శ్రీకృష్ణుడి జీవితం నుండి ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకుని ఆచరిస్తే విజేతలు అవుతారు..

ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని కృష్ణ పక్షం ఎనిమిదవ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు.  కృష్ణుడు కేవలం పురాణాల్లోని ఒక పాత్ర, దశావతారాలలోని ఒక దైవం మాత్రమే కాదు. అయన  ఒక తత్వవేత్త, ఎడతెగని కర్మయోగి, తెలివైన వ్యక్తి ,  భవిష్యత్తు గురించి తెలిసినవాడు. కృష్ణుడి గురించి తెలిసిన వారు ఆయనను మార్గదర్శి అని కూడా అంటారు. ఆయన ఆలోచనలు  బోధనలు ఒకకాలానికి సంబంధించినవి కాదు.  ఇవొక నిరంతర ప్రవాహిని లాంటివి. యుగాలు మారినా ఆ వాక్యాలలో శక్తి, అందులో ఉన్న నిజం ఏమాత్రం మారలేదు.  జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా ఎదగాలంటే శ్రీకృష్ణుడి జీవితం నుండి ఈ కింది విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. వాటి గురించి ఆలోచించాలి. వాటిని జీవితంలో ఆచరించాలి. అప్పుడే మనిషి జీవితంలో విజేత అవుతాడు.

ప్రతికూల పరిస్థితులలో కూడా పట్టు వదలకూడదు. కృష్ణుడు భగవంతుని స్వరూపం అయినా ఆయన తన జీవితంలో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఎన్నో గండాలనుండి ప్రాణాలు కాపాడుకున్నాడు. రేపల్లెనుండి కంసుడి వరకు ఎన్నో చోట్ల నిందలు, ప్రమాదాలు మోశాడు. కానీ వాటిని అధిగమించాడు. అలాంటి పట్టుదల అందరికీ ఉండాలి.

మహాభారతాన్ని తరచి చూస్తే కృష్ణుడు  ఎప్పుడూ శాంతి కోసం పరితపించాడు. కానీ కౌరవ పౌండవుల యుద్దం అనివార్యం అయింది.  కృష్ణుడు అర్జునుడితో ఒకసారి చెబుతాడు. శాంతి కోసం ప్రయత్నించాలి, ఎన్నో ప్రయత్నాలు చేయాలి. ఏనీ సఫలం కాకపోతే చివరి అవకాశంగా మాత్రమే యుద్దాన్ని ఎంచుకోవాలని. ఇదే అందరి జీవితాలకు వర్తిస్తుంది. సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప గొడవలు పడటం, శత్రువులుగా మారడం వల్ల ఎప్పుడూ ఎవరూ ప్రశాంతతను పొందలేరు.

గీతోపదేశం తెలుసుకున్న ప్రతి మనిషి తమ జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు రావడం చూస్తారు. మనిషి ఐదుక్రియలు, జ్ఞానేంద్రియాలతో సహా మనస్సు ను కూడా జయించాలంటే సాత్వికాహారాన్ని తినాలని చెబుతాడు.  ఇది మనిషికి ధీర్ఘాయువును ఇస్తుంది. ఆరోగ్యం చేకూరుస్తుంది. శరీరం మనసు రెండు స్వచ్చంగా ఉంటాయి. కాబ్టటి సాత్వికాహారం అందరూ తీసుకోవాలి.

కృష్ణుడు పాండవులకు మద్దతు ఇచ్చినా కౌరవులకు వ్యతిరేకి మాత్రం కాదు. కృష్ణుడు-జాంబవతులకు పుట్టిన కుమారుడు   సాంబుడు, కౌరవ రాజు అయిన దుర్యోధనుడి కూతురు లక్ష్మణ ను వివాహం చేసుకున్నాడు. దీన్నిబట్టి చూస్తే బంధువుల మధ్య విభేదాలు ఉండవచ్చేమో కానీ బంధాలను మాత్రం తెంచుకోకూడదు.

శ్రీకృష్ణుడికి 16వేలా 100 మంది భార్యలు అని అందరూ బుగ్గలు నొక్కుకుంటారు. వీరందరిని నరకాసురుని బారి నుండి రక్షించాడు, వారికి ముక్తి కలిగించడం కోసం భార్యలనే అర్హతను ఇచ్చాడు తప్ప వారందరితో కృష్ణుడు ఎప్పుడూ శారీరక సంబంధం పెట్టుకోలేదు. పైపెచ్చు కృష్ణుడి భార్యలు అనే గౌరవాన్ని వారికి అందేలా చేశాడు. త్రేతాయుగంలో రావణుడిని అంతం అయినా, ద్వాపర యుగంలో కౌరవుల అంతం అయనా ఆడదాన్ని అవమానించినందువల్ల జరిగిన అనర్థాలే అవన్నీ. కాబట్టి ఆడవారిని గౌరవించాలి. వారిని అవమానిస్తే తిరిగి అనుభవించే సమయం వస్తుంది.

                                                *నిశ్శబ్ద.

Teluguone gnews banner

వ్యాపారంలో ఎదగడానికి సూపర్ టిప్స్ ఇవి..!

  మనిషి జీవితంలో ఆదాయం రావడానికి ఏదో ఒక ఉపాధి తప్పనిసరిగా ఉండాలి.  కొందరు ఒకరి కింద పనిచేస్తారు. మరికొందరు తమకు తామే ఉపాధి సృష్టించుకుంటారు.  ఇలా తమకు తాము ఉపాధి సృష్టించుకునేవారు వ్యాపారస్తులు అవుతారు. వ్యాపారం బాగా ఎదిగితే వీరే కొందరికి తమ కింద ఉపాధి కల్పిస్తారు.  అయితే వ్యాపారం మొదలుపెట్టిన ప్రతి ఒక్కరు సక్సెస్ కాలేరు. దీనికి కారణం  వ్యాపారానికి సంబంధించి కొన్ని విషయాలు తెలియకపోవడమే.. చేతిలో డబ్బు ఉంటే చాలు వ్యాపారం చేసేయవచ్చు అని కొందరు అనుకుంటారు. కానీ వ్యాపారం చేయాలన్నా, అందులో విజయం సాధించాలన్నా జ్ఞానం చాలా అవసరం. వ్యాపారంలో విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందేమిటో తెలుసుకుంటే.. కష్టపడి పనిచేయడం.. వ్యాపారంలో విజయం సాధించాలంటే కష్టపడి పనిచేయడం ఎప్పుడూ అవసరం.  సోమరితనంతో,  నిర్లక్ష్యంగా పనిచేస్తే ఎప్పటికీ విజయం సాధించలేరు.  తగినంత సమయం ఉన్నప్పుడు లక్ష్యాలను చేరుకోవడానికి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే అది విజయానికి బదులుగా అపజయాన్ని మిగులుస్తుంది. సానుకూల ఆలోచన.. పాజిటివ్  ఆలోచన,  ఆత్మవిశ్వాసం విజయానికి కీలకం. తమ మీద తాము నమ్మకం పెట్టుకోవడం ద్వారా తాము చేసే పనులలో  సానుకూల ఫలితాలను పొందగలుగుతారు. ప్రతికూల ఆలోచనలు  మనసులోకి ఎప్పుడూ రానివ్వకూడదు. ఇది  ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. సత్సంబంధాలు..  స్వంత వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు ప్రజలతో మంచి సంబంధాలను కొనసాగించాలి. ఇది  వ్యాపారానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎల్లప్పుడూ  కస్టమర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి.  కస్టమర్ల సాటిసిఫ్యాక్షన్ ను దృష్టిలో ఉంచుకోవాలి. దానికి తగినట్టు ప్రణాళికలు మారుస్తూ ఉండాలి. రిస్క్.. కొత్త వ్యాపార అవకాశాలను త్వరగా గుర్తించి, వాటిలో పెట్టుబడి పెట్టడానికి భయపడకూడదు.. అయితే, ఏదైనా రిస్క్ తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. రిస్క్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అన్ని అంశాలను పరిగణిలోకి తీసుకోవాలి. నిజాయితీ.. వ్యాపారస్తులకు ఉండాల్సిన  ఒక ముఖ్యమైన లక్షణం నిజాయితీ.  నిజాయితీగా వ్యవహరించడం వల్ల  ఖ్యాతి,  వ్యాపారం మెరుగుపడుతుంది.  దీని ద్వారా  గొప్ప లక్ష్యాలను సాధించవచ్చు. కస్టమర్‌లు,  ఉద్యోగుల మధ్య నమ్మకమైన వాతావరణాన్ని నిర్మించాలి. ఇది  వ్యాపారాన్ని పెంచుతుంది. దృఢ సంకల్పం.. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు, ప్రతి ఒక్కరూ ఎప్పుడు విజయం సాధిస్తామో అని ఆలోచిస్తారు. విజయం రాత్రికి రాత్రే రాదు. ఓపికగా ఉండి ప్రయత్నిస్తూ ఉండాలి.  వ్యాపారం అంటే  విజయం మాత్రమే కాదు.. అందులో విజయం ఉంటుంది,  వైఫల్యం కూడా ఉంటుంది. కాబట్టి  వైఫల్యాలు ఎదురైతే వాటి  నుండి నేర్చుకుని ముందుకు సాగండి. విజయం సాధిస్తే మళ్లీ కొత్త మార్గాలను జాగ్రత్తగా అన్వేషిస్తూ సాగాలి. లీడర్షిప్ స్కిల్స్.. వ్యాపారం చేయడానికి న్యాయకత్వ నైపుణ్యాలు ఉండాలి.  వాటిని మెరుగుపరుచుకోవాలి.  ఎందుకంటే తన కింద వారిని నడిపించడానికి అవి సహాయపడతాయి.  సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. పై విషయాలను అన్వయించుకోవడం ద్వారా  వ్యాపారంలో విజయం సాధించవచ్చు. వ్యాపారాన్ని  కొత్త శిఖరాలకు తీసుకెళ్లవచ్చు.  జీవితంలో కీర్తిని, ప్రతిష్టను కూడా సాధించవచ్చు.                                        *రూపశ్రీ.

పెళ్లైన కొన్నాళ్లకే భార్యాభర్తల మధ్య ప్రేమ ఎందుకు తగ్గుతుంది?  ప్రేమ పెరగాలంటే ఏం చేయాలి?

వివాహం అన్ని సంబంధాల కంటే విభిన్నమైన కోణం. వివాహం ప్రారంభ రోజుల్లో భార్యాభర్తల  మధ్య ప్రేమ, ఉత్సాహం,  ఆకర్షణ చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ క్రమంగా భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది.  చాలామంది వివాహం అయిన కొద్ది కాలానికే మనుషులు మారిపోయారు అని అంటూ ఉంటారు. అయితే ఇది చాలా వరకు భార్యాభర్తల మధ్య జరిగేదే. కానీ ఇద్దరి మధ్య ప్రేమ తగ్గకుండా తిరిగి ప్రేమను పెంచుకోవడం భార్యాభర్తల ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది. పెళ్లైన కొన్ని సంవత్సరాల తర్వాత భార్యాభర్తల బంధం కొందరికి  బోరింగ్‌గా మారుతుంది.ఒకరిపై ఒకరు ప్రేమను చూపించడం,  బంధంలో ఉత్సాహం వంటివి అస్సలు కనిపించవు.  దీనికి బదులు వారి బంధంలో విసుగు చెందడం,  గొడవ పడటం చాలా సహజం అయిపోతుంది. కానీ వివాహం అయిన కొన్ని రోజులకే   భార్యాభర్తల మధ్య ప్రేమ ముగిసిపోవడం అనేది ఉండదు.  పెళ్లైన కొత్త రోజుల్లో ఉండే ప్రేమ ఎన్నైళ్లైనా భార్యాభర్తల మధ్య అలాగే ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.  అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గడానికి కారణమయ్యేవి ఏంటో కూడా తెలుసుకోవాలి. బాధ్యతలు, ఒత్తిడి వివాహం తర్వాత, ఉద్యోగం, ఇంటిని చూసుకోవడం, కుటుంబ అంచనాలు,  పిల్లలను పెంచడం వంటి బాధ్యతలు భార్యాభర్తలపై భారంగా మారతాయి.  ఒకరికొకరు సమయం ఇచ్చుకోవడం కష్టం అవుతుంది. క్రమంగా ప్రేమ కాస్తా బాధ్యతల్లోకి జారిపోతుంది. ఒకే దినచర్య.. ఒకే  దినచర్య సంబంధంలో విసుగును కూడా తెస్తుంది. ప్రతిరోజూ ఆఫీసు, ఇల్లు,  ఇతర పనుల మధ్య,  ప్రేమ ఎక్కడో వెనుకబడిపోతుంది. కొత్త శక్తి,  ఉత్సాహం లేకపోవడం సంబంధాన్ని మందకొడిగా చేస్తుంది. కమ్యూనికేషన్.. భార్యాభర్తల  మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం కూడా ప్రేమ తగ్గిపోవడానికి  ఒక పెద్ద కారణం. భార్యాభర్తలు తమ భావాలను, అంచనాలను,  సమస్యలను ఒకరితో ఒకరు పంచుకోనప్పుడు దూరం పెరుగుతుంది.  ఈ దూరం క్రమంగా సంబంధాన్ని బలహీనపరుస్తుంది. ప్రేమ పెరగాలంటే.. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య  మునుపటిలా  ప్రేమను తిరిగి పుంజుకోవడానికి కొన్ని పద్ధతులను అనుసరించవచ్చు.  ఉదాహరణకు కొన్ని.. ఒకరికొకరు సమయం ఇవ్వడం... రోజంతా బిజీగా ఉన్నప్పటికీ కనీసం అరగంటైనా  ఇద్దరూ సంతోషంగా ఉండటానికి  మాత్రమే కేటాయించాలి. డేటింగ్ నైట్ ప్లాన్ చేసుకోవడం...   డేటింగ్ కి వెళ్లడం వల్ల పెళ్లైన సంవత్సరాల తర్వాత కూడా సంబంధానికి కొత్త జీవం పోస్తుంది. ఆశ్చర్యకరమైన బహుమతులు ఇవ్వడం.. చిన్న బహుమతులు కూడా పెద్ద ప్రేమ బయటకు వ్యక్తం  చేస్తాయి. సంభాషణకు ప్రాముఖ్యత ఇవ్వడం.. ప్రతిరోజూ కొంత సమయం ఒకరితో ఒకరు ఓపెన్ మాట్లాడుకోండి. శారీరక సాన్నిహిత్యంపై.. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం,  దగ్గరగా కూర్చోవడం కూడా ప్రేమను తిరిగి రేకెత్తించడానికి ఒక మార్గం కావచ్చు. నిజానికి వివాహం అయిన తరువాత పిల్లలు పుట్టగానే శారీరకంగా బంధం బలహీనమవుతుంది.  అందుకే చాలా వరకు ప్రేమ తగ్గినట్టు అనిపిస్తుంది.  సురక్షిత మార్గంలో భార్యాభర్తలు శారీరక బంధాన్ని సాగిస్తే వారి మధ్య ప్రేమ ఎప్పుడూ తాజాగా ఉంటుంది.                                  *రూపశ్రీ.

ఆఫీసు పనిలో ఒత్తిడి ఎదుర్కొంటున్నారా? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..!

ప్రతి వ్యక్తికి నేటికాలంలో ఇల్లు, ఆఫీసు అంటూ రెండు ప్రదేశాలు ముఖ్యంగా మారాయి.  ఒకటి కుటుంబ సభ్యులతో కలసి ఉండేది అయితే రెండవది కుటుంబ సభ్యులను పోషించడానికి మరొక ప్రదేశంలో విభిన్న వ్యక్తులతో కలిసి పనిచేసే స్థలం. చాలామంది ఆఫీసులో ఒత్తిడి ఎదుర్కుంటున్నామని చెబుతూ ఉంటారు. ఆఫీసులో గనుక పని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటే అది మానసిక ఆరోగ్యాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే కొన్ని చిన్న చిన్న మార్పులు, చిట్కాలతో ఒత్తిడి నుండి బయట పడవచ్చు. ఇవి నేరుగా ఆఫీసుకు వెళ్లి పని చేసే వారికి అయినా,  లేక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి అయినా చాలా చక్కగా పని చేస్తాయి.  అవేంటో తెలుసుకుంటే.. పనుల జాబితా.. ఈ చిట్కా ఖచ్చితంగా  సహాయపడుతుంది. ఉదయాన్నే డైరీలో రోజు పనులను రాసుకోవాలి. పైన తేలికైన పనులను,  దిగువన ఎక్కువ సమయం,  శ్రద్ధ అవసరమయ్యే పనులను లిస్ట్  చేయాలి. ఇది  మనస్సు గందరగోళం లేకుండా క్లారిటీగా  ఉంచడానికి సహాయపడుతుంది.  రోజులో ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి.. వాటిని ఎప్పుడు చేయాలో అనుకుంటూ  అతిగా ఆలోచించడాన్ని తగ్గిస్తుంది. బ్రేక్ ముఖ్యం..  ఎంత పని ఉన్నా సరే.. గంటల తరబడి కూర్చుని పని చేయడం తప్పు. ప్రతి 25-30 నిమిషాల పని తర్వాత 5 నిమిషాల విరామం తీసుకోవాలి. నీరు త్రాగడం,  కళ్ళు మూసుకోవడం  లేదా కొద్దిగా శరీరాన్ని రిలాక్స్ చేసుకోవడం.. ఇవన్నీ  మనసు అలసిపోకుండా  విశ్రాంతిని ఇస్తాయి.   ఒత్తిడిని తగ్గిస్తాయి. నో చెప్పడం నేర్చుకోండి.. ఇది అతి ముఖ్యమైన చిట్కా ఏమిటంటే.. ప్రతి పనినీ, మీటింగ్‌నీ లేదా పనిని.. ఇట్లా ఏదైనా సరే.. ఆఫీసులో  అదనపు బాధ్యతను ఎప్పుడూ తీసుకోకూడదు. చాలా మంది కాస్త మంచిగా మాట్లాడుతూ,  కాస్త పొగుడుతూ ఏదైనా పని చేసిపెట్టమని అడుగుతూ ఉంటారు.  అలాంటి సందర్భాలలో  మర్యాదగా తిరస్కరించాలి.  ఇది  మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎందుకంటే అదనపు పని భారం ఒత్తిడికి దారి తీస్తుంది.  ప్రతి ఒక్కరూ నో చెప్పడం నేర్చుకోవాలి. ఇది ఎంతో సహాయపడుతుంది. శారీరక శ్రమ..  పనిలో బిజీగా ఉన్నప్పటికీ, ప్రతిరోజూ 15-30 నిమిషాలు నడవడం, యోగా చేయడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది సహజ ఒత్తిడిని తగ్గించే మార్గం.  ఒత్తిడి హార్మోన్లు వ్యాయామం వల్ల తగ్గుతాయి. వ్యాయమం మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇది  ఫిట్‌గా ఉంచుతుంది. డెస్క్ దగ్గరే కూర్చుని చేయగల యోగా భంగిమలు కొన్ని ఉంటాయి.  అలాంటివి చేసినా బాగుంటుంది.                          *రూపశ్రీ.

చాణక్యుడు చెప్పిన మాట.. ధనవంతులు కావాలంటే ఈ ప్రదేశాలకు దూరంగా ఉండాలట..!

ఆచార్య చాణక్యుడు తనదైన రాజనీతితో చరిత్రలో చెరగని ముద్ర వేశాడు.  ఈయన కేవలం రాజనీతి మాత్రమే కాకుండా తత్త్వ బోధన,  ఆర్థిక సూత్రాలు కూడా బోధించారు. చాణక్యుడి  ప్రణాళికల కారణంగానే మగధ రాజు చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. చాణక్యుడు చెప్పిన ఎన్నో విషయాలు నేటికీ ఆచరించదగినవిగా ఉన్నాయి. ముఖ్యంగా చాణక్యుడు చెప్పిన ఆర్థిక సూత్రాలు పాటిస్తే వ్యక్తి జీవితంలో ఎంతో గొప్ప స్థాయికి వెళ్లవచ్చు.  ఆచార్య చాణక్యుడు చెప్పిన ఆర్థిక సూత్రాలలో ధనవంతులు కావాలంటే కొన్ని ప్రదేశాలకు దూరంగా ఉండాలి అనేది కూడా చాలా ముఖ్యం.  ఇంతకీ ధనవంతులు కావాలని కోరుకునేవారు ఏ ప్రదేశాలకు దూరంగా ఉండాలో.. చాణక్యుడు చెప్పినవి ఏంటో తెలుసుకుంటే.. ఏ ప్రదేశాలకు దూరంగా ఉంటే ధనవంతులు అవుతారు.. చాణక్యుడి ప్రకారం  వ్యాపార కార్యకలాపాలు దగ్గరలో  లేని ప్రదేశంలో నివసించడం మంచిది కాదు. వ్యాపారం లేని ప్రదేశంలో నివసించే ప్రజలు తమ జీవితాలను పెద్దగా అబివృద్ది లేకుండా  గడుపుతారు. అదేవిధంగా, ఒక ప్రదేశంలో వేదాల పరిజ్ఞానం ఉన్న పండితులు లేదా బ్రాహ్మణులు లేకపోతే, అక్కడ నివసించడం ప్రయోజనకరం కాదు. బ్రాహ్మణులు సమాజం  మతపరమైన,  సాంస్కృతిక విలువలను కాపాడతారని చాణక్యుడు చెబుతాడు. వారు లేనప్పుడు ఆ ప్రదేశం పురోగతికి అనుకూలంగా ఉండదట. నీరు లేకుండా జీవితాన్ని ఊహించలేము. అందువల్ల నదులు, చెరువులు లేదా ఇతర నీటి వనరులు అందుబాటులో లేని ప్రదేశాలలో నివసించడం మంచిది కాదు. నీరు లేనప్పుడు జీవితం కష్టమవుతుంది.   అభివృద్ధి కూడా ఆటంకం కలిగిస్తుంది. ముఖ్యంగా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో నివసించడం వల్ల నీటి సేకరణకే సమయం గడిచిపోతుంటుంది. దీని వల్ల కొన్ని ఆదాయ అవకాశాలకు సమయం వృధా అవుతుంది.  వైద్య సదుపాయాల అవసరం ఈ కాలంలో చాలా చాలా ముఖ్యం. ఈ విషయాన్ని చంద్రగుప్త కాలానికే చాణక్యుడు చాలా గట్టిగా చెప్పాడు. ఏదైనా వ్యాధి, ప్రమాదం లేదా ఆరోగ్య సమస్య ఎదురైతే దాని  పరిష్కారానికి వైద్య సేవలు అవసరం. వైద్యుడు లేదా వైద్య సదుపాయాలు   లేని ప్రదేశంలో నివసించడం మంచిది కాదు. చాణక్యుడు చెప్పినట్టు పైన చెప్పిన వనరులు లేని ప్రదేశాలలో నివసించడం వల్ల ఆర్థికంగా అస్సలు ఎదుగుదల ఉండదు. ఎంత ప్రయత్నించినా సరే.. ఆర్థికంగా బలపడటానికి తగిన అవకాశాలు, సమయాన్ని పొదుపు చేసే మార్గాలు,  ఆరోగ్యాన్ని రక్షించుకునే పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల ఆర్థికంగా ఎప్పటికప్పుడు దిగజారిపోతూ ఉంటారు.  కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుంటే ధనవంతులుగా ఎదిగే మార్గం దొరికినట్టే.                            *రూపశ్రీ.

వివాహం తర్వాత మగవాళ్లు ఈ పనులు చేస్తే వైవాహిక జీవితం నాశనమే..!

కాలేజీలకు వెళ్లి చదువుకోవడం, మంచి ర్యాంకులు తెచ్చుకోవడం,  ఉద్యోగాలు సాధించడం,  ఇల్లు, కారు,  బ్యాంక్ బాలెన్స్ సమృద్దిగా ఉండటం.. ఇవన్నీ చదువులో రాణించడం వల్ల మంచి ఉద్యోగం వల్ల సాధించుకోవచ్చు ఏమో.. కానీ వివాహం చేసుకోవడం, వైవాహిక బంధాన్ని పదిలంగా ఉంచుకోవడం అలాంటిది కాదు. వైవాహిక బంధానికి చదువు,  లెక్కలు,  లాజిక్ ల కంటే.. అవగాహన,  అర్థం చేసుకునే తత్వం, సర్థుబాటు చేసుకునే గుణం ఇవన్నీ చాలా ముఖ్యం. నేటికాలానికి తగ్గట్టు భార్యాభర్తలు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు రావు అన్నది వాస్తమే.. కానీ వివాహం తర్వాత భార్య అయినా,  భర్త అయినా కొన్ని తప్పులు చేస్తారు. ముఖ్యంగా వివాహం తర్వాత మగవాళ్లు చేసే కొన్ని తప్పుుల వల్ల  వైవాహిక బంధాలు నాశనం అవుతాయి.  అవేంటో తెలుసుకుంటే.. వివాహం తర్వాత మరొక స్త్రీ పట్ల ఆకర్షితులవడం నైతికంగానే కాకుండా సామాజిక దృక్కోణం నుండి కూడా తప్పు. ఇది వైవాహిక జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టడమే కాకుండా, అవతలి వ్యక్తి మనోభావాలను కూడా దెబ్బతీస్తుంది. ఇటువంటి ప్రవర్తన వల్ల మొత్తం కుటుంబం చాలా డిస్టర్బ్ అవుతుంది.  జీవితంలో సంతృప్తిని కూడా చాలా ముఖ్యం.   ఎప్పుడూ ఎక్కువ పొందాలనే కోరిక కలిగి ఉండటం,  ప్రస్తుతం ఉన్న వాటితో అసంతృప్తి చెందడం మగవాడిని  అశాంతి,  అసంతృప్తికి గురి చేస్తుంది.  ఇది  వైవాహిక జీవితానికి మంచిది కాదు. మగవాడు తీసుకునే నిర్ణయం అతని కుటుంబ భవిష్యత్తు పై ఆధారపడి ఉంటుంది. ఒక  నిర్ణయం తీసుకునే ముందు దాని  అన్ని అంశాలను తీవ్రంగా పరిగణించడం చాలా ముఖ్యం. తొందరపడి తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో ఇబ్బందులను కలిగిస్తుంది.                                     *రూపశ్రీ.

ఇలా చేస్తే.. మీ భాగస్వామి ఎప్పటికీ మిమ్మల్ని వదలిపెట్టరు..!

ఈ సృష్టిలో ప్రతి వ్యక్తి ఎవరికి వారు ప్రత్యేకమైనవారు.   అందుకే ఏ ఇద్దరు వ్యక్తులు పూర్తిగా ఒకేలా ఉండలేరు అని అన్నారు. ఈ తేడాలు మొదట్లో బంధాల మధ్య  ఆకర్షణను సృష్టిస్తాయి.  కానీ తరువాత ఈ తేడాలు పగ లేదా సంఘర్షణకు కూడా కారణం కావచ్చు. కానీ సంబంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి బదులుగా, ఈ తేడాలను తెలివిగా ఉపయోగించడం  వలన బంధం  మరింత బలపడుతుంది. ఏదైనా ఒక గొడవ జరగగానే అది చిన్న గొడవే అయినా సరే.. వీళ్లతో కలిసి ఉండలేం.. విడిపోదాం అనే ఆలోచన చాలా మందికి పెళ్ళైన  తర్వాత అప్పుడప్పుడూ అయినా వస్తూ ఉంటుంది.  అలా కాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాలో అవ్వాలి.  తేడాలు? కొంతమంది తమ జీవితాలను క్రమబద్ధంగా,  ప్రణాళికాబద్ధంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు, మరికొందరికి మార్పు,  స్వేచ్ఛ అవసరం. కొందరు స్వభావరీత్యా ప్రశాంతంగా ఉంటారు, మరికొందరు గందరగోళంలో కూడా ఓదార్పు కావాలి అనుకుంటారు. విభిన్న స్వభావాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు, వారికి తేడాలు ఉండటం సహజం. అయితే ఇది చెడ్డ విషయం కాదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి,  నేర్చుకోవడానికి ఒక అవకాశం అనుకోవాలి. అప్పుడు ఈ తేడాల వల్ల గొడవలకు బదులు అర్థం చేసుకునే గుణం అలవాటు అవుతుంది తేడాలను ఎలా నిర్వహించాలి? వ్యక్తుల మధ్య తేడాలు ఉన్నప్పుడు అది సంబంధంలో కూడా కనిపిస్తూ ఉంటుంది.  ఇలా  తేడాలు తలెత్తినప్పుడు వెంటనే ఏదో ఒకటి  స్పందించడం కంటే తగిన విధంగా రియాక్ట్ కావడం ముఖ్యం. మార్పు కాదు..  సమన్వయం కావాలి..  భాగస్వామిని మార్చడానికి ప్రయత్నించే బదులు వారితో సమన్వయం చేసుకోవడం నేర్చుకోవాలి. ఇద్దరూ  సరిగ్గా ఒకేలా ఉండనవసరం లేదు, కానీ ఒకరి కోసం ఒకరు ప్రయత్నం చేయడం ముఖ్యం. తిరస్కారం కాదు..అంగీకారం ముఖ్యం..  భాగస్వామిని వారు ఉన్న విధంగానే అంగీకరించండి. ఒకరి అంతర్గత స్వభావాన్ని మార్చమని బలవంతం చేయడం మంచిది కాదు.  భాగస్వామిని వారి లోపాలతో అంగీకరించినప్పుడే నిజమైన ప్రేమ ఉన్నట్టు అర్థం. తేడాలు ఉంటే వాటిని ఇబ్బందిగా కాదు.. వాటిని ఇద్దరూ మానసికంగా డవలప్ అవ్వడానికి  అవకాశంగా  చూడాలి. వాటిని పోరాడటానికి కారణాలుగా కాకుండా, ఒకరి నుండి ఒకరు నేర్చుకుని ఇద్దరి  పరిధులను విస్తరించుకునే అవకాశాలుగా పరిగణించాలి. సంభాషణాత్మకంగా,  కరుణతో ఉండాలి.. గొడవ జరిగినప్పుడు  ఇరిద్దరూ భిన్నంగా ఉన్నారని తెలియజేసే సమాచారంగా దాన్ని చూడాలి. ఒకరినొకరు అగౌరవపరచకుండా మీ దృక్పథాన్ని వ్యక్తపరచాలి.   భాగస్వామిని మీలాగే ఉండమని బలవంతం చేయకుండా ప్రేమ,  కరుణతో వారికి సపోర్ట్ ఉండాలి. అతను నాలాగా లేడు, ఆమె నాలాగా లేదు.. అతని పద్దతి నాకు నచ్చట్లేదు.. ఆమె అలవాట్లు బాలేవు.. ఇలా అనుకోవడం మానేయాలి.  మనం మనకు ఎలా నచ్చుతామో.. వారికి కూడా వారంటే ఇ,్టం,  వారి అలవాట్ల పట్ల ఒక కారణం ఉంటుంది. దాన్ని చూపించి వ్యతిరేకించకూడదు. ఇద్దరూ ఒకరినొకరు అంగీకరించాలి. అంగీకరించడం అంటే వ్యక్తి అలవాట్లు,  ప్రవర్తన, పద్దతి తో సహా.. అన్నీ అంగీకరించడం. ఇలా చేస్తే గొడవ జరిగినప్పుడు ఇది తన పద్దతి అనే విషయం అర్థమై దాన్ని విడిపోదాం అనే ఆలోచన వరకు తీసుకెళ్లరు.                                 *రూపశ్రీ.

ఇంజనీర్స్ డే.. భారతదేశపు మోడర్న్ విజార్డ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య..!

  ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న భారతదేశంలో ఇంజినీర్స్ డే ని ఎంతో గౌరవంగా జరుపుకుంటారు. ఈ రోజు భారతదేశంలోని మహానీయ ఇంజనీరు, రాష్ట్రనిర్మాణ శిల్పి, గొప్ప దూరదృష్టి కలిగిన శాస్త్రవేత్త భారతరత్న గ్రహీత మొక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి.  ఈయన జయంతి  సందర్భంగా ఇంజనీర్స్ డే నిర్వహించబడుతుంది. ఆయన గౌరవ సూచకంగా 1968,  సెప్టెంబర్ 15 నుండి  ఇంజినీర్స్ డే జరుపుకోవడం ప్రారంభమైంది. మొక్షగుండం విశ్వేశ్వరయ్య గారి విశిష్టత.. విశ్వేశ్వరయ్య గారు 1861 సెప్టెంబర్ 15న కర్ణాటకలోని ముడ్డెనహళ్ళి గ్రామంలో జన్మించారు. ఇంజనీరింగ్ రంగంలో ఆయన చేసిన వినూత్న కృషి కారణంగా “భారతదేశపు మోడర్న్ విజార్డ్”  అని  ఆయన్ను పిలుస్తారు. మొక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కేవలం ఒక గొప్ప ఇంజనీరు మాత్రమే కాదు ఒక విజనరీ ప్లానర్, సామాజిక సంస్కర్త కూడా. ఆయన చేసిన కృషి భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు, అంతర్జాతీయ స్థాయిలోనూ ఆయన ప్రతిభ ప్రతిఫలించింది. నీటిపారుదల , ఆనకట్టల నిర్మాణంలో కృషి.. కృష్ణరాజసాగర డ్యామ్ (KRS Dam).. మైసూరులోని కృష్ణరాజ సాగర ఆనకట్ట ఆయన రూపకల్పన. ఆ కాలంలో కాంక్రీటుతో ఇంత పెద్ద ఆనకట్ట నిర్మించడం ఒక అద్భుతం. ఈ ఆనకట్ట వల్ల మైసూరు, మాండ్యా, బెంగళూరు ప్రాంతాలు వ్యవసాయంలో విప్లవాత్మక మార్పు చూశాయి. ఫ్లడ్ గేట్ల సాంకేతికత.. ఆయన అభివృద్ధి చేసిన “ఆటోమేటిక్ స్లూయిస్ గేట్లు”  ఆ కాలంలో ఒక విప్లవాత్మక ఆవిష్కారం. ఈ సాంకేతికతను గ్వాలియర్‌లోని టి గ్రా డ్యామ్, కృష్ణరాజ సాగర డ్యామ్‌లలో ఉపయోగించారు. నీటి పారుదల పథకాలు..  ముంబైలో 1900లో వచ్చిన ఘోర వరదల తర్వాత ఆయన రూపొందించిన డ్రైనేజి సిస్టమ్ కారణంగా భవిష్యత్‌లో ఆ నగరం వరదల బారిన పడకుండా కాపాడబడింది. పరిశ్రమ,  ఆర్థిక రంగంలో కృషి.. మైసూరు పరిశ్రమల అభివృద్ధి మైసూరు రాష్ట్ర దివాన్‌గా ఉన్నప్పుడు, ఆయన భద్రావతి ఐరన్ & స్టీల్ వర్క్స్ (ప్రస్తుతం విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్)ను ప్రారంభించారు. మైసూరు సాండల్‌వుడ్ ఆయిల్ ఫ్యాక్టరీ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. మైసూరు విశ్వవిద్యాలయం  స్థాపనలోనూ ఆయనదే ప్రధాన పాత్ర. ఆర్థిక సంస్కరణలు పరిశ్రమలు, విద్య, వ్యవసాయం, సాంకేతిక రంగాల సమన్వయం ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన నమ్మకం. “Planned Development” అనే కాన్సెప్ట్‌ను భారతదేశంలో ముందుగా పరిచయం చేసిన వారిలో విశ్వేశ్వరయ్య గారు ముఖ్యులు. ఇంజనీరింగ్,  అభివృద్ధి.. ఆయన రాసిన “Planned Economy for India” (1934) పుస్తకం భారత ఆర్థిక ప్రణాళికల రూపకల్పనకు ప్రేరణనిచ్చింది. మరో పుస్తకం **“Reconstructing India”**లో శాస్త్రసాంకేతిక అభివృద్ధి ద్వారానే దేశాన్ని బలపరచవచ్చని ఆయన వివరించారు. ఆయనకు దక్కిన గౌరవాలు.. ఆయన ప్రతిభను గుర్తించి ప్రపంచంలోని అనేక దేశాలు సలహాదారుగా ఆహ్వానించాయి. 1955లో భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న పురస్కారం ప్రదానం చేసింది. ఇంజనీరింగ్ రంగంలో చేసిన విశేష సేవల కారణంగా ఆయనను “Father of Modern Mysore State” అని పిలుస్తారు. ఇంజినీరింగ్ రంగ ప్రాధాన్యం ఇంజనీర్లు ఆధునిక సమాజానికి వెన్నెముకలుగా నిలుస్తారు. రహదారులు, వంతెనలు, భవనాలు, ఆనకట్టలు – అన్నీ ఇంజనీర్ల సృజనే.. సాంకేతిక విజ్ఞానంలో భాగమైన  కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, అంతరిక్ష సాంకేతికత..  ఇవన్నీ ఇంజనీర్ల ప్రతిభా ఫలితమే. పరిశ్రమలలో భాగమైన.. విద్యుత్, రవాణా, సమాచార సాంకేతిక రంగం, వైద్య రంగంలోనూ ఇంజనీర్ల పాత్ర అపారమైనది. సమస్యలకు పరిష్కారం చూపుతూ, కొత్త ఆలోచనలతో మానవజాతి అభివృద్ధికి దోహదపడటం ఇంజనీర్ల ముఖ్య కర్తవ్యంగా చెప్పవచ్చు.                                    *రూపశ్రీ.

పిల్లల జీవితాన్ని బలి చేసే పీకాక్ పేరేంటింగ్.. చాలా మంది తల్లిదండ్రులు చేసే తప్పు ఇది..!

ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు బాగా రాణించాలని కోరుకుంటారు. మంచి మార్కులు సాధించాలి, మంచి ఉద్యోగం సాధించాలి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందాలి. ఇందుకోసం బాగా డబ్బు కూడా ఖర్చు పెడతారు. పిల్లలను పెద్ద పెద్ద కార్పోరేట్ పాఠశాలలు, కళాశాలలో చేర్పిస్తారు. ప్రత్యేకంగా ట్యూషన్లు చెప్పిస్తారు, కోచింగ్ లు ఇప్పిస్తారు. ఇవన్నీ పిల్లల ఉన్నతికి మంచివే.. కానీ చాలా సార్లు తల్లిదండ్రుల మితిమీరిన అంచనాలు పిల్లలపై ఒత్తిడిగా మారుతాయి. ఇది పిల్లల మానసిక,  భావోద్వేగ పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. తరువాత ఇది ఒక సమస్యగా మారుతుంది. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే చాలా సార్లు తల్లిదండ్రులు తమ పిల్లలపై ఈ విధంగా అధిక ఒత్తిడి తెస్తున్నామని కూడా వారికి తెలియదు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను  ఇతరుల ముందు పదే పదే.. సందర్భం కాకపోయినా  పొగుడుతూ ఉండటం చూసి ఉంటారు.  తమ పిల్లలు  గెలిచిన ట్రోఫీలు,  పతకాల గురించి చెబుతుంటారు.  పిల్లలకు వచ్చిన ర్యాంకులు, మార్కుల గురించి గొప్పగా చెబుతారు.  మొదట్లో ఇది మంచిగా అనిపిస్తుంది.  తమ తల్లిదండ్రులు తమ గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారో అని పిల్లలు కూడా చాలా సంతోషిస్తారు.  కానీ క్రమంగా అది పిల్లలపై ఒత్తిడిని పెంచుతుంది.  తమ చిన్న తప్పు కూడా  తమ తల్లిదండ్రుల ఆశల మీద ప్రబావం చూపిస్తుందని అనుకుంటారు. ఈ రోజుల్లో   పీకాక్ పేరెంటింగ్ అని చాలా ట్రెండ్ లో ఉంది. ఇది పిల్లల మానసిక,  భావోద్వేగ పెరుగుదలకు హాని కలిగించే పద్ధతి. దాని గురించి తెలుసుకుంటే.. పీకాక్ పేరెంటింగ్ అంటే ఏమిటి? పీకాక్  పేరెంటింగ్ అంటే పిల్లలను తల్లిదండ్రులు తమ  గర్వానికి,  సమాజంలో పేరు సంపాదించడానికి ఒక మార్గంగా మార్చడం. నెమలి తన రంగురంగుల ఈకలను విప్పి అందరి దృష్టిని ఆకర్షించినట్లే, కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతరుల ముందు తాము  గర్వంగా ఉండటం  కోసం విజయాల  వెంట పరుగులు తీయిస్తారు. మొదట్లో ఇది  బానే ఉంటుంది కానీ క్రమంగా ఈ అలవాటు పిల్లలపై ఒత్తిడి పెంచుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లల విజయాల గురించి అందరి ముందు చెప్పుకోవడం గొప్పగా అనిపించవచ్చు. కానీ పోటీ ప్రపంచంలో ఎల్లప్పుడూ ఒకరే విజేతగా ఉండరు. ఎప్పుడైనా పిల్లలకు నిరాశ కలిగించే ఫలితాలు ఎదురైనప్పుడు తల్లిదండ్రుల ప్రవర్తన మారిపోతుంది. ఇది పిల్లలను కూడా చాలా ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. పీకాక్ పేరెంటింగ్ పిల్లల ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తుంది? పీకాక్ పేరెంటింగ్ ప్రభావం ఏమిటంటే, పిల్లలు చప్పట్లు కొట్టినప్పుడు లేదా ప్రశంసించినప్పుడు మాత్రమే తాము మంచివాళ్ళమని, గొప్పవాళ్లమని  అనుకుంటారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా పిల్లలు లోపల నుండి బలహీనంగా మారతారు.  తమను ప్రశంసించనప్పుడు తాము విఫలమయ్యామని  భావిస్తారు.  దీని కారణంగా పిల్లలు తమ తల్లిదండ్రులు లేదా వ్యక్తులు ఇష్టపడేది చేస్తారు తప్ప  తమకు నచ్చినది చేయరు. పీకాక్ పేరెంటింగ్ కారణంగా ఎల్లప్పుడూ గెలవాలి  చేయాలనే భయం వారి మనస్సులో ఉంటుంది. ఎప్పుడైతే భయం మనసులో ఉంటుందో అప్పుడు గెలవడం కూడా కష్టమవుతుంది. దీనిని నివారించడానికి పిల్లల మంచిని,  చెడును   ప్రేమించడం ముఖ్యం. అలాగే వారు గెలిచినా, ఓడినా వారిని ప్రోత్సహించడం ముఖ్యం.  తల్లిదండ్రుల గొప్పకు పిల్లలను ఒక మార్గంగా ఎంచుకోవడం మానేయాలి.  పిల్లలు ఎలా ఉన్నా తల్లిదండ్రులు ఎప్పుడూ వారిని ప్రేమిస్తారని, వారి వెంట ఉంటారనే విషయం వారికి  అర్థమవ్వాలని. ఇలా ఉన్నప్పుడు పిల్లలు మంచి దారిలోనే వెళ్తారు.                *రూపశ్రీ.

భర్త ఇలా ప్రవర్తిస్తుంటే.. భార్య మీద ప్రేమ లేదని అర్థం..!

భార్యాభర్తల బంధం ఈ సృష్టిలో చాలా అపురూపమైనది.  దాదాపు పాతికేళ్లు వేర్వేరు కుటుంబాలలో పెరిగిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి పేరుతో ఒక్కటిగా మారతారు.  ఇద్దరి జీవితం ఒక్కటే అనే అభిప్రాయం తెచ్చుకుంటారు. ఇద్దరూ ఒకరికి  ఒకరు అనేలా బ్రతుకుతారు.  కష్టం అయినా, సంతోషం అయినా, బాధ అయినా కలిసి పంచుకుంటారు.  అయితే భార్యాభర్తల బంధం అందరి విషయంలో ఇలా ఉంటుందని చెప్పలేం.  కొందరి విషయంలో చాలా విభిన్నంగా ఉంటుంది.  భార్యాభర్తలు ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు.  కొన్ని బంధాలలో భర్తకు భార్య మీద ప్రేమ  ఉండదు.  కానీ భార్య మాత్రం కేవలం బంధం కోసం, పిల్లల కోసం భర్తతో కలిసి ఉంటుంది. మరికొందరు భార్యలు అమాయకంగా తన భర్త ఏం చేసినా.. ఇలా చేస్తున్నాడు అని అంటారు కానీ  నిజానికి అతనికి తన మీద ప్రేమ లేదు అనే విషయం తెలుసుకోలేరు.  భర్తకు భార్య మీద ప్రేమ లేకపోతే.. అతని ప్రవర్తన ఎలా ఉంటుందో.. కొన్ని సింపుల్ విషయాల ద్వారా చెప్పేయవచ్చు.  అవేంటో తెలుసుకుంటే.. అబద్దం చెప్పడం.. అబద్దం చెప్పడం కొందరికి వెన్నతో పెట్టిన విద్య.  సందర్భానుసారంగా చాలా ఈజీగా అబద్దాలు చెప్పేస్తుంటారు. ఇలా అబద్దాలు చెప్పే మనస్తత్వం ఉన్నవారిలో మోసం చేసే ప్రవృత్తి ఉంటుంది. భార్య దగ్గర ప్రతి విషయం గురించి చాలా బాగా అబద్దాలు అల్లేస్తారు.  బయటి స్నేహాలు,  డబ్బు,  ఎక్కడి వెళుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు.. ఇలా ప్రతి విషయం ఎప్పుడూ స్పష్టంగా నిజం చెప్పరు. దీనికి బదులు అబద్దాలు చెబుతారు. మరికొన్ని సార్లు సాకులు చెబుతారు.   పైగా అతను చెప్పేది అబద్దం అని తెలిసి తిరిగి అతన్ని ప్రశ్నించినప్పుడు కావాలని గొడవ పెట్టుకుని భార్యనే నిందిస్తాడు.  చివరకు భార్యే బాధితురాలిగా మారుతుంది. అవసరాలు పట్టించుకోకపోవడం.. భార్య అవసరాలను పూర్తీగా పట్టించుకోని భర్తలో నిజమైన ప్రేమ అస్సలు లేదని అర్థం.  భార్య ఏమడిగినా ఏదో ఒక కారణం చెప్పడం, తప్పించుకోవడం, ఆమె అవసరాలు తీర్చకపోవడం,  ఎప్పుడైనా గట్టిగా అడిగినప్పుడు భార్యనే తిరిగి నిందించడం, బార్య నోరు మూయించడానికి గొడవ పెద్ది చేయడం, భార్య పుట్టింటి వాళ్లను ప్రస్తావిస్తూ గొడవ చేయడం.. ఇలా చాలా చేస్తారు.  అతను తన అవసరాలు తీర్చుకోవడానికి, తన తల్లిదండ్రులు,  తోబుట్టువుల కోసం ఏం చేయడానికైనా సిద్దంగా ఉంటాడు. కానీ  భార్య దగ్గరకు వచ్చేసరికి అతనికి ఏం చేయడానికి ఇష్టం ఉండదు. ఆ ఇష్టం లేకపోవడానికి బయటకు చెప్పలేక ఏవో కారణాలు చెబుతూ ఉంటాడు. ఎగతాళి చేయడం.. భార్య మీద ప్రేమ ఉన్న ఏ మగాడు అయినా సరే.. స్నేహితుల ముందు కావచ్చు, బయటి వ్యక్తుల ముందు కావచ్చు, కుటుంబ సభ్యుల ముందు కావచ్చు.. భార్యను చాలా గౌరవిస్తాడు. కానీ దీనికి వ్యతిరేకంగా భార్య మీద ప్రేమ లేకపోతే.. సింపుల్ గా.. అందరి ముందు అవమానించడం, చిన్నతనం చేసి మాట్లాడటం,  అస్సలు గౌరవించకపోవడం చేస్తారు.  ఇలా ఏ భార్య పట్ల అయినా భర్త ప్రవర్తిస్తే అతనేదో కోపంలో చేశాడు.. అనే పిచ్చి సమర్థింపు ఏ భార్య చేయకూడదు.  అది అతను ప్రేమ లేకపోవడం వల్ల చేసిన పనే అని గుర్తించాలి.                                   *రూపశ్రీ.

కష్టపడి సంపాదించిన డబ్బును ఇలాంటి వ్యక్తుల చేతుల్లో పెడితే నాశనమే..!

డబ్బు నేటికాలంలో చాలా అవసరం. డబ్బు లేకపోతే ఏ పని జరగదు.  ఆఖరికి నీళ్లు కూడా డబ్బు పెట్టి కొనుక్కుంటున్నాం.  డబ్బు సంపాదన కోసం చాలా కష్టపడతాం.  రాత్రి, పగలు కష్టపడి మరీ డబ్బు సంపాదిస్తుంటారు.  చాలా వరకు డబ్బు సంపాదనలో ప్రస్తుత అవసరాల గురించే కాకుండా భవిష్యత్తు అవసరాలకు,  భవిష్యత్తు పరిస్థితులకు కూడా భాగం ఉంటుంది.  అయితే డబ్బు సంపాదించడమే కాదు.. డబ్బును జాగ్రత్త చేసుకోవడం కూడా చాలా ముఖ్యమైన అంశం.  కష్టపడి సంపాదించిన డబ్బును ఎలాగంటే అలా.. ఎవరి చేతిలో అంటే వారి చేతిలో పెట్టకూడదు. దీని వల్ల కష్టపడి సంపాదించిన డబ్బు అంతా నాశనం అవుతుంది.  కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది.  ఇంతకీ డబ్బును ఎలాంటి వ్యక్తుల చేతుల్లో పెట్టకూడదు? తెలుసుకుంటే.. మోసం చేసే స్నేహితులు.. కొంతమందికి మోసం చేయడం అనే అలవాటు ఉంటుంది. వాళ్ళు ఎంత బాగున్నా.. వారికి ఏ ఇబ్బందులు లేకపోయినా సరే.. అప్పు పేరుతో లేక బదులు పేరుతో లేక వడ్డీ ఆశ చూపి డబ్బు తీసుకుని ఆ తర్వాత డబ్బు ఎగ్గొట్టేవారు ఉంటారు. ఇలాంటి అనుభవాలు ఒకటి రెండు సార్లు జరిగినా సరే.. వడ్డీ వస్తుందనే ఆశతోనో లేక ఎదుటి వ్యక్తులు మాట్లేడే మాట చాకచక్యంతోనో వారిని పదే పదే నమ్మేస్తూ ఉంటారు.  అలాంటి వారి చేతిలో డబ్బు పెడితే ఆ డబ్బు, మన కష్టం రెండూ నాశనం అవుతాయి. దురాశతో ఉండే పెట్టుబడిదారులు.. కొంతమంది ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాలను చూపించి  డబ్బును తీసుకుంటారు. వడ్డీ ఎక్కువ వస్తుందనో.. ఏవైనా ఆఫర్ లు ఉంటాయనో.. తక్కువ కాలంలో ఎక్కువ మొత్తం తిరిగి ఇస్తారనో చెప్పి ప్రజల నుండి డబ్బు తీసుకుంచారు.  పెద్ద పెద్ద క్లెయిమ్స్ చేయడం ద్వారా డబ్బు పెట్టుబడి పెట్టమని అడుగుతుంటారు. పైగా తాము చాలా పేరొందిన వారమని,  తమకు గొప్ప వ్యక్తులు తెలుసునని చెప్పుకుంటారు. ఇలాంటివారు పెద్ద మొత్తంలో తమ చేతికి డబ్బు అందిన వెంటనే మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడతారు. కేవలం తమ గురించి మాత్రమే మాట్లాడేవారు.. కేవలం తమ గురించి మాత్రమే మాట్లాడేవారు స్వార్థపరులని అర్థం. ఇలాంటివారు ఎప్పుడూ తమ గురించి చూసుకుంటారు. తమ పని జరిగడం కోసం ఎన్ని మాటలైనా చెప్తారు. తాము తప్ప సమస్యలు ఎవ్వరూ ఫేస్ చేయడం లేదనే ఫీలింగ్ లో ఉంటారు.  తమ బాధను ఎంతో క్రిటికల్ గా చెబుతారు.  వీరి మాటలలో ఎమోషన్ ను చూసి చాలామంది పాపం అనే ఫీలింగ్ తో డబ్బు ఇచ్చేస్తుంటారు.  కానీ ఇలాంటివారు తమ అవసరం తీరిపోగానే తర్వాత ఏమీ మాట్లాడరు.  కనీసం అందుబాటులోకి కూడా రారు.  అందుకే ఇలా తమ గురించి మాత్రమే చెబుతూ.. ఎదుటివారి పరిస్థితి అర్థం చేసుకోకుండా డబ్బు గురించి అడిగే వారి చేతిలో ఎప్పుడూ డబ్బు పెట్టకూడదు. కష్టపడని వారు.. కొందరు కష్టపడరు..కానీ అవసరానికి డబ్బు అడుగుతూ ఉంటారు. తమకు ఎలాంటి ఉద్యోగం రాకపోవడానికి కారణం చుట్టూ ఉన్న సమాజం, తన కుటుంబం అంటూ కారణాలు చెబుతూ ఉంటారు. ఇలాంటివారు కేవలం  సులువుగా డబ్బు చేతికి వస్తే సుఖపడిపోదాం అనే ఆలోచనతో ఉంటారు. వీరికి డబ్బు విలువ, కష్టం విలువ అస్సలు తెలియదు. ఇలాంటివారు ఇతరులకు డబ్బు ఇవ్వకుండా మోసం చేసినా.. అదేం పెద్ద విషయం కాదని అనుకుంటారు. కాబట్టి ఇలాంటి కష్టం విలువ తెలియకుండా జులాయిగా ఉంటూ,  సోమరితనంతో ఉండేవారి చేతిలో డబ్బు పెట్టకూడదు.                         *రూపశ్రీ.