కృష్ణా రాజకీయాల్లో విభేదాలు
posted on Apr 1, 2011 @ 12:45PM
గుడివాడ : కృష్ణా జిల్లా టీడీపీ శాఖ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు తీరుపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) తీవ్రంగా మండిపడ్డారు. ఎన్టీఆర్ కుమారుడు, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణను దేవినేని అవమానించారని ఆరోపించారు. ఈ విషయమై పార్టీ అధినేత చంద్రబాబు ఎదుటే తాడోపేడో తేల్చుకుంటానని ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయంలో నాని గురువారం మీడియాతో మాట్లాడారు. గతనెల 28న హరికృష్ణ చల్లపల్లి పోస్టాఫీసులో నూతన రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌ను ప్రారంభించేందుకు వచ్చినపుడు ఆయనకు జిల్లా పార్టీ తరఫున అవమానం జరిగిందన్నారు. మండల పరిషత్ కాంప్లెక్స్ భవనానికి హరికృష్ణతో శంకుస్థాపన చేయించాలని స్థానిక నేతలు ఏర్పాట్లు చేసినా ఆ విషయాన్ని చెప్పకుండా దేవినేని దాచిపెట్టాడని ఆరోపించారు. అందువల్ల శంకుస్థాపనకు హాజరుకాకుండా హరికృష్ణ వెళ్లిపోయారన్నారు. దేవినేని వైఖరి కారణంగా అక్కడి నేతలు కలత చెంది రాజీనామా చేశారని, పార్టీకి తీరని నష్టం జరిగిందన్నారు. ఇందుకు దేవినేని బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పార్టీ ఇతర నేతలను ఆయన కలుపుకుపోవటం లేదని నాని విమర్శించారు. ఏ కార్యక్రమం జరిగినా పార్టీ నాయకులందరికీ సముచిత స్థానం ఇవ్వాలని హితవు పలికారు. రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి వస్తే చూపిన అత్యుత్సాహం, అతి గౌరవం.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వచ్చినపుడు ఏమైపోయాయని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఈ పోకడలను మానకుంటే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కాగా విజయవాడ అర్బన్ టీడీపీ అధ్యక్ష పదవికి శుక్రవారం రాజీనామా చేస్తున్నట్లు వల్లభనేని వంశీ ప్రకటించారు.