కర్మ ఎవరినీ వదిలి పెట్టదు కేసీఆర్!
posted on Sep 4, 2025 @ 10:40AM
గోరు చుట్టు మీద రోకటి పోటు ఎలా ఉంటుందో చవి చూస్తున్నారు గులాబీ దళాధిపతి కేసీఆర్. ఇప్పటికే ఉన్న కాళేశ్వరం, టెలిఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేస్ వంటి కేసులతోనే పడలేక పోతుంటే.. మధ్య బిడ్డ పోరు ఒకటి. గతంలో కేసీఆర్ ఇదే అధికార కాంగ్రెస్ ను ఎంత అట్టుడికించారంటే.. పార్టీయే ఇక నామరూపాల్లేకుండా పోయేంత. కేవలం ఐదుగురంటే ఐదుగురు సభ్యులు ఎలాంటి ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా సరే.. ఇక్కడే ఉండి మైకు ఇచ్చినా ఇవ్వకున్నా. తమ ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చారు.
కట్ చేస్తే టీడీపీ. రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలంగాణలో దాని ఉనికినే లేకుండా చేశారు కేసీఆర్. పాలు తాగి రొమ్ము గుద్దడం, తిన్నింటి వాసాల్లెక్క పెట్టడం వంటి సామెతలు గుర్తు తెచ్చారు. ఆ సూర్య చంద్రార్కం ఉండాల్సిన తల్లిలాంటి పార్టీనే పత్తాలేకుండా చేయాలని చూశారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అంతగా తనను తల్లిలా ఆదరించిన పార్టీ పట్ల జనాల్లో ఒక వ్యతిరేకత నూరి పోసి ఆపై.. ఇక్కడ ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్ధకం చేశారు. అదే టీడీపీ ఉండి ఉంటే రేవంత్ లాంటి వారు కాంగ్రెస్ పంచన చేరక పోయి ఉందురేమో. ఎందుకంటే ఒక నాటికి కాకున్నా మరొక నాటికి పార్టీ పునరుజ్జీవమై ఎందరికో ఆయన అన్నట్టు అవకాశాలు ఇచ్చేది. ఇపుడా అవస్త వ్యవస్థ ఎలా ఉందో చవి చూస్తున్నారు కేసీఆర్.
బేసిగ్గా కేసీఆర్ వ్యూహం ఏంటంటే తాను తెచ్చిన తెలంగాణ తన కొడుకు- బిడ్డ- అల్లుడు వీళ్లే ఏలుకోవాలి తప్ప మరొకరికి అవకాశమే లేదన్న కోణంలో ఆయన చీమ ఆశ ఇది. చీమ ఆశ అని ఎందుకు అనాల్సి వస్తోందంటే.. చీమ తాను కుట్టగానే చనిపోవాలని ఆ దేవుడ్ని కోరుకుందట.. తథాస్తూ అన్నాడట ఆ దేవుడు కూడా.. అంతే అది మనల్ని కుట్టగానే కొట్టి చంపేస్తుంటాం. ఇదీ అంతే.. కేసీఆర్ తన కుచ్చిత స్వభావం కొద్దీ పన్నిన పన్నాగమే ఇదంతా. ఇప్పుడా బాధ అనుభవిస్తున్నారాయన. అసలు తెలంగాణ తెచ్చిన వారు మీరెలా అవుతారని ప్రశ్నిస్తారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. కాంగ్రెస్ ఇవ్వకుంటే సోనియాగాంధీ దయతలచకుంటే ఇది సాధ్యమేనా? అన్న మాట కూడా నిజమే కదా? అంటారు జనం కూడా. ఇక రేవంత్ ని ఆయన కూతురు పెళ్లి ఉందనగా కూడా ఎంత మాత్రం పట్టించుకోకుండా అరెస్టు చేసి నానా హంగామా చేశారు. ఇప్పుడు చూడండి.. కాళేశ్వరం విషయంలో.. తమను అరెస్టు చేయరాదంటూ స్టే తెచ్చు కోడానికి హైకోర్టు చుట్టూ తిరుగుతున్నారు కేసీఆర్, హరీష్. ఇదంతా ఆనాడు మీరు చేసిన పాపం పండటం వల్లే కదా? అన్న మాట వినిపిస్తోంది.
ఆ మాటకొస్తే కేసీఆర్ తనకంటూ ప్రత్యేకించి పేరు అక్కర్లేదనీ.. తెలంగాణ తెచ్చిన అనే ఆకాశమంత పేరుందని అంటారు. మరి ఈ అప్రదిష్టంతా ఏంటి? మీరు కట్టించిన ఒక ప్రాజెక్టు ఇటు కుంగిపోవడమే కాకుండా అటు ఈ ప్రాజెక్టులో ఈఎన్సీలు, ఈఈలుగా పని చేసిన వారు ఏకంగా వెయ్యి కోట్ల పైగా అవినీతికి పాల్పడ్డం.. బిడ్డే అవినీతి జరిగిందని బజారు కెక్కడం.. మీ ఆకాశమంతటి పేరుకు చిల్లుబడ్డట్టు కాదా? అని ప్రశ్నిస్తున్నారు సగటు బీఆర్ఎస్ కార్యకర్తలు. అందుకే అధికారం ఉంది కదాని మిడిసి పడితే.. అది పోయాక అవస్థ పడాల్సి వస్తుందనడానికి కేసీఆర్ కన్నా మించిన నిదర్శనం లేదని అంటున్నారు ప్రతి ఒక్కరూ.