భారత్- శ్రీలంక ఫైనల్ మ్యాచ్‌పై జోరుగా బెట్టింగులు
posted on Apr 1, 2011 @ 12:53PM
హైదరాబాద్: ప్రపంచ కప్ కోసం శనివారం అంతిమ పోరులో తలపడుతున్న భారత్-శ్రీలంకలపై బూకీలు భారీగా బెట్టింగులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. రెండు ఉప ఖండ దేశాలు మొదటిసారి ఫైనల్ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. ఉపఖండానికే కప్ ఖాయమైనందున బూకీలు ఇప్పుడు శ్రీలంక, ఇండియాలపై జోరుగా బెట్టింగులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముంబయి వాంఖేడే స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కు బూకీలు సుమారు 5వేలకోట్ల రూపాయల మేర బెట్టింగులకు పాల్పడుతున్నట్టుగా అనుమానిస్తున్నారు. అయితే పోలీసులు ఎంతగా నిఘా వేసినప్పటికీ బెట్టింగు దారులు వెనక్కి తగ్గడం లేదు. ప్రపంచ కప్ ప్రారంభమయినప్పటినుండి పోలీసులు పలువురిని అరెస్టు చేసి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ బెట్టింగు రాయుళ్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అంతేకాదు పాకిస్తాన్, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సెంచరీలపై బెట్టింగు ఈ మారు కొనసాగుతోంది. ఇప్పుడు సచిన్ తన సొంత స్డేడియంలో ఆడుతుంటడం సచిన్‌కు కలిసి వస్తుందని అందరూ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
హైదరాబాదుతో పాటు రాష్ట్రంలోని పలు ముఖ్య నగరాల్లో బెట్టింగ్ రాయుళ్ల జోరు పుంజుకున్నట్టుగా తెలుస్తోంది. నగరంలో పోలీసులు అపార్టుమెంట్లు, పబ్‌లు, కాఫీషాప్‌లు, గెస్టు హవుస్‌లు తదితర వాటిపై దృష్టి సారించారు. బెట్టింగు జరుపుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పోలీసు అధికారి స్టీఫెన్ రవీంద్ర చెబుతున్నారు. బెట్టింగులకు పాల్పడుతున్న వారి సమాచారం అందిస్తే రివార్డులు ఇస్తామని చెబుతున్నారు. కాగా హైదరాబాదులో బెట్టింగుకు పాల్పడుతున్న మరో బూకీని పోలీసులు అరెస్టు చేశారు.