రాజేంద్రప్రసాద్ తీరుతో తెలుగుధేశంకు తల బొప్పి
posted on Oct 23, 2012 @ 3:02PM
చంద్రబాబునాయుడు ఆచి తూచి అడుగులు వేస్తూ ఒక్కో వర్గానికి చేరువవుతూ అధికార పక్షానికి, వైసిపికి చెమటలు పట్టిస్తుంటే ఎమ్మేల్సీ రాజేంద్రప్రసాద్ మాత్రం తన నోటి మాటలతో పార్టీకి నష్టం కలిగిస్తున్నారని సహచర నాయకులు విసుగు చెందుతున్నారు. చంద్రబాబునాయుడు బిసిలకు పెద్దపీట వేసి, మాదిగల వర్గీకరణతో మాదిగలను, చేనేత పరిశ్రమలకు రాయతీలను ప్రకటించడం ద్వారా వారిని ఆకట్టుకుంటూ పాదయాత్ర చేస్తుంటే రాజేంద్రప్రసాద్ మాత్రం బిసిలను దూరం చేసే వాఖ్యలను చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. బిసిలంటే వివిధ కుల వత్తులకు చెందిన వారే కాకుండా మాల, మాదిగ క్రైస్తవులతో పాటు, దూదేకులు మరికొన్నివర్గాలకు చెందిన ముస్లింలు కూడా వస్తారు. పదే పదే వైయస్సార్ పార్టీకి గౌరవ అద్యకురాలైన విజయమ్మను బైబిల్ పట్టుకు తిరుగుతున్నారంటూ విమర్శించడం ద్వారా వారినందరినీ పోగొట్టు కోవలసి ఉంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే మాదిగల వర్గీకరణకు తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉండటంతో వారి ఓట్లన్నీ తాము రాబట్టే ప్రయత్నం చేస్తుంటే వారిలో ఉన్న దళిత క్రైస్తవుల ఓట్లకు రాజేంద్ర తూట్లు పొడుస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు బెంబేలెత్తుతున్నారు. ఏ పార్టీ నాయకులైనా ప్రజలను ఓట్లకు అభ్యర్దించే సమయంలో అన్ని మతాలకు చెందిన ఆలయాలను సందర్శించటం మామూలని దీనిలోకి మత గ్రంధాలను తీసుకొచ్చి విషయాన్ని సాగ తీయ కూడదని పార్టీ వర్గాలు కోరుతున్నాయి.