Read more!

అన్ ప్లగ్గింగ్ డే.. సెల్ ఫోన్లు, టీవీలూ ఆపేయండి!

ప్రపంచం చాలా పెద్దది అనుకుంటాం కళ్ళతో చూసినప్పుడు. కానీ అదే ప్రపంచం చాలా చిన్నగా కనిపిస్తుంది మొబైల్ ఫోన్ చేతిలో ఉన్నప్పుడు. అయితే ఈ బయటి ప్రపంచం సంగతి పక్కన పెడితే ప్రతి మనిషికి తనకంటూ ఓ ప్రత్యేక ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలో తల్లిదండ్రులు, స్నేహితులు, ఆత్మీయులు, భార్యా, భర్త, పిల్లలు ఇలా ఎన్నో ప్రధాన పాత్రలు పోషించేవారు ఉంటారు. కానీ ఆ అనుబంధాల ప్రపంచం కాస్తా చేతిలో ఉన్న టెక్నాలజీ వల్ల మసకబారిపోతోంది. కుటుంబంలో ప్రతి ఒక్కరి చేతిలో తప్పకుండా ఓ మొబైల్ ఉంటుంది. ఇంట్లో ఉన్న సమయంలో ఆ మొబైల్ ఏ వారి ప్రపంచం. అందులో సినిమాలు, యూట్యూబ్, ఇతరులతో చాటింగ్, ఇంకా ఎన్నో వైరల్ విషయాలు చూస్తూ కాలాన్ని కరిగించేస్తారు. ఉద్యోగాల కోసం వెళ్ళినప్పుడు ఉద్యోగం ముఖ్యం కదా అని చెబుతారు. స్నేహితులతో వెళ్ళినప్పుడు.. ఫ్రెండ్స్ తో కొంచెం సేపు కూడా సరదాగా ఎంజాయ్ చేయకూడదా అంటారు. మరి కుటుంబం గురించో… ఎప్పుడైనా ఆలోచన చేస్తారా కుటుంబం గురించి. కొందరు తెలివిమీరిన ఫిలాసఫర్ లు కుటుంబం మనల్ని అర్థం చేసుకోకుంటే ఎలా.. అని ఎదుటివారి నోటిని మూసేస్తారు.

ఇప్పటి కాలంలో కుటుంబ ప్రాధాన్యత తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. కుటుంబంతో సంబంధాలు మెరుగ్గా ఉంచుకోవడానికి అన్ ప్లగ్గింగ్ డే నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం మార్చ్ మూడవ తేదీన ఈ అన్ ప్లగ్గింగ్ డే జరుపుకోవడం ఉంటుంది. ప్రతి వ్యక్తికి కుటుంబం ఎంతో అవసరం. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు ఆరోగ్యంగా ఉంటే వారి జీవితాలు కూడా సంతోషంగా ఉంటాయి.

ఏం చెయ్యాలి?

అన్ ప్లగ్గింగ్ డే రోజు మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్స్, టీవీ లు, సిస్టం లు అన్నిటినీ ఆఫ్ చేసేయ్యాలి. ఈ ఒక్కరోజు అయినా ఎలాంటి కార్యకలాపాలు లేకుండా హాయిగా సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి. మీతో మాట్లాడాలని అనుకుని, మీ బిజీ షెడ్యూల్ చూస్తూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉన్న మీ తల్లిదండ్రులతో మనసు విప్పి మాట్లాడవచ్చు. మీ ఉరుకులు పరుగుల రోజులో మీకోసం అన్నిటినీ ఓపికగా సమకూర్చుతున్న మీ జీవిత భాగస్వామితో ఏకాంత సమయాన్ని గడపవచ్చు. ఉద్యోగానికి ఉదయం వెళ్లి రాత్రి ఎప్పుడో ఇంటికి చేరుకోవడం ద్వారా మీ రక్తం పంచుకు పుట్టిన పిల్లలకు సమయాన్ని కేటాయిస్తూ వారితో సరదాగా గడపవచ్చు.

ఇలా తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు మాత్రమే కాకుండా మీకున్న ఆత్మీయులు, మీరు కలవలేకపోయిన స్నేహితులను కలుసుకుని వారితో సమయాన్ని మనసారా గడపడం ద్వారా మీ మధ్యన బంధాలు బలపడతాయి. ఎంన్ సమయాన్ని చాలా సునాయాసంగా కిల్ చేసే సామాజిక మద్యమానికి కామా పెట్టడం ద్వారా ఈరోజును మీదైన దినంగా మీకు నచ్చినట్టుగా మలచుకోవచ్చు. కాబట్టి జస్ట్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ అండ్ స్విచ్ ఆన్ యువర్ హార్ట్.

                                   ◆నిశ్శబ్ద.