద్వారా, వాటిని కొనుగోలు చేసిన దుకాణాలను గుర్తించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసి.. తద్వారా టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతీయడానికే వైసీపీ నేతలు ఈ పని చేశారని నిర్ధారించారు. సీసీ కెమెరాలు, ఫాస్టాగ్ నివేదిక, నిందితుల వాహనాల రాక పోకలు, ఫోన్ సిగ్నల్స్ సహా ఇతర సాంకేతిక ఆధారాలతో ఈ కుట్రను ఛేదించినట్లు తిరుపతి పోలీసులు మీడియాకు వివరించారు. ఈ కేసుకు సంబంధించి వైసీపీ కార్యకర్త కోటి, ఆ పార్టీ అధికారిక మీడియా ప్రతినిధి మోహన్ కృష్ణ ను అరెస్టు చేసినట్లు తెలిపిన పోలీసులు, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త నవీన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడనీ, అతడి కోసం గాలిస్తున్నామనీ తెలిపారు. ఇలా ఉండగా అరెస్టు చేసిన ఇద్దరినీ, కోర్టులో ప్రవేశపెట్టగా, కోర్టు వారికి పదివేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిలు మంజూరు చేసింది.