చేయాల్సిందంతా చేసి.. ఇప్పుడు బాధ పడి లాభమేంటి ట్రంప్?
posted on Sep 6, 2025 @ 11:34AM
ట్రంప్ కి ఎవరైనా అర్జెంటుగా చదరంగం నేర్పించాల్సి ఉంది. కారణం ఏంటంటే ఆయనకు తాను వేసే స్టెప్ కి అనుకూలంగానే రిజల్ట్ వస్తుందన్న పిచ్చి భ్రమల్లో బతికేస్తున్నారు. ఈ భూ ప్రపంచం మీద ఇలాంటి వ్యక్తి అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కడం బహుశా ఇదే తొలిసారేమో అంటారు ఆ దేశంలోని ఆయన సొంత పార్టీ నేతలే.
మాములుగా అమెరికా దాని స్వరూప స్వభావాలు ఎలాంటివంటే, ఆ దేశం తన ప్రయోజనాల కోసం ఈ ప్రపంచంలో ఉన్న ఖనిజ వనరులే కాదు, మానవ వనరులను కూడా భారీ ఎత్తున వాడుకుని వాటి ద్వారా.. అది అద్భుతమైన ప్రగతి సాధించింది. ఒకప్పుడు రూపాయ కన్నా తక్కువ విలువ గల డాలర్ నేడు.. అంచెలంచెలుగా ఎదిగి రూపాయను నేడు అత్యంత కనిష్ట స్థాయికి పడవేసిందంటే అందుకు కారణం ఈ ఫార్ములానే. ఈ మొత్తం గ్రోత్ లో ఉన్నదంతా వలస శక్తి సామర్ధ్యాలేనంటారు నిపుణులు.
మాములుగా ట్రంప్ ఏమంటారంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని. కానీ అది ఇమ్మిగ్రెంట్స్ తో మాత్రమే సాధ్యమన్నది ఆయనకు తెలియక పోవడం విచారకరంగా చెప్పుకొస్తారు చాలా మంది. తాను కూడా ఒక స్టాటిష్ జర్మన్ మూలాలు గల వ్యక్తిగా ఈ అసలు విషయం గ్రహించలేక పోతున్నారాయన. అమెరికన్లంతా ఎవరంటే ఆయా యురోపియన్ దేశాల నుంచి వలస వచ్చిన వారు. అలాంటి అమెరికన్లు ఫక్తు యూరోపియన్ మైండ్ సెట్ కలిగి ఉంటారు. వీరంతా దాదాపు రాయల్ లైఫ్ లీడ్ చేయాలన్న ఆలోచన ఎక్కువగా కలిగి ఉంటారు.
ఇప్పటి వరకూ అమెరికన్ ప్రెసిడెంట్లు తమ తమ ప్రజలను ఒళ్లు కందకుండా చూసుకోవడంతో పాటు.. అన్నీ వారి కాలి ముందుకు వచ్చేలా చేశారు. అదే ట్రంప్ ఏమనుకుంటారంటే.. వీరి ఒళ్లు ఒంచి పని చేసేలా చేసి.. ఆపై అమెరికాను అగ్రస్థానంలో నిలబెట్టాలనుకుంటున్నారు. ఇది ఎప్పటికీ సాధ్యం కాని పని. ఇన్నాళ్ల పాటు ఆయా దేశాల నుంచి నాణ్యమైన సేవలను అందుకుని సుఖ పడ్డ సగటు అమెరికన్ ప్రజలు ఇప్పటికిప్పుడు కష్టపడి పని చేయాలంటే ఎలా సాధ్యం?? ఈ విషయంలో పూర్తిగా బోల్తా కొట్టారు ట్రంప్.
మీరు కావాలంటే చూడండి.. ప్రపంచంలోనే అతి పెద్ద దేశాల్లో ఒకటైన అమెరికాలో ఎప్పుడు ఖనిజ వనరుల కోసం తవ్వకాలు జరగవు. అక్కడెన్ని నిధి నిక్షేపాలు, చమురు నిల్వలున్నా సరే వాటిని విపరీతంగా తవ్వి పోయాలని చూడరు. కారణమేంటంటే.. వారి భౌగోళిక స్వరూప స్వభావం పూర్తిగా చెడిపోతుందని. అంతగా పర్యావరణ ప్రేమ కనబరుస్తారు. అదే గల్ఫ్ తదితర దేశాల నుంచి పెట్రో నిల్వలను.. ఉక్రెయిన్, చైనాల నుంచి ఖనిజ నిల్వలను తీసుకుంటారు. ఇక చైనా నుంచి ప్రతి ప్రోడక్ట్ దిగుమతి చేసుకుంటారు. ఇండియన్స్ నుంచి మేథో పరమైన సేవలు, మెక్సికన్ల నుంచి గొడ్డుచాకిరీ.. ఇలా ప్రతిదీ ఇంపోర్ట్ చేసుకోవల్సిందే. వాళ్లు కేవలం పైపై మెరుగుల కార్లు వగైరా మాత్రమే ప్రొడ్యూస్ చేస్తూ తమ డాలర్ ని తెలివిగా పెంచి పెద్దది చేసి.. ఇతర దేశాలను అంతకంతకూ పిండేసుకుంటూ ఆపై సంపన్న దేశంగా అంతకంతకూ ఎదుగుతుంటారు.
అమెరికా దేని మీద ఆధార పడి బతుకుతూ ఉంటుందంటే అప్పుల మీద. క్రెడిట్ లేనిదే అక్కడ ఏ డెబిట్ కార్డూ పని చేయదు. విచ్చల విడిగా అప్పు చేయడం, ఆపై ప్రభుత్వం ద్వారా రుణ మాఫీ చేయించుకోవడం ఇదే సగటు అమెరికన్లు చేసే అసలు సిసలైన పని.
ఈ క్రమాన్ని పూర్తిగా మరచి.. భారత్ వంటి దేశాలను దూరం చేసుకుని ట్రంప్ సాధించేది ఏటంటే మేక్ అమెరికా డౌన్ అగైన్ తప్ప మరోటి కాదంటారు సామాజిక విశ్లేషకులు. దానికి తోడు అమెరికన్ల పని చేసే వారి వయసు వ్యత్యాసం కూడా చాలానే ఉంది. ఇన్నాళ్ల పాటు ఏ కాయ కష్టం చేయని ఆ శరీరాలు అత్యంత సుఖంగా, కావల్సినంత ఎక్కువ కాలం జీవించేలాంటి వెసలుబాటు కలిగి ఉన్నాయి. ఈ క్రమంలో అమెరికన్ల ఆయు ప్రమాణం నానాటికీ పెరిగుతూ వస్తోంది. సరిగ్గా అదే సమయంలో.. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడం వల్ల.. జననాల సంఖ్య అంతకంతకూ తగ్గుతూ వస్తోంది.
ఇప్పుడెలాంటి పరిస్తితి దాపురిస్తోందంటే.. అక్కడ సహజీవనాలను దాటి పోయి గే, లెస్బియన్ కల్చర్ పెరగటం మొదలైంది. దీంతో మానవ వనరులు క్రమేపీ అడుగంటి పోతున్నాయ్. 1960 తర్వాత యూఎస్ లో వలస రేటు భారీగా తగ్గింది. స్టూడెంట్స్. ట్రక్ డ్రైవర్లతో సహా.. చివరికి టూరిస్టులను కూడా అలౌ చేయడం లేదు. కేవలం భారతీయ స్టూడెంట్స్ వల్ల 25 బిలియన్ డాలర్ల మేర ఏటా లబ్ధి చేకూరుతోంది. అంతెందుకూ పక్కనే ఉన్న కెనడా నుంచి వచ్చే ఒక్కో టూరిస్టూ మినిమంలో మినిమం 4 వేల డాలర్ల మేర ఖర్చు చేస్తారు. చివరికి కెనడా మీద కూడా 51వ రాష్ట్రంగా మాలో కలిసిపోండంటూ అవాకులు చవాకులు పేలి ట్రంప్ ఎంత చేటు తెచ్చాడంటే, అమెరికాకు, కెనడా వారు విహారంగా రావడం కూడా మానేసేంతగా. దీంతో టూరిజం, హోటల్ ఇండస్ట్రీలో ఏకంగా రెండున్నర లక్షల మేర ఉద్యోగాలు పోయాయని చెబుతున్నాయి సరిహద్దు పర్యాటక గణాంకాలు.
అంతెందుకూ ఇదే విషయం మీద ట్రంప్ పై పెద్ద ఎత్తున కేసులు కూడా నమోదయ్యాయి. మీ టారీఫుల కారణంగా దేశానికి విపరీతమైన ఆర్ధిక నష్టం కలుగుతోందని అప్పీళ్ల కోర్టు తీర్పునిచ్చింది. కానీ తాను సుప్రీం కోర్టుకెళ్లి పంతం నెగ్గించుకుంటానని మంకు పట్టు పడుతున్నారు ట్రంప్.
ఇలా చెప్పుకూంటూ పోతే ట్రంప్ అమెరికా అభివృద్ధి పాలిట పిడుగులా పడుతున్నారు. ప్రస్తుతం అమెరికా ఆర్ధిక పటిష్టత వచ్చే రోజుల్లో ఏమంత సజావుగా సాగేలా కనిపించడం లేదని అంటారు ఆర్ధిక రంగ నిపుణులు. కావాలని యుద్ధాలను పుట్టించి, వాటిని తానే ఆపానని చెప్పుకుంటూ.. నోబుల్ శాంతి బహుమతి కోసం వెంపర్లాడుతున్న ట్రంప్ కారణంగా.. అమెరికా గ్రేట్ అగైన్ పరిస్థితేమోగానీ ఫేట్ మాత్రం దారుణంగా మారేలా తెలుస్తోందని వాపోతున్నారు సగటు అమెరికన్లు.
ఒకటీ రెండు కాదు అన్నింటా ఆయన తీసుకుంటున్న స్వార్ధపూరిత తప్పుడు నిర్ణయాల కారణంగా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది. పాక్ తో కుటుంబ సంస్థ ద్వారా వ్యాపారాలను చేయించాలన్న ఆలోచనతో ఆ దేశ ఆర్మీచీఫ్ ని దగ్గరకు చేర్చుకోవడంతో భారత్ మనసు కూడా విరిగిపోయింది. ఇప్పుడు చూస్తే భారత్ దూరమై పోయిందని బాధ పడుతున్నారు.
ప్రస్తుతం అమెరికా అనేది అనేక దేశాల సహాయ సహకారాల సమాహారం. అంతెందుకు ఆయుధాలు, స్పేస్ విషయంలోనూ రష్యాతో పోటీ అనేది ఒక స్ఫూర్తిగా పని చేసి నేడు ఆయా విభాగాల్లో ఈ స్థాయిలో ఉంది అమెరికా. ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్ కంట్రీస్ స్పాన్సర్డ్ కంట్రీగా పేరున్న యూఎస్.. ప్రస్తుతం తానేదో ప్రపంచ అగ్ర రాజ్యం అని మిడిసిపడుతోంది కానీ, గ్లేసియర్స్ కరిగాక కొండ మాత్రమే మిగిలితే ఎలా ఉంటుందో వచ్చే రోజుల్లో యూఎస్ తెలుసుకోవడం ఖాయంగా అంచనా వేస్తన్నారు అంతర్జాతీయ దౌత్య వ్యవహారాల నిపుణులు.