కందుకూరు రూటే సపరేటు
posted on Mar 2, 2012 @ 1:42PM
కందుకూరు: సహజంగా ప్రకాశంజిల్లా గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. ఈ జిల్లాలోని కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ గ్రూపుల ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ఈ గ్రూపులు చేస్తున్న గోలతో అన్ని పార్టీల నాయకులు తలలు పట్టుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేకపాటి రాజమోహనరెడ్డి రాజీనామాను లోక్ సభ స్పీకర్ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో నెల్లూరు లోక్ సభకు జరిగే ఉప ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గ ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది జిల్లాలోనే కాక రాష్ట్రస్థాయిలో కూడా చర్చనీయాశమైంది. కందుకూరు ఎన్నికల రాష్ట్ర మంత్రి మహీధర్ రెడ్డికి సవాలుగా మారాయి. గత ఎన్నికల్లో అటు అసెంబ్లీ, ఇటు లోక్ సభకు కాంగ్రెస్ అభ్యర్ధులకే మెజారిటీ వచ్చింది. అప్పట్లో మహీధర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీచేశారు. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుల్లో ఒకరుగా ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో గెలుపు బాధ్యత అంతా సిఎం ఆయనపైనే ఉంచారు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ మహీధర్ రెడ్డి ఆదినారాయణరెడ్డి ఇక్కడనుంచి స్వతంత్ర అభ్యర్ధిగా గెలుపొందారు. 1994 ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో టిడిపి ప్రభావం భాగా ఉన్నప్పటికీ మహీధర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసి సుమారు ఆరు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధికి 5వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ నియోజకవర్గంలో మానుగుంట, దివి వర్గాల మధ్య గ్రూపుల ప్రభావం నేటికీ కొనసాగుతుంది. ఇక్కడ అగ్రవర్ణాల్లో కమ్మ సామాజిక వర్గం, ఆ తరువాత రెడ్డి సామాజిక వర్గం స్థానికంగా దళిత వర్గాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ గ్రూపుల ప్రభావాల కారణంగానే గత ఎన్నికల్లో కేవలం మూడువేల పైచిలుకు ఓట్లతో మాత్రమే మహీధర్ రెడ్డి గెలుపొందారు.