కేంద్ర, రాష్ట్ర సంబంధాల పటిష్టతలో లోకేష్ కీలకం!
posted on Sep 5, 2025 @ 10:02AM
మంత్రి నారా లోకేష్ రూటు మార్చారు. రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ కీలకంగా ఎదుగుతున్నారు. ముఖ్యంగా తరచూ కేంద్ర పెద్దలతో భేటీ అవుతూ రాష్ట్రం, కేంద్రం సంబంధాలు మరింత పటిష్ఠంగా మార్చడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రులకు సైతం అంత తేలికగా దొరకని ప్రధాని మోడీ అప్పాయింట్ మెంట్ లోకేష్ కు అడగకుండానే దొరికేస్తుండటం.. కేంద్రం కూడా ఆయనకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. ఇప్పటికే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే చూస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వంలో పైతం ఆయన అత్యంత కాలకంగా ఉన్నారు.
ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ ఏపీకి భారీగా ఐటి దిగ్గజ సంస్థలు వచ్చేలా కృషి చేస్తున్నారు. టిసిఎస్, గూగుల్ వంటి మేటి సంస్థలు ఏపీలో తమ కార్యకలాపాలను ప్రారంభించడం పూర్తిగా ఆయన క్రెడిటేననడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయాన్ని స్వయంగా ఆయా సంస్థల ప్రతినిథులే చెప్పారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన 15 నెలలలోనే ఈ స్థాయిలో లోకేష్ రాష్ట్రానికి ఐటీ సంస్థలను తీసుకురావడంతో జాతీయ స్థాయిలో సైతం లోకేష్ గురించిన చర్చ జరుగుతోంది.
మరోవైపు ఇటీవల సీఎం చంద్రబాబు సింగపూర్ లో పర్యటించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం నారా లోకేష్ కు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాం కు ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఈ స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంకు గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్రమోడీకి ఆహ్వానం అందింది. ఇది లోకేష్ వేగంగా ఎదుగుతుండడాన్ని సూచిస్తోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇక విషయానికి వస్తే.. ప్రధాని నరేంద్రమోడీతో లోకేష్ తాజా భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా మద్యం కుంభకోణంలో వెలుగులోనికి వస్తున్న విస్తుపోయే వాస్తవాలను మోడీకి వివరించి.. ఆ కేసులో అంతిమ లబ్థిదారు అరెస్టునకు లైన్ క్లియర్ చేసుసోవడమే లక్ష్యంగా ఈ సారి లోకేష్ హస్తిన పర్యటనకు వెళ్లారన్న వార్తలు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి.
అన్నిటికీ మించి గతంలో అంటే 2014 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, బీజేపీలో పొత్తులో ఉండే పోటీ చేసి విజయం సాధించాయి. అప్పట్లో పవన్ కల్యాణ్ జనసేన ఈ కూటమికి బయటనుంచి మద్దతు ఇచ్చింది. అయితే నాలుగేళ్లు తిరగకుండానే బీజేపీ, తెలుగుదేశం మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. 2018లో తెలుగుదేశం ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేసింది.
మరో సారి అటువంటి పరిస్థితి రాకుండా లోకేష్ కేంద్రం, రాష్ట్రం సంబంధాలు, అలాగే బీజేపీ, తెలుగుదేశం మైత్రి పటిష్టంగా ఉంచే బాధ్యతలు భుజానికెత్తుకున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఎందుకంటే గతంలో ఎన్డీయే నుంచి తెలుగుదేశం బయటకు వచ్చిన తరువాత.. తెలుగుదేశం, బీజేపీల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శల యుద్ధం జరిగింది. చంద్రబాబు, ప్రధాని మోడీలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి ఐక్యత చెక్కు చెదరకుండా ఉండే బాధ్య తను అటు బీజేపీ పెద్దలూ, ఇటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా లోకేష్ కు అప్పగించారని అంటున్నారు. 2023 సెప్టెంబర్లో అప్పటి జగన్ సర్కార్ అక్రమంగా చంద్రబాబును అరెస్టు చేసి 53 రోజుల పాటు రాజహహేంద్రవరం జైలులో నిర్బంధించిన సమయంలో లోకేష్ ఎంతో పరిణితితో వ్యవహరించిన నేపథ్యంలోనే ఈ గురుతర బాధ్యత ఆయనకు అప్పగించారని చెబుతున్నారు.