మొంథా తుపాను ఎఫెక్ట్.. ఇంకా తేరుకోని తెలుగు రాష్ట్రాలు
posted on Oct 30, 2025 @ 12:54PM
మొంథా తుపాను తీరం దాటి 24 గంటలు దాటిపోయినా దాని ప్రభావం ఇంకా తెలుగు రాష్ట్రాపై తీవ్రంగానే ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి బారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో అయితే చారిత్రక నగరం వరంగల్ నీట మునిగింది. ఇక ఏపీలోని ప్రకాశం జిల్లా మొంథా తుపాను కారణంగా అతలాకుతలమైంది. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి 1.60 క్యూసెక్కుల నీటికి దిగువకు విడుదల చేస్తున్నారు.
ఒక్కసారిగా ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో పలు గ్రామాలలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. అలాగే ముంపు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. చదలవాడ విద్యుత్ సబ్ స్టేషన్ లోకి భారీగా వరద నీరు చేరడంతో ముందుకు జాగ్రత్త చర్యగా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మరో వైపు జిల్లా రైతాంగాన్ని మొంథా తుపాన్ కోలుకోలేని దెబ్బ తీసింది. తుపాను, భారీ వర్షాల కారణంగా జిల్లాలో 10 వేల 274 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. అలాగే 870. 18 హెక్టార్లలో ఉద్యనవన పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది.
ఇక తెలంగాణలో తుపాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులూ, వంకలూ పొంగి పొర్లుతున్నాయి. మూసీ నది వరద నీటితో పోటెత్తుతోంది. దీంతో నాగార్జున సాగర్ డ్యాం కు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు చేరింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
16 గేట్లను 10 అడుగుల మేర, 4 గేట్లను 5 అడుగుల మేర పైకెత్తి 2 లక్షల 72 వేల 608 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న గ్రామాలకు వరద ముప్పు ఏర్పడింది. అధికారులు ఆయా గ్రామల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వాగులు, కాలువల పరిసరాలలో ఉండవద్దంటూ మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.