నిధులున్నా రంగారెడ్డి జిల్లాను పీడిస్తున్న అనారోగ్యం?
posted on Oct 30, 2012 8:12AM
అన్ని జిల్లాల్లోనూ ఆరోగ్య అవసరాలు తీర్చుకునేందుకు నిధుల కొరత వెంటాడుతోంది. అటువంటిది నిధులున్నా రంగారెడ్డి జిల్లాను అనారోగ్యం పీడిస్తోంది. అధికారుల అశ్రద్ధ, నిర్లక్ష్యం పరాకాష్టకు చేరటం వల్ల ఈ నిధులను వినియోగించుకోవటమే మానేశారు. రాష్ట్రరాజధానితో కలుపుకుని ఉన్న ఈ జిల్లాలోనే ఇటువంటి పరిస్థితి ఉంటే ఎలా అని సామాజిక ఆరోగ్య పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఈ జిల్లాలోని అన్ని పీహెచ్‌సిలకు రూ.70.50లక్షలను రెండు సార్లు విడుదల చేశారు. అయితే ఈ నిధుల్లో సగం కూడా వినియోగించలేదని పరిశీలనలో తేలింది. జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో అపారిశుధ్యం తాండవిస్తోంది. అంటురోగాలు ప్రబలుతాయన్న ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నిధులు గురించి అధికారులను ప్రశ్నిస్తే మౌనం వహిస్తున్నారు. జననీ శిశు సంరక్షణ కింద గతేడాది రూ.1.90లక్షలు విడుదల చేస్తే దాన్ని అస్సలు ఖర్చు పెట్టలేదు. దీంతో ఆ నిధుల విడుదల ఆగిపోయింది. మొత్తంగా గతేడాది ఈ నిధుల్లో రూ.4,440 ఖర్చు చేశారు. గతేడాది ఆశావర్కర్లకు యూనిఫారాలకు రూ.తొమ్మిది లక్షలు విడుదల చేశారు. ఆ నిధులు పక్కదారి పట్టడంతో ఈ ఏడాది ఆ నిధులు కూడా విడుదల కాలేదు. అలానే సబ్‌సెంటర్ అన్‌టైడ్‌ఫండ్స్, ఫ్యామిలీప్లానింగ్, హాస్పటల్ డెవలప్‌మెంట్, ఆన్యువల్ డెవలప్‌మెంట్ నిధులను సక్రమంగా వినియోగించకపోవటంతో వాటిని కూడా ఆపేశారని సమాచారం. కుటుంబనియంత్రణకు గతేడాది రూ.27.06లక్షలు విడుదలయ్యాయి. దీన్ని వినియోగించలేదు. అందువల్ల ఈ ఏడాది నిధులు తగ్గించేశారు. జననీసురక్ష పథకం నిధులు విడుదలైనా అదీ వినియోగించలేదని తెలుస్తోంది.