ప్రధాని మోడీతో లోకేష్ భేటీ.. ముప్పావుగంట సమావేశంలో ఏం జరిగిందంటే?
posted on Sep 5, 2025 @ 3:13PM
ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ తన హస్తిన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో శుక్రవారం (సెప్టెబర్ 5) భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో నారా లోకేష్ రాష్ట్రానికి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, కేంద్ర మద్దతు రాష్ట్ర అభివృద్ధి తదితర అంశాలపైచర్చించారు. ఈ భేటీ సందర్భంగా లోకేష్ ప్రధానికి యోధాంధ్రపై రూపొందించిన టేబుల్ బుక్ ను బహూకరించారు. జీఎస్టీ తగ్గింపుపై ప్రధానికి ధ్యాంక్స్ చెప్పారు. ఈ తగ్గింపు విద్యార్థులకు, పేద కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చుతుందని లోకేష్ పేర్కొన్నారు. ఇక అమరావతి ప్రణాళికలో సింగపూర్ పాత్ర గురించి కూడా లోకేష్ మోడీకి వివరించారు.
గతంలో అంటే మే 17న ప్రధాని మోడీతో నారా లోకేష్ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా లోకేష్ తో పాటు ఆయన సతీమణి బ్రహ్మణి, కుమారుడు దేవాన్ష్ కూడా ఉన్నారు. ఆ భేటీకి ఇప్పుడు తాజాగా జరిగిన భేటీ కొనసాగింపుగా చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు, టెక్నాలజీ, ఇరిగేషన్ రంగాలకు ఇస్తున్న అత్యధిక ప్రాధాన్యతను మోడీకి వివరించి ఆయా ప్రాజెక్టులు సత్వరం గ్రౌండ్ అవ్వడానికి అవసరమైన సహాయ సహకారాలను కేంద్రం అందించాలని ఈ సందర్భంగా లోకేష్ మోడీని కోరినట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఈ 45 నిముషాల భేటీలో లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తులో వెలుగు చూసిన వివరాలను కూడా ప్రధాని మోడీకి వివరించినట్లు తెలుస్తోంది.
సిట్ దర్యాప్తు ఆధారంగా మరి కొందరి పేర్లు చేర్చుతూ మరో చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. ఆ చార్జిషీట్ లో ఈ కుంభకోణం అంతిమ లబ్ధిదారు పేరు ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో లోకేష్ ప్రధానితో భేటీ కావడం, ఆ భేటీలో మద్యం కుంభకోణం దర్యాప్తు పురోగతిని వివరించినట్ల ప్రచారం జరగడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మొత్తం మీద కేంద్రంతో రాష్ట్ర సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో లోకేష్ అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారనడానికి ఈ భేటీని తార్కానంగా చెబుతున్నారు.