అవినీతికి అతీతంకామంటున్న ఆడవాళ్ళు
posted on Mar 2, 2012 @ 11:44AM
రాష్ట్ర మహిళా సంఘాల్లో రూ.600 కోట్లు గోల్ మాల్
తెలుగువన్.కామ్ స్పెషల్ స్టోరీ
హైదరాబాద్: అన్నిట్లోనూ సగం వాటా కావాలంటున్న ఆడవాళ్ళు అవినీతికి కార్యకలాపాల్లో కూడా భాగస్వాములవుతున్నారు. ఐఎఎస్ అధికారిని శ్రీలక్ష్మి అవినీతి కార్యకలాపాలు పాల్పడి జైలు జీవితం గడుపుతున్నారు. ఆవిడ పాల్పడిన అవినీతి విలువ ఎంతో తెలియదు కాని రాష్ట్రంలోని మహిళా సంఘాలు (గ్రామైఖ్య సంఘాలు) గత ఐదేళ్ళనుంచి సుమారు రూ.600కోట్ల మేరకు నిధులను గోల్ మాల్ చేసినట్లు తేలింది. గత 7,8 ఏళ్ళుగా ఇందిరమ్మ లబ్దిదారులకు బిల్లులను రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఇలా వందలాది కోట్లరూపాయలు పంపిణీచేశారు. కానీ వీటిలో కొంత మొత్తం లబ్దిదారులకు చేరలేదు. వీటి వివరాలు చెప్పమంటే ఐదేళ్ళుగా ఏ మహిళాసంఘం వాటి సమాచారం ఇచ్చిన పాపాన పోలేదు. ఐదేళ్ళనుంచి ఇలా లెక్కలు చెప్పని నిధులు సుమారు రూ.600 కోట్ల వరకు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తమకు నిధులు రావడం లేదని పలుచోట్ల లబ్దిదారులు ఆందోళనలకు దిగడంతో గృహ నిర్మాణశాఖ రంగంలోకి దిగింది. ఈ నిధులను గృహ నిర్మాణశాఖ మహిళా సంఘాల ద్వారా లబ్ధిదారులకు అందజేయాలి. అయితే లబ్దిదారులకు జరిపిన చెల్లింపుల్లో అక్రమాలు జరగడంతో గృహ నిర్మాణ సంస్థ గ్రామైఖ్య మహిళా సంఘాలకు నిధులివ్వడం మానేసింది. నేరుగా బ్యాంకు ఖాతాలద్వారా వారికి చెల్లింపులు ప్రారంభించింది. గోల్ మాల్ అయిన నిధులపై గృహ నిర్మాణశాఖ ఐదేళ్ళుగా ఆయా మహిళా సంఘాలకు నోటీసులు ఇచ్చినప్పటికీ అవి స్పందించడం లేదు. దీంతో ఈ సంఘాలకు ఫైనల్ నోటీసులు ఇచ్చి చట్టపరంగా చర్యలకోసం సిఫార్సు చేయాలని గృహనిర్మాణశాఖ యోచిస్తోంది.