రాయలసీమలో వైసీపీకి చెక్.. చంద్రబాబు వ్యూహం ఇదేనా?
posted on Sep 5, 2025 @ 3:37PM
తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాయలసీమపై ప్రత్యేక దృష్టి సారించారు. సీమలో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా.. అక్కడ గట్టి పట్టు ఉన్నట్లుగా చెప్పుకుంటున్న వైసీపీకి గట్టి చెక్ పెట్టే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. 2024 ఎన్నికలకు ముందు వరకూ కూడా సీమ ప్రాంతంలో తెలుగుదేశం పట్టు, ప్రభావం అంతంత మాత్రంగానే అన్నట్లుగా ఉండేది. అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి గాలిలో సీమలో కూడా గణనీయమైన స్థానాలు గెలుచుకుని తెలుగుదేశం సత్తా చాటినప్పటీకీ ఆక్కడ ఇప్పటికీ వైసీపీకి చెప్పుకోదగ్గ బలం ఉందనడంలో సందేహం లేదు. దీంతో సీమలో పార్టీ బలోపేతం కోసం చంద్రబాబునాయుడు ప్రత్యేక ప్రణాళికా వ్యూహరచనతో ముందుకు సాగుతున్నారు. మహానాడును కడప వేదకగా జరపడం నుంచి మొదలుపెడితే.. తాజాగా ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం అయిన సందర్భాన్నిపురస్కరించుకుని నిర్వహించతలపెట్టిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి కూడా చంద్రబాబు రాయలసీమనే వేదిక చేసుకున్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం ఈ నెల 10న అనంతపురం వేదికగా ఘనంగా, అట్టహాసంగా జరగనుంది.
ఇటీవల పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో తిరుగులేని విజయాలను సొంతం చేసుకున్న తెలుగు దేశం.. ఆ జోరును కొనసాగించేందుకు సీమ వేదికగావరుస కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నద్ధమై సన్నాహాలు చేసుకుంటోందనడానికి సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి అనంతపురం ను వేదికగా ఎంచుకోవడాన్ని చెప్పుకోవచ్చు.
అలాగే పారిశ్రామికంగా, కరవును రూపుమాపడానికి నీటి వసతిని కల్పించడం వంటి కార్యక్రమాలతో రాయలసీమ జనాలను ఆకట్టుకుని ఆక్కడ ఓటు బ్యాంకు పెంచుకునే దిశగా తెలుగుదేశం అడుగులు వేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే సీమ ప్రాంతంలో వైసీపీ పునాదులు కదులుతున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకపోడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే సీమ వేదకగా ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగడం ద్వారా వైసీపీకి చెక్ పెట్టాలన్నది చంద్రబాబు వ్యూహంగా పరిశీలకులు చెబుతున్నారు.