స్టీల్ ప్లాంట్ భూములపై లోకేష్ క్లారిటీ

 

విశాఖపట్నం స్టీల్ ప్టాంట్ ప్రైవేటీకరణ జరగదని  మంత్రి నారా లోకేశ్ పునరుద్ఘాటించారు. ఈ స్టీల్ ప్లాంట్ భూములు విషయంలో ఎవరైనా స్టేట్‌మెంట్ ఇచ్చారా? అని విలేకర్లను ఆయన సూటిగా ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ భూములను వాటి అవసరాలకు తప్ప, మరే ఇతర అవసరాలకు వినియోగించ లేదని.. వినియోగించబోమని ఆయన స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్టాంట్ లాభాల బాటలో నడవాలని.. అందుకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా లోకేశ్ పిలుపునిచ్చారు. 

బుధవారం విశాఖపట్నంలో మంత్రి విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ కోసం ఎవరూ పోరాటాలు చేయడం లేదని లోకేశ్ పేర్కొన్నారు. ఎర్ర బస్సు రాని ప్రాంతానికి ఎయిర్ పోర్టు ఎందుకని గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో జీఎంఆర్‌కు ఇచ్చిన భూములను వెనక్కి తీసుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ ఆ భూములను జీఎంఆర్‌కు కేటాయించామని వివరించారు. 

భోగాపురం ఎయిర్ పోర్ట్ క్రెడిట్ కావాలంటే తీసుకోవచ్చంటూ వైసీపీ వాళ్లకు లోకేశ్ సూచించారు. చిత్తూరు జిల్లా నుంచి అమర్ రాజా బ్యాటరీస్ వెళ్లగొట్టిడం, పీపీలు రద్దు, పలు కంపెనీలను రాష్ట్రం నుంచి పంపేయడం, ఆఫీస్ అద్దాలు పగలగొట్టడం వంటి సంఘటనల క్రెడిట్ అంతా వైసీపీకే దక్కుతుందని లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒకటి రెండు నెలల్లో విశాఖపట్నం వేదికగా గూగుల్ డేటా సెంటర్ పనులు ప్రారంభమవుతాయని లోకేశ్ చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్టు కనెక్టింగ్ రోడ్లపై దృష్టి సారించామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క 108 వాహనం ఆగలేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చాలా 108 వాహనాలు ఆగిపోయాయని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు

చైనాలో ఒక్కో కోతి ధర రూ.25 లక్షలు

  చైనాలో కోతుల కొరత పెరిగిపోతండంతో వాటికి భారీగా డిమాండ్ పెరిగింది. ఒక్కో కోతికి ఏకంగా రూ.25 లక్షల వరకు చెల్లిస్తున్నారు. కొత్తగా తయారు చేసిన మందుల  క్లినికల్ ట్రయల్స్ కోసం చైనా కోతులపై ఆధారపడుతోంది.  కోతుల కొరత కారణంగా.. ఔషధాలు తయారు చేసే వ్యయం పెరగడంతోపాటు.. కొత్త పరిశోధనలు ఆలస్యం అవుతున్నాయని చైనా ఆందోళన చెందుతోంది.  చైనాలో బయోటెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తుండటంతో.. ల్యాబ్‌లలో ప్రయోగాల కోసం ఉపయోగించే కోతుల కొరత ఏర్పడింది. దీంతో కోతుల ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఒక్కో కోతి ధర 1.5 లక్షల యువాన్లు అంటే మన భారత కరెన్సీలో సుమారు రూ.18 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెరిగింది. కొత్త మందుల క్లినికల్ ట్రయల్స్ విపరీతంగా పెరగడం, కోతుల పెంపకంలో నెలకొన్న జాప్యం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అక్కడి వర్గాలు చెబుతున్నాయి.   దీని వల్ల మందుల తయారీ ఖర్చు పెరుగుతోందని.. కొత్త ప్రయోగాలు చేయడానికి మరింత  గతేడాది ఒక్కో కోతి సగటు ధర సుమారు 1,03,000 యువాన్లు అంటే దాదాపు రూ.13 లక్షలు ఉండగా.. 2026 ప్రారంభం నాటికి రూ.25 లక్షల వరకు చేరుకుంది. కరోనా మహమ్మారి సమయంలో గరిష్ట స్థాయికి చేరిన కోతుల ధరలు.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు మళ్లీ అదే స్థాయికి చేరుకోవడం పరిశోధనా సంస్థలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

మాజీ ఐపీఎస్‌ అధికారి భార్యకు రూ.2.58 కోట్ల టోకరా

  స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరిట భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించి, ఒక మాజీ ఐపీఎస్‌ అధికారి భార్య నుంచి రూ.2.58 కోట్లను కాజేసిన ఘటన హైదరాబాద్‌ నగరంలో కలకలం రేపుతోంది. సైబర్ నేరగాళ్లు అత్యంత ప్రణాళికాబద్ధంగా ఈ మోసానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. వాట్సాప్‌ ద్వారా మొదలైన మోసం గత నెలలో బాధితురాలికి వాట్సాప్‌లో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చిట్కాలు ఇస్తామని ఒక సందేశం వచ్చింది. పెట్టుబడుల ద్వారా తక్కువ సమయంలోనే భారీ లాభాలు సాధించవచ్చని, తామిచ్చే సలహాలు పూర్తిగా నిపుణులవి అంటూ సైబర్ నేరగాళ్లు నమ్మించారు. స్టాక్ మార్కెట్‌పై అవగాహన లేకపోవడంతో, బాధితురాలు ఈ విషయాన్ని తన భర్తకు తెలిపి, ఆయన్ను కూడా ఆ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయించింది.  29.11.2025న, నా భర్త “స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ 20” అనే వాట్సాప్ గ్రూప్‌లో చేరారు, అందులో సుమారు 167 మంది సభ్యులు ఉన్నారు.ఆ తర్వాత కొద్దికాలానికే, దినేష్ సింగ్ అని తనను తాను పరిచయం చేసుకున్న ఒక వ్యక్తి, 9685717841 అనే మొబైల్ నంబర్‌ను ఉపయోగించి, గ్రూప్‌లో వివరణాత్మక సందేశాలను పంపుతూ చురుకుగా తరగతులు మరియు చర్చలు నిర్వహించడం ప్రారంభించాడు. అతను సామూహిక పెట్టుబడి యొక్క ప్రాముఖ్యత, ట్రేడింగ్‌లో క్రమశిక్షణ మరియు సమన్వయ వ్యూహాల ప్రయోజనాలను వివరించాడు.  అతని సందేశాలు అత్యంత పాండిత్యంతో, విశ్లేషణా త్మకంగా వివరించారు. అతని మాటలు ఆ గ్రూపులో ఉన్న వారందరూ నమ్మారు.. ఇతను చాలా స్టాక్ మార్కెట్ గురించి వివరించారు. చాలా మంది గ్రూప్ సభ్యులు ఈ స్టాక్‌లు మంచి లాభాలను ఇస్తున్నాయని పేర్కొంటూ గ్రూప్‌లో సందేశాలను మరియు స్క్రీన్‌షాట్‌లను పోస్ట్ చేయడం ప్రారంభించారు.  అలా గ్రూపులో ఉన్న సభ్యులందరూ మెసేజ్లు చేయడంతో బాధితురాలు అది నిజమని పూర్తిగా నమ్మింది. వాట్సాప్ గ్రూప్‌లో సభ్యులకు 500 శాతం వరకు లాభాలు వస్తాయని నమ్మించారు. తమ సంస్థ సెబీ సర్టిఫైడ్ వెబ్‌సైట్ అంటూ ప్రచారం చేశారు. దీనికి మద్దతుగా సెబీకి చెందినట్లుగా కనిపించే నకిలీ సర్టిఫికెట్లు, డాక్యు మెంట్లను కూడా వాట్సాప్‌లో పంపించారు. ఈ నకిలీ ధృవపత్రాలను చూసి బాధితురాలు నిజమేనని విశ్వసించారు. సైబర్ నెరగాళ్లు బాధితురాలు చేత తొలుత చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టించి, ఆన్‌లైన్ డ్యాష్‌బోర్డ్‌లో లాభాలు వచ్చినట్లు చూపిస్తూ.... మరింత పెట్టుబడి పెట్టేం దుకు ప్రోత్సహించారు. సైబర్ నేరగాళ్ల మాటలు పూర్తిగా నమ్మిన బాధితురాలు డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు మొత్తం 19 ట్రాన్సాక్షన్లలో రూ.2.58 కోట్లు పెట్టుబడి పెట్టారు.కొంత కాలానికి అనుమానం రావడంతో బాధితురాలు పెట్టుబడి నిలిపివేయగా, సైబర్ నేరగాళ్లు తీవ్ర ఒత్తిడి మొదలుపెట్టారు. మళ్లీ మళ్లీ పెట్టుబడి పెట్టాలని, పెట్టుబడి చేయకపోతే ఇప్పటివరకు పెట్టిన మొత్తం డబ్బు మొత్తం పోతుందని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ పరిణామాలతో  భారీ మోసానికి గురైనట్టు తెలుసుకున్న బాధిత కుటుంబం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది.  బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నకిలీ సెబీ సర్టిఫికెట్లు, వాట్సాప్ గ్రూప్ లింకులు, బ్యాంక్ ఖాతాల వివరాల ఆధారంగా నిందితుల జాడ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దిపి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన నేపథ్యంలో పెట్టుబడుల పేరిట వచ్చే వాట్సాప్ సందేశాలు, అధిక లాభాల ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. సెబీ సర్టిఫికేషన్ పేరుతో వచ్చే లింకులు, డాక్యుమెంట్లను అధికారిక వెబ్‌సైట్లలో ధృవీకరించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడులు పెట్టవద్దని సూచించారు.

అయోధ్య ఆలయంలో నమాజ్‌.. కశ్మీర్ యువకుడి అరెస్ట్

  అయోధ్య రామాలయం క్లాంప్లెక్స్‌లో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. కాంప్లెక్స్ ఆవరణలో నమాజ్ చేసేందుకు ప్రయత్నించిన కశ్మీర్ యువకుడిని భద్రతా సిబ్బంది శనివారంనాడు అదుపులోనికి తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంప్లెక్స్‌లోని దక్షిణ గోడల ప్రాంతం వద్ద ఉన్న సీతాదేవి వంటగది సమీపంలో ఆ యువకుడు నమాజ్‌కు ప్రయత్నించినట్టు సమాచారం.  కశ్మీరీ సంప్రదాయ దుస్తులు ధరించిన యువకుడు గేట్ డీ1 ద్వారా రామాలయంలోకి ప్రవేశించాడు. అతనిని కశ్మీర్‌లోని షోపియాన్ నివాసి అహ్మద్ షేక్‌గా గుర్తించారు. అతన్ని ఆపేందుకు ప్రయత్నించగా ఒక మతానికి చెందిన వ్యక్తుల సపోర్ట్ కోరుతూ నినాదాలు చేసినట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం అతన్ని భద్రతా సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. రామాలయం ట్రస్టు సైతం వెంటనే స్పందించలేదు.  మరోవైపు, రామాలయానికి 15 కిలోమీటర్ల లోపు నాన్-వెజిటేరియన్ ఆహారాన్ని సరఫరా చేయరాదంటూ జిల్లా యంత్రాంగం ఒక అధికారిక ప్రకటన చేసింది. అతిథులకు నాన్‌వెజిటేరియన్ ఆహారం, ఆల్కహాలిక్ డ్రింకులు సరఫరా చేయరాదని హోటళ్లు, వసతి గృహాలకు హెచ్చరికలు చేసింది. ఆన్‌లైన్ ఆర్డర్ ఇచ్చిన టూరిస్టులకు నాన్‌వెజ్ సరఫరా చేస్తున్నట్టు తమకు సమాచారం అందడంతో రామాలయం, సమీప ప్రాంతాల్లో ఆన్‌లైన్ డెలివరీపై నిషేధం విధించామని అసిస్టెంట్ ఫుడ్ కమిషనర్ మాణిక్ చంద్ర సింగ్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సూరత్ ఎయిర్‌పోర్టులో బిగ్ బికి తప్పిన పెద్ద ప్రమాదం

  సూరత్ ఎయిర్ పోర్ట్‌లో బాలీవుడ్ మెగాస్టార్ అమితా బచ్చన్‌కు పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. సూరత్ విమానాశ్రయానికి అమితా బచ్చన్ చేరుకున్నప్పుడు, ఆయనను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా తరలివచ్చారు. ఆయన తన కారు వైపు వెళ్తున్న సమయంలో కొంతమంది అభిమానులు అత్యుత్సాహంతో సెల్ఫీల కోసం ముందుకు దూసుకురావడంతో అక్కడ తోపులాట జరిగింది.  జనాల ఒత్తిడితో ఎయిర్ పోర్ట్‌లోని ఒక భారీ అద్దం పగిలిపోయింది. ఈ ఘటన జరిగే సమయానికి అమితా బచ్చన్ అద్దానికి సమీపంలో ఉన్నారు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి, ఆయనను అప్రమత్తం చేసి సురక్షితంగా కారులోకి తరలించడంతో ప్రమాదం తప్పింది.  ఒకవేళ ఆ అద్దం ఆయనపై పడి ఉంటే తీవ్రంగా గాయాలయ్యే అవకాశం ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో పలువురికి స్వల్పగాయాలు అయ్యాయి. అమితా బచ్చన్, తన స్నేహితుడు సునీల్ షాను కలవడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ అభిమాన హీరో ప్రమాదం నుంచి తప్పించుకున్న విషయం తెలిసి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

పూర్తిగా ఆరిపోయిన బ్లో అవుట్ మంటలు

  డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద బ్లోఔట్ మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలు పూర్తిగా ఆరిపోవడంతో  ఓఎన్జీసీ విపత్తు నివారణ బృందం శకలాలను పూర్తిగా తొలగించింది. పూర్తి దేశీయ పరిజ్ఞానంతోనే ఓఎన్జీసీ సిబ్బంది మంటలార్పారు. మలికిపురం మండలం ఇరుసుమండ సమీపంలో ఈనెల 5న ఓఎన్జీసీ యాజమాన్యంలోని మోరి-5 బావిలో గ్యాస్ లీక్ కారణంగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.  దాదాపు 20 మీటర్ల ఎత్తు భారీ అగ్నికీలలు ఎగిసి పడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటల నేపథ్యంలో ఇరుసుమండ, లక్కవరం, గుబ్బలపాలెం గ్రామాలకు చెందిన సుమారు 500- 600 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. కాగా, ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. జిల్లా అధికారులు, ఓఎన్జీసీని సమన్వయం చేసి మంటలను అదుపు చేయాలని ఆదేశించారు.  ఈ మేరకు మంటలను అధికారులు అదుపులోకి తెచ్చారు. బ్లోఔట్ అదుపులోకి రావటంతో ఓఎన్జీసీ నిపుణులు సంబరాలు చేసుకున్నారు. బ్లోఔట్ ప్రాంతంలో స్వీట్స్ తినిపించుకుని సంతోషం వ్యక్తం చేశారు. అలాగే బ్లోఔట్ అదుపులోకి రావటంతో ఇరుసుమండ, లక్కవరం, గుబ్బలపాలెం గ్రామ ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇకపై ఓఎన్జీసీ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయాలని స్థానిక గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మియాపూర్‌లో హైడ్రా ఆపరేషన్‌.. రూ.3 వేల కోట్ల ప్రభుత్వ భూమి రక్షణ

  ప్రభుత్వ భూముల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న హైడ్రా మరోసారి తన సత్తా చాటింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ గ్రామం, మక్తా మహబూ బ్‌పేట పరిధిలో హైడ్రా చేపట్టిన భారీ ఆపరేషన్‌లో రూ.3 వేల కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి కాపాడింది. అక్రమ రిజిస్ట్రేషన్లు, తప్పుడు పత్రాల ద్వారా ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలన్న ప్రయత్నాలను హైడ్రా పూర్తిగా అడ్డుకుంది. మియాపూర్ ప్రాంతంలోని సర్వే నంబర్‌ 44లో ఉన్న ప్రభుత్వ భూమి గత కొంతకాలంగా అక్రమ ఆక్రమణలకు గురవుతు న్నట్టు హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు అందాయి.  ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్‌  ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు విచారణ చేపట్టారు. ఇప్పటికే ఇదే సర్వే నంబర్‌లో గతంలోనే 5 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా, తాజాగా మరోసారి సమగ్ర విచారణ జరిపి 15 ఎకరా లకు పైగా భూమిని పూర్తిగా కాపాడినట్లు ప్రకటించింది. ఈ భూమి మియాపూర్– బాచుపల్లి ప్రధాన రహదారికి సమాంతరంగా ఉన్న చెరువు కట్ట ప్రాంతానికి సమీపంలో ఉండటంతో, రియల్ ఎస్టేట్ లాబీలు అక్రమ నిర్మాణాలకు యత్నించాయి.  గతంలోనే చెరువు కట్టపై సుమారు 200 మీటర్ల మేర ఏర్పాటు చేసిన 18 షెట్టర్లను హైడ్రా తొలగించి, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. అయినప్పటికీ అక్రమ రిజిస్ట్రేషన్ల ప్రయత్నాలు కొనసాగడంతో తాజా ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది.హైడ్రా అధికారులు తాజా విచారణలో, తప్పుడు పత్రాల ఆధారంగా సర్వే నంబర్‌ 44లోని దాదాపు 43 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగు తున్నట్టు నిర్ధారించారు. ఈ వ్యవహారంలో సర్వే నంబర్‌ 159కి సంబంధించిన భూమి పత్రాలను ఉపయోగించి, సర్వే నంబర్‌ 44లోని ప్రభుత్వ భూమిలో ఎకరన్నర వరకు అక్రమంగా కబ్జా చేసిన ఇమ్రాన్ అనే వ్యక్తిపై ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.  అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ‘ఇది ప్రభుత్వ భూమి’ అని స్పష్టంగా పేర్కొంటూ హైడ్రా అధికారులు అక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ భూమిపై ఇకపై ఎలాంటి అక్రమ నిర్మాణాలు, లావా దేవీలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు హెచ్చరించారు.ప్రభుత్వ భూములను కాపాడే దిశగా హైడ్రా చేపడుతున్న చర్యలకు ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తు తున్నాయి. రియల్ ఎస్టేట్ మాఫియాకు చెక్ పెట్టడంలో హైడ్రా కీలక పాత్ర పోషిస్తోందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులోనూ అక్రమ ఆక్రమణలపై ఇలాంటి కఠిన చర్యలు కొనసాగుతాయని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు.  

చెంగాలమ్మ సేవలో ఇస్రో చైర్మన్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ పరమేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. వారికి సహాయ కమిషనర్‌, కార్యనిర్వహణాధికారి  ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.  అనంతరం వేద పండితులచే అమ్మవారికి పూజలు నిర్వహించారు.  ఈ నెల 12న ఇస్రో సీఎస్ఎల్వీ- సి62 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్ధించినట్లు ఇస్రొ చైర్మన్ తెలిపారు.  ఈ సందర్భంగా వేదపండితుల మంత్రోచ్ఛారణలతో   ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ను సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ వి. నారాయణన్  రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ఆదివారం ఉదయం 12.19 గంటలకు ప్రారంభమౌతుందన్నారు.  ఆ మరుసటి రోజు అంటే సోమవారం (జనవరి 12 )ఉదయం  10.19 గంటలకు పీఎస్‌ఎల్‌వి -సి62 రాకెట్‌ ద్వారా ఈఓఎస్‌ -ఎన్‌1 ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.  

జైలు నుంచి ఆస్పత్రికి రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో అరెస్టై విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలను జైలు అధికారులు ఈ రోజు ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య సమస్యలతో వారు బాధపడుతుండటంతో జైలు నుంచి ఆస్పత్రికి తరలించినట్లు జైలు అధికారులు తెలిపారు. వీరిలో మద్యం కుంభకోణం కేసులో ఏ1గా ఉన్న రాజ్ కసిరెడ్డి  ఆర్థోపెడిక్ సమస్యలతో గత కొద్ది రోజులుగా బాధపడుతుండటంతో జైలు అధికారులు ఆయనను ఈ రోజు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇక ఈ కేసులో ఏ38గా ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి వెరికోజ్ వెయిన్స్ సమస్యలతో బాధపడుతుండటంతో ఆయనను మంగళగిరి ఎయిమ్స్ కు తరలించారు. జగన్ హయాంలో ఏపీలో  జరిగిన 3,200 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం కేసులో వీరిరువురూ అరెస్టైన సంగతి తెలసిందే. రాజ్ కసిరెడ్డిని గత ఏడాది  ఏప్రిల్ 21న హైదరాబాద్ విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచీ ఆయన విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.  ఇక మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని గత ఏడాది జూన్ 17 బెంగళూరు విమానాశ్రయంలో  సిట్ అరెస్టు చేసింది. అప్పటి నుంచీ చెవిరెడ్డి కూడా రిమాండ్ ఖైదీగా విజయవాడ సెంట్రల్ జైలులోనే ఉన్నారు. వీరిరువురూ పలుమార్ల దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్లను కోర్టులు కొట్టివేశాయి. ఇప్పుడు తాజాగా ఇరువురూ  కూడా అనారోగ్య సమస్యలతో  బాధపడుతుండటంతో జైలు అధికారులు వారిని వేరువేరు ఆస్పత్రులకు తరలించారు.  

భూభారతిలో భారీ అక్రమాలు.. రంగంలోకి లోకాయుక్త

భూభారతి రిజిస్ట్రేషన్ లలో భారీ అక్రమాలపై లోకాయుక్త సుమోటోగా కేసు నమోదు చేసింది. భూ భారతి అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టా లని అధికారులను ఆదేశించింది. భూభారతి పేరుతో జరుగుతున్న రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కుంభకోణంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి.. సమగ్ర నివేదిక సమర్పిం చాలని సంబంధిత   శాఖలను లోకాయుక్త ఆదేశించింది. ఈ విచారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవిన్యూ భూ పరిపాలన శాఖ చీఫ్ కమిషనర్ , స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఐజీ, మీ సేవా కమిషనర్, జనగామ జిల్లా స్టాంపులు రిజిస్ట్రేషన్ల రిజిస్ట్రార్లకు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. భూభారతి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో స్టాంప్ డ్యూటీ చార్జీలను కాజేసేలా ఓ ముఠా వ్యవస్థీకృతంగా పనిచేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. థర్డ్ పార్టీ అప్లికేషన్ సహాయంతో చలాన్ అమౌంట్లను ఎడిట్ చేసి, తక్కువ మొత్తానికి పేమెంట్ చేసి ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించినట్లు అధికారులు గుర్తించారు. అయితే జనగామ జిల్లాలో కేవలం ఒక్కరోజే 10 చలా న్లకు సంబంధించిన రూ.8,55,577ను దుండగులు కాజేసి నట్లు  విచారణ లో తేలింది.  ఉన్నతాధికారులకు అనుమానం రావడంతో వెంటనే చలాన్లపై ప్రత్యేక విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో జనగామ తహసిల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కుంభకోణంలో యాదాద్రి జిల్లాకు చెందిన ఓ ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు చలాన్లను ఎడిట్ చేసి పేమెంట్లు చేసినట్లు గుర్తించారు. అతని పాత్రపై పోలీసులు  విచారణ చేపట్టారు.భూభారతి కుంభకోణానికి సీసీఎల్ఏ సాంకేతిక సిబ్బంది సహకారం కూడా ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఇప్పుడు లోకాయుక్త సుమోటోగా కేసు నమోదు చేసి సమగ్ర విచారణకు ఆదేశాలు ఇవ్వడంతో  మరిన్ని   విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని  అంటున్నారు.