తీరప్రాంతానికి పెట్రో కారిడార్ చిచ్చు
posted on Mar 2, 2012 @ 11:18AM
భూసేకరణకు సిద్దమవుతున్న అధికార యంత్రాంగం
ఆందోళనలకు సమాయత్తమవుతున్న ప్రజాసంఘాలు
తెలుగువన్.కామ్ స్పెషల్ స్టోరీ
కాకినాడ: కాకినాడ-విశాఖపట్నం తీరప్రాంతం నివురుగప్పిన నిప్పులా ఉంది. ప్రజలు భయాందోళనలతో బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నారు. రెవెన్యూ అధికారులు వస్తే ఉలిక్కిపడుతున్నారు. మందీమార్భలంతో పారిశ్రామికవేత్తలు వస్తే బెంబేలెత్తి పోతున్నారు. ఈ వాతావరణం ఏర్పడటానికి కారణం ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన పెట్రో కారిడార్, తీరప్రాంతంలో ఏర్పాటు చేయనున్న పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్ ఇన్వెస్టిమెంట్ రీజియన్ (పిసిపిఐఆర్) వల్ల తీరప్రాంతంలో వేలాది ఎకరాల భూమిని సేకరించడానికి రెవెన్యూయంత్రాంగం నడుం బిగించింది. ఇదే జరిగితే వేలాదిమంది రైతులు, మత్స్యకారులు ఉపాధి కోల్పోతారు. పచ్చని పంటపొలాలు మైదానాలుగా మారతాయి. కోస్తా తీరమంతా పెట్రో రసాయనాల కాలుష్యంతో విల విలలాడుతుంది. అపార మత్స్య సంపాదకు ముప్పు ఏర్పడుతుంది. తూర్పు గోదావరిజిల్లాలోని తొండంగి మండలంలో పెద్దఎత్తున భూమి సేకరించడానికి రంగం సిద్దమైంది. ఈ ఒక్క మండలంలోనే సుమారు ఏడువేల ఎకరాల భూమిని సేకరించబోతున్నారు. ఈ మండలంలోని ఎవి నగరం, వేమవరం, కోన రెవెన్యూగ్రామం పరిధిలో ఎర్రాయిపేట, జిఎం పేట, దానవాయిపేట, పెరుమాళ్ళపురం గ్రామాల్లో భూములు సేకరించబోతున్నట్లు తెలిసింది. నిజానికి ఈ గ్రామాల్లో కొంత భూమి ఇప్పటికే సెజ్ ఎపిఐఐసి సేకరణలో పోయింది. మరోసారి పెట్రో కారిడార్ పేరుతో భూముల సేకరణకు ప్రయత్నాలు జరుగుతుండటంతో ప్రజలు ప్రజా సంఘాల సహాయంతో తిరుగుబాటుకు సిద్దపడుతున్నారు. ప్రభుత్వం జరిపే భూ సేకరణను ప్రాణాలకు సైతం తెగించి అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు.