సీసీ కెమెరాల పేరుతో కడప రెడ్డమ్మ వసూళ్లు?
posted on Jan 7, 2026 @ 5:25PM
రెడ్డెప్పగారి మాధవీ రెడ్డి.. కడప ఎమ్మెల్యే గా గెలిచిన రోజు నుంచి జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుఉన్నారు.. పార్టీ ఏదైనా సరే తనపై వచ్చే విమర్శలకు అంతే ధీటుగా స్పందిస్తారు. దశాబ్దా కాలంగా కడప కార్పొరేషన్ మేయర్‌గా ఉన్న సురేష్ బాబు చెక్ పెట్టి పదవి నుంచి దించేశారు. తన వ్యవహార శైలితో సొంత పార్టీ నేతలను దూరం పెట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇదంతా ఓ లెక్కైతే ఇప్పుడు ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, ఆమె భర్త టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి కడపలో సీపీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయం జిల్లాలో దూమారం రేపుతోందట.. 2024 ఎన్నికల ముందు కడప నగరంలో నేరాలు అరికడతామని, గంజాయి స్మగ్లర్లకు చెక్ పెడతామని హామీ ఇచ్చారు కడప రెడ్డెమ్మ. ఇప్పుడు ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు నరగంలో సీసీ కెమెరాలు అవసరమని దాతల సహకారంతో పి4 పద్దతిలో నిధుల సమీకరణకు ఎమ్మెల్యే దంపతులు చేపట్టారంట.
నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం సొంత పార్టీకి చెందిన మైనారిటీ నేత రబ్బానిని రూ.10 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే భర్త శ్రీనివాసులు రెడ్డి కోరారు. ఇవ్వకపోతే పార్టీకి మీతో సంబంధాలు కట్ చేస్తాం మీ కథ చూస్తాం అని హెచ్చరించడం ఇప్పుడు జిల్లాలో దూమారం రేపుతోంది. సొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం అని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు సీసీ కెమెరాల పేరుతో వసూళ్లు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో మైనారిటీ నేత రబ్బాని తండ్రి జిలాని అస్వస్ధతకు గురికావడం చర్చినీయంశంగా మారిందట. జిలానిని శ్రీనివాసులు బెదిరించడం వల్లే అనారోగ్యానికి గురై హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు.
కడప నగరంలో సీసీ కెమెరాల వివాదం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎమ్మెల్యే చిల్లర రాజకీయం చేస్తున్నారని మండిపడితున్నారు మాజీ డిఫ్యూటీ సియం అంజాద్ బాషా. అయితే ఎమ్మెల్యే మాత్రం ఎవరు ఏం అనుకున్నా ఎన్ని ట్రోల్స్ చేసినా తగ్గేదేలే అంటున్నారు. కడప నగరం గంజాయికి అడ్డాగా మారిందని, గంజాయి ఫెడ్లర్లకు చెక్ పెట్టాలంటే ప్రతి గల్లీలో సిసి కెమెరాలు అవసరం అంటున్నారు.
సీసీ కెమెరాల కోసం కోటి రూపాయలకి పైగా నిధులు అవసరం అని అందుకే పి4 మోడల్లో నిధులు సమీకరిస్తున్నామని ఆమె సమర్ధించుకుంటున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు దాతలు ముందుకు రావాలని సీసీ కెమెరాలు అందించే కంపెనీ పేరుతో చెక్ ఇవ్వాలని కోరుతున్నారు . అయితే మీ పార్టీ అధికారంలో ఉంది... ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించి కెమెరాలు ఏర్పాటు చేయాలి కానీ ఇలా బెదిరించి వసూలు చేయడం ఏంటని వైసీపీ విమర్శులు చేస్తుంది.